రాగమయూరి మెగా ఫుడ్‌పార్క్..రెండేళ్లలో 60 కంపెనీలు వస్తాయ్ | Punjab, Telangana to get mega food parks | Sakshi
Sakshi News home page

రాగమయూరి మెగా ఫుడ్‌పార్క్..రెండేళ్లలో 60 కంపెనీలు వస్తాయ్

Published Tue, Mar 31 2015 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM

రాగమయూరి మెగా ఫుడ్‌పార్క్..రెండేళ్లలో 60 కంపెనీలు వస్తాయ్

రాగమయూరి మెగా ఫుడ్‌పార్క్..రెండేళ్లలో 60 కంపెనీలు వస్తాయ్

జోరందుకున్న పనులు...
 మహబూబ్‌నగర్‌లో కేజేఆర్ గ్రూప్ ఏర్పాటు
 పార్కులో రూ.2,000 కోట్ల పెట్టుబడులు
 లక్ష మంది రైతులకు ప్రయోజనం
 - ‘సాక్షి’తో గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ, ఇన్‌ఫ్రా రంగంలో కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న కేజేఆర్ గ్రూప్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న రాగమయూరి మెగా ఫుడ్ పార్క్ రెండేళ్లలో సిద్ధం కానుంది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలంలో 125 ఎకరాల్లో రానున్న ఈ ఫుడ్ పార్కులో 60 కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మౌలిక వసతులు, గిడ్డంగులు, గ్రైండింగ్, ప్యాకింగ్ యూనిట్లు, ఆర్‌అండ్‌డీ, ల్యాబ్ తదితర ఏర్పాట్లకుగాను రూ.112 కోట్ల వ్యయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల గ్రాంటు సమకూరుస్తోంది. పార్కు అభివృద్ధి పనులు ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. పార్కు పూర్తి స్థాయిలో అభివృద్ధి అయితే మొత్తం రూ.2,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ప్రత్యక్షంగా 10 వేల మందికి ఉపాధి కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 24న కొత్తగా 17 మెగా ఫుడ్ పార్కులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో మహబూబ్‌నగర్‌లో రాగ మయూరి అగ్రోవెట్, ఖమ్మంలో టీఎస్‌ఐఐసీ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఏపీఐఐసీకి మంజూరయ్యాయి.
 
 అన్ని సౌకర్యాలతో..
 ఫుడ్ పార్కులో రాగమయూరి అగ్రోవెట్ యాంకర్ యూనిట్‌ను రూ.20 కోట్లతో నెలకొల్పుతోంది. శుభమస్తు బ్రాండ్‌తో పప్పు దినుసులు, కూరగాయలు, బియ్యం వంటి ఉత్పత్తులను ప్రాసెస్ చేసి విక్రయించనుంది. 2016 సెప్టెంబర్‌కల్లా ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. కాగా, ఫుడ్ పార్కులో కేంద్రీకృత ప్రాసెసింగ్ యూనిట్, 5 వేల టన్నుల సామర్థ్యంగల శీతల గిడ్డంగి, 80 వేల చదరపు అడుగుల  గిడ్డంగి, గంటకు 3 టన్నుల గుజ్జు తయారీ పల్పింగ్ లైన్, పిండి, పప్పు మిల్లులతోపాటు 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పండ్లు, కూరగాయలు, దినుసులు పండే ప్రాంతాల్లో మండలాల వారీగా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పంట పొలాల నుంచి పార్కుకు తక్కువ సమయంలో తీసుకొచ్చి ఉత్పత్తులకు విలువ చేకూరుస్తామని కంపెనీ అంటోంది.
 
 లక్ష మంది రైతులకు..: తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కర్నాటక రైతులకూ ఈ పార్కు ద్వారా ప్రయోజనం కలుగుతుందని కేజేఆర్ గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పార్కులో ప్రాసెస్ అయ్యే ఉత్పత్తుల విక్రయానికి వాల్‌మార్ట్, రిలయన్స్, స్పెన్సర్స్ వంటి దిగ్గజ కంపెనీలతో మాట్లాడుతున్నట్టు చెప్పారు. ‘ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరటిపండ్లు పులివెందుల ప్రాంతంలో పండుతాయి. రెపైనింగ్ చాంబర్లను కడపజిల్లా పులివెందులలో ఒకటి,  కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నెలకొల్పుతాం. గుంటూరు నుంచి మిర్చి, బళ్లారి, రాయచూరు-పప్పు దినుసులు, పులివెందుల-అరటి, బొప్పాయి, చిత్తూరు-మామిడి, గుంతకల్లు-టమాట, రాయలసీమ నుంచి వేరుశనగ సేకరిస్తాం. పెద్ద కంపెనీలేవైనా ఇక్కడకు వచ్చి తుది ఉత్పత్తులను తమకు కావాల్సిన బ్రాండ్లలో ప్యాక్ చేసుకునేలా సౌకర్యాలు ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచే మార్కెట్ చేసే వీలుండడం పార్కు ప్రత్యేకత’ అని వివరించారు.
 
 ఎలక్ట్రానిక్స్ పార్క్ సైతం..
 కేజేఆర్ గ్రూప్ అనంతపురం జిల్లా కొడికొండ వద్ద 50 ఎకరాల్లో, రూ.50 కోట్ల వ్యయంతో ఎల్సినా రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్ నెలకొల్పుతోంది. భారత్‌లో ప్రైవేటు రంగంలో అనుమతి పొందిన తొలి ఎలక్ట్రానిక్ పార్క్ ఇదే. కేంద్ర గ్రాంటు రూ.19 కోట్లు. ప్రస్తుతం 5 కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసి అడ్వాన్సులు చెల్లించాయని కేజేఆర్ గ్రూప్ సీఈవో కె.భాస్కర్ రెడ్డి తెలిపారు. ‘60 కంపెనీలు వస్తాయని అంచనా. ఆర్‌అండ్‌డీ, ల్యాబ్, శిక్షణ కేంద్రం వంటివి ఏర్పాటు చేస్తున్నాం. రూ.1,000 కోట్ల పెట్టుబడి వస్తుందని ఆశిస్తున్నాం. 10,000 మందికిపైగా ఉపాధి లభిస్తుంది’ అని చెప్పారు. ఎల్‌ఈడీ లైట్లు, సెట్ టాప్ బాక్స్‌ల తయారీ, మెడికల్, ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement