Mega Food Parks
-
దేశంలో 37 మెగా ఫుడ్ పార్కులకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 37 మెగా ఫుడ్ పార్కులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలో గోదావరి మెగా ఆక్వాపుడ్ పార్క్‌కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో 50 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. చిత్తూరులోని శ్రీని పుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా, 16 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. తెలంగాణలోని నిజామాబాద్‌లో స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ఏర్పాటు వల్ల 25 మందికి ప్రత్యక్షంగా, 100 మందికి పరోక్షంగా ఉపాధి చేకూరనున్నట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించారు. పొలం నుంచి మార్కెట్ వరకు నిల్వతో పాటు.. ఆహార ప్రాసెసింగ్ కోసం ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం ఎమ్‌ఎఫ్‌పీఎస్(మెగా ఫుడ్ పార్క్) ప్రాథమిక లక్ష్యం. వ్యవసాయం, రవాణా, లాజిస్టిక్స్, కేంద్రీకృత ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల కల్పన ఇందులో ఉంటుంది. (ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత) మెగా ఫుడ్ పార్కులను స్థాపించడం ద్వారా హబ్, స్పోక్స్ మోడల్ ఆధారంగా క్లస్టర్ ఆధారిత విధానంతో ఈ పథకం పనిచేస్తుంది. ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు (పీపీసీలు), కలెక్షన్ సెంటర్లు (సీసీలు).. సాధారణ సౌకర్యాల రూపంలో పొలం దగ్గర ప్రాధమిక ప్రాసెసింగ్, నిల్వ కోసం మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, విద్యుత్, నీరు ప్రసరించే చికిత్స ప్లాంట్ (ఇటిపి) వంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను ఈ పథకంలో కల్పిస్తారు. (ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ) ఈ పథకం సాధారణ ప్రాంతాలలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం (భూమి వ్యయాన్ని మినహాయించి), కష్టతరమైన కొండ ప్రాంతాలలో అంటే ఈశాన్య ప్రాంతంలో ప్రాజెక్టు వ్యయంలో 75 శాతం (భూమి వ్యయాన్ని మినహాయించి) చొప్పున మూలధన మంజూరు కోసం అందిస్తుంది. సిక్కిం, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఐటీడీపీ రాష్ట్రాల నోటిఫైడ్ ప్రాంతాలతో సహా ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా రూ .50 కోట్లు కేటాయించనుంది. -
తుందుర్రులో మళ్లీ పోలీసు రాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి మెగా ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాటంపై పోలీసులు మళ్లీ ఉక్కుపాదం మోపుతున్నారు. అర్ధరాత్రి ఇళ్లలో తనిఖీల పేరుతో ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణం నెలకొల్పుతున్నారు. గత నాలుగేళ్లుగా కాలుష్యాన్ని పెంచే ఈ ఫుడ్‌పార్కు వద్దని పరిసర గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పంచాయతీ అనుమతులు లేకుండా బలవంతంగా పైపులైన్, 33 కేవీ విద్యుత్‌లైన్‌ను పొలాల మధ్యగా వేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఒక విద్యుత్ స్తంభాన్ని ధ్వంసం చేశారంటూ పోరాట కమిటీ నేతలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి వారి కోసం గాలిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యమే విద్యుత్ స్తంభాన్ని ధ్వంసం చేసి తమపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా పనులు వేగం చేసేందుకు కుట్ర పన్నిందని పోరాట కమిటీ నేతలు ఆరోపిస్తున్నారు. కాలుష్యం