తిరువనంతపురం:కేరళ ఫిల్మ్ అకాడమీ చైర్మన్ పదవికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ గురువారం రాజీనామా చేశారు. రాష్ట్ర సినిమా అకాడమీకి కొత్త కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. గత మూడేళ్ల నుంచి ఫిల్మ్ అకాడమీకి చైర్మన్ గా ఉన్న ప్రియదర్శన్ కాలపరిమితి జూలై నెలాఖరుతో ముగిసింది. ఈ తరుణంలో ఆయన ఈరోజు తన రాజీనామా లేఖను మంత్రిత్వ శాఖకు అందజేశారు. ప్రియదర్శన్ రాజీనామా లేఖ తనకు అందినట్లు కేరళ సినిమా శాఖా మంత్రి తిరుచూర్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వృతిపరమైన ఇబ్బందులు ఉన్నందువల్ల ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రియదర్శన్ ఆ లేఖలో పేర్కొన్నారు. 2011 లో ఫిల్మ్ అకాడమీ చైర్మన్ నుంచి రాజకీయవేత్తగా మారిన కేబీ గుణశేఖర్ నుంచి ప్రియదర్శన్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.