మోదీని టార్గెట్ చేసిన ఐఎస్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కారుబాంబుతో హతమారుస్తామని హెచ్చరించిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. మోదీని అంతమొందిస్తామని ట్విటర్ లో పోస్ట్ చేశారని ఇండియా టీవీ వెల్లడించింది. ముంబై నుంచి ఐఎస్ లో చేరిన నలుగురిలో ఒకరు ఈ ట్విటర్ ఖాతాను నడుపుతున్నట్టు అనుమానిస్తున్నారు.
అయితే ట్విటర్ ఖాతా కలిగిన వ్యక్తి టర్కీకి చెందిన వాడని చూపిస్తోంది. దీన్ని 500 మంది అనుసరిస్తున్నారు. ఇందులో ఇస్లామిక్ స్టేట్ కు అనుకూలంగా 220 మెసేజ్ లున్నాయి. దీని ఐపీ అడ్రస్ తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈ ట్విటర్ ఖాతాను విదేశాల నుంచి నడుపుతున్నారా లేదా భారత్ నుంచా అనేది కనిపెట్టడం కష్టంగా మారింది.
మోదీ, ఒబామా ఇద్దరూ అల్లాకు శత్రువులని, భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వస్తున్న ఒబామాను కారు బాంబు, రసాయన ఆయుధాలతో అంతం చేయాలని జనవరి 25న ఐఎస్ ఉగ్రవాదులు ట్వీట్ చేశారు.