కారణంగా తమ జీవితాలు రోడ్డున పడతాయని ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామస్తులు గత నాలుగేళ్లుగా అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారు. వీరిలో పలువురిపై కేసులు పెట్టి జైలుకు పంపినా వెనుకడుగు వేయకుండా ఉద్యమం కొనసాగిస్తున్నారు. మొదట్లో అసలు కాలుష్యమే లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మురుగునీరు పోయేం దుకు అంటూ రూ.11 కోట్లతో పైపులైన్ వేయాలని నిర్ణయించారు. అది కూడా కేవలం ఎనిమిది అంగుళాల పైపులైన్ వేయడం, దాన్ని కూడా పంచాయతీ అనుమతి లేకుండా తుందుర్రు గ్రామం మధ్య నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పైపులైన్‌ను పెదగరువు మీదుగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇదే సమయంలో రైతుల పొలాల్లో నుంచి 33 కేవీ విద్యుత్‌లైన్ వేసే ప్రయత్నం చేశారు. దీన్ని కూడా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. తమ పొలాల్లో నుంచి అనుమతి లేకుండా 33 కేవీ లైన్ ఎలా వేస్తారని నిలదీశారు. విద్యుత్ అధికారులను కూడా నిలదీయడంతో వారు పనులు నిలిపివేశారు. మూడు రోజుల క్రితం 33 కేవీ లైన్ కోసం వేసిన విద్యుత్ స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. దీనిపై విద్యుత్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నర్సాపురం పోలీసులు పోరాట కమిటీ నాయకుల కోసం గత మూడు రోజులుగా గాలిస్తున్నారు. అర్ధరాత్రి సమయాల్లో వాళ్ల ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఇంట్లో మహిళలు మాత్రమే ఒంటరిగా ఉన్న సమయంలో పోలీసులు ఇళ్లంతా తని ఖీలు చేయడంతో పాటు అసభ్యంగా మాట్లాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఐ ప్రవర్తిస్తున్న తీరును వారు తప్పు పడుతున్నారు. దీంతో సదరు ఎస్ఐపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు పోరాటకమిటీ నేతలు సన్నద్ధం అవుతున్నారు. పోలీసుల గాలింపుతో పోరాట కమిటీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే తుందుర్రుకు చెందిన శేషగిరిరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెండు రోజులుగా నర్సాపురం పోలీసు స్టేషన్లోనే ఉంచారు. మిగిలిన వారు కూడా దొరికిన తర్వాత వీరిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నది పోలీసు వ్యూహంగా కనపడుతోంది. ముఖ్యమైన నాయకులను జైలుకు పంపిన తర్వాత ఫ్యాక్టరీకి సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయడంలో భాగంగానే విద్యుత్ స్తంభాలను ఫ్యాక్టరీ యాజమాన్యమే పగులగొట్టించి తమపై కేసులు పెట్టిందని పోరాట కమిటీ నేతలు విమర్శిస్తున్నారు. ఉద్యమకారుడి అరెస్టు తుందుర్రు ఆక్వామెగా ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో నమోదు చేసిన కేసులో సోమవారం ఒక వ్యక్తిని అరెస్టు చేనట్లు నరసాపురం రూరల్ ఎస్సై సీహెచ్ ఆంజనేయులు తెలిపారు. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి శేషగిరిరావు అనే వ్యక్తిపై గతంలో పోలీసులు, ఉద్యోగులపై దౌర్జన్యం, ఘర్షణలకు పాల్పడటం వంటి కేసులకు సంబంధించి కేసు నమోదు చేశామన్నారు. సోమవారం రాత్రి అతనిని అరెస్టు చేసి సెక్షన్ 341, 353, రెడ్‌విత్ 34 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అర్ధరాత్రులు సోదాలా కరెంట్ స్తంభాలు ఎవరో పగలగొట్టారంట. దీంతో రాత్రులు 20 మందికి పైగా పోలీసులు ఇళ్లలోకి వచ్చి మహిళలు అన్న గౌరవం లేకుండా ఇష్టాను సారంగా వ్యవహరించారు. మాకు భయమేసింది. మాకు అండగా ఉండాల్సిన పోలీసులు ఫ్యాక్టరీ వాళ్లకు అండగా