న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ కేబినెట్‌లోని మంత్రులందరూ రెండు నెలల్లోగా తమ ఆస్తులు, అప్పులు, వ్యాపారాల వివరాలను ప్రధానమంత్రికి సమర్పించాలి. తమతో పాటు కుటుంబసభ్యుల పేరిట ఉన్న స్థిరాస్తులు, షేర్లు.. డిబెంచర్ల పూర్తి విలువ సుమారుగా ఎంత, నగదు, ఆభరణాల నిల్వకు సంబంధించిన వివరాలన్నిటినీ వెల్లడించాలి. అంతేకాదు మంత్రులుగా నియూమకం కాకముందు ఏవైనా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటే వాటితో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలి. వ్యాపార సంస్థల యూజమాన్యం, నిర్వహణ నుంచి వైదొలగాలి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మంత్రుల కోసం హోం మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన నియమావళిలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
ఈ నియమావళి అమలును స్వయంగా ప్రధానమంత్రి పర్యవేక్షిస్తారు.
పౌర సేవల విషయంలో రాజకీయ నిష్పాక్షికతను కాపాడాల్సిందిగా ఇందులో మంత్రులకు సూచించారు. ఉన్నతాధికారుల విధులు, బాధ్యతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు వారిపై ఒత్తిడి తేరాదని ఆదేశించారు. మంత్రుల కుటుంబసభ్యులు ప్రభుత్వానికి సేవలందించడం లేదా వస్తువులు సరఫరా చేయడానికి సంబంధించిన ఎలాంటి వ్యాపారాన్నైనా ప్రారంభించడం కానీ లేదా ఆ వ్యాపారంలో పాల్గొనడం కానీ చేసేందుకు వీల్లేదు. కేంద్ర మంత్రులతో పాటు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ / కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు.. తమ భర్త లేదా భార్య, తమపై ఆధారపడినవారు దేశంలో లేదా విదేశంలో ఏ విదేశీ ప్రభుత్వ ఉద్యోగంలోనైనా చేరేందుకు అనుమతించకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం సేకరించినప్పుడు మినహా సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి స్థిరాస్తులను కొనడం కానీ లేదా ప్రభుత్వానికి అమ్మడం కానీ చేయరాదు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పదవిలో కొనసాగే వరకు ప్రతి ఏటా ఆగస్టు 31లోగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రధానికి సమర్పించాలని నియమావళి స్పష్టం చేస్తోంది.