నిలబడుతున్నారు. – జవ్వాది వెంకటరమణ, ఎంపీటీసీ, తుందుర్రు బెంబేలెత్తిపోయాం మహిళా పోలీసులు లేకుండా కేవలం మగ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి 20కి మందికిపైగా వచ్చి సోదాలు చేశారు. మాకు భయమేసింది. గతంలో లాగానే మావోళ్లను కొట్టుతున్నారేమోనని అనుకున్నాం. కరెంట్ స్తంభాలు ఎవరో పగలగొడితే మాపై కేసులు పెడుతున్నారు. మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు. – ఆరేటి సత్యవతి, మహిళా పోరాటకమిటీ నాయకురాలు, తుందుర్రు పోలీసుల హైరానాతో ఇబ్బందులు పోలీసోళ్ళే దగ్గరుండి ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్టున్నారు. మాపై వీడియోలు తీసి ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే ఉక్కుపాదం మోపుతున్నారు. ఫ్యాక్టరీవోళ్లు స్పందించడం లేదు. మా ఊళ్లో ఎప్పడూ పోలీసోళ్లను చూసిండం. గత నాలుగు సంవత్సరాలుగా ఖాకీలతో, సైరన్ హారన్లతో కంటిమీద కునుకుపట్టడం లేదు. – సముద్రాల సత్యవాణి, గృహిణి, కంసాలి బేతపూడి ప్రజలకు వ్యతిరేకంగా నిర్మించడం దారుణం గత నాలుగు సంవత్సరాలుగా ఫ్యాక్టరీ వద్దని ప్రజలు పోరాడుతున్నా బలవంతంగా నిర్మిస్తున్నారు. 15 కిలోమీటర్ల పైపులైన్‌ను రూ.11 కోట్లా. అది 8 అంగుళాల పైపా. మళ్లీ రోజుకు ఆ పంపు ద్వారా లక్షా 50 వేల లీటర్ల వ్యర్థ నీరు వెళ్లాలా ఇది దారుణం. దీనిపై కేంద్ర బృందం విచారణ చేపట్టాలి. – డి. కళ్యాణి, ఐద్వా జిల్లా కార్యదర్శి, భీమవరం -
తెలుగురాష్ట్రాల మెగాఫుడ్ పార్క్‌ల లిస్ట్ ఇదే!
దేశవ్యాప్తంగా మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ కింద కేంద్రం ఏర్పాటుచేయబోయే ఆరు మెగా ఫుడ్ పార్క్‌లకు తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు ప్రతిపాదనలు వచ్చినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సహాయమంత్రి నిరంజన్ జ్యోతి చెప్పారు. కేంద్రం ఏర్పాటుచేయబోయే ఈ పార్కులకు 2016 జూలై 31 నుంచి ప్రతిపాదనలు స్వీకరించామని, ఈ గడువు గత నెల ఏడో తేదీతో ముగిసినట్టు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 54 ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది ఒకటి, తెలంగాణకు చెందినవి ఆరు ప్రాంతాలు ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభల్లో మంత్రి ఈ ప్రతిపాదిత పార్క్‌ల వివరాలు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఏపీ, తెలంగాణలు మెగాఫుడ్ పార్క్‌లకు సమర్పించిన ప్రతిపాదిత స్థలాలు.. 1. లేపాక్షి ఆగ్రో ఇండస్ట్రీస్, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ 2. జీ.ఎమ్ రెడ్డి ఫార్మ్స్ ప్రైవేట్.లిమిటెడ్, వరంగల్ జిల్లా, తెలంగాణ 3. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), కరీంనగర్ జిల్లా, తెలంగాణ 4. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), వరంగల్ జిల్లా, తెలంగాణ 5. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), రంగారెడ్డి జిల్లా, తెలంగాణ 6. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఐఐసీ), మెదక్, తెలంగాణ 7. బసవాశక్తి మెగా ఫుడ్ పార్క్ ప్రై.లిమిటెడ్, మెదక్ జిల్లా, తెలంగాణ మెగా ఫుడ్ పార్క్‌ల ఏర్పాటుకు 2008-2015లో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆమోదించిన ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్ జాబితా... 1. శ్రీని ఫుడ్ పార్క్ ప్రై.లిమిటెడ్, చిత్తూరు జిల్లా 2. గోదావరి మెగా ఆక్వా పార్క్ ప్రై.లిమిటెడ్, పశ్చిమగోదావరి జిల్లా 3. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ), కృష్ణా జిల్లా తెలంగాణ జాబితా... 1. స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రై.లిమిటెడ్, నిజామాబాద్ 2. రాగ మయూరి ఆగ్రోవెట్ ప్రై.లిమిటెడ్, మహబూబ్‌నగర్ 3. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఖమ్మం -
రాగమయూరి మెగా ఫుడ్‌పార్క్..రెండేళ్లలో 60 కంపెనీలు వస్తాయ్
జోరందుకున్న పనులు... మహబూబ్‌నగర్‌లో కేజేఆర్ గ్రూప్ ఏర్పాటు పార్కులో రూ.2,000 కోట్ల పెట్టుబడులు లక్ష మంది రైతులకు ప్రయోజనం - ‘సాక్షి’తో గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ, ఇన్ఫ్రా రంగంలో కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న కేజేఆర్ గ్రూప్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న రాగమయూరి మెగా ఫుడ్ పార్క్ రెండేళ్లలో సిద్ధం కానుంది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలంలో 125 ఎకరాల్లో రానున్న ఈ ఫుడ్ పార్కులో 60 కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మౌలిక వసతులు, గిడ్డంగులు, గ్రైండింగ్, ప్యాకింగ్ యూనిట్లు, ఆర్అండ్డీ, ల్యాబ్ తదితర ఏర్పాట్లకుగాను రూ.112 కోట్ల వ్యయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల గ్రాంటు సమకూరుస్తోంది. పార్కు అభివృద్ధి పనులు ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. పార్కు పూర్తి స్థాయిలో అభివృద్ధి అయితే మొత్తం రూ.2,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ప్రత్యక్షంగా 10 వేల మందికి ఉపాధి కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 24న కొత్తగా 17 మెగా ఫుడ్ పార్కులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో మహబూబ్‌నగర్‌లో రాగ మయూరి అగ్రోవెట్, ఖమ్మంలో టీఎస్ఐఐసీ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఏపీఐఐసీకి మంజూరయ్యాయి. అన్ని సౌకర్యాలతో.. ఫుడ్ పార్కులో రాగమయూరి అగ్రోవెట్ యాంకర్ యూనిట్‌ను రూ.20 కోట్లతో నెలకొల్పుతోంది. శుభమస్తు బ్రాండ్‌తో పప్పు దినుసులు, కూరగాయలు, బియ్యం వంటి ఉత్పత్తులను ప్రాసెస్ చేసి విక్రయించనుంది. 2016 సెప్టెంబర్‌కల్లా ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. కాగా, ఫుడ్ పార్కులో కేంద్రీకృత ప్రాసెసింగ్ యూనిట్, 5 వేల టన్నుల సామర్థ్యంగల శీతల గిడ్డంగి, 80 వేల చదరపు అడుగుల గిడ్డంగి, గంటకు 3 టన్నుల గుజ్జు తయారీ పల్పింగ్ లైన్, పిండి, పప్పు మిల్లులతోపాటు 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పండ్లు, కూరగాయలు, దినుసులు పండే ప్రాంతాల్లో మండలాల వారీగా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పంట పొలాల నుంచి పార్కుకు తక్కువ సమయంలో తీసుకొచ్చి ఉత్పత్తులకు విలువ చేకూరుస్తామని కంపెనీ అంటోంది. లక్ష మంది రైతులకు..: తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కర్నాటక రైతులకూ ఈ పార్కు ద్వారా ప్రయోజనం కలుగుతుందని కేజేఆర్ గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పార్కులో ప్రాసెస్ అయ్యే ఉత్పత్తుల విక్రయానికి వాల్‌మార్ట్, రిలయన్స్, స్పెన్సర్స్ వంటి దిగ్గజ కంపెనీలతో మాట్లాడుతున్నట్టు చెప్పారు. ‘ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరటిపండ్లు పులివెందుల ప్రాంతంలో పండుతాయి. రెపైనింగ్ చాంబర్లను కడపజిల్లా పులివెందులలో ఒకటి, కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నెలకొల్పుతాం. గుంటూరు నుంచి మిర్చి, బళ్లారి, రాయచూరు-పప్పు దినుసులు, పులివెందుల-అరటి, బొప్పాయి, చిత్తూరు-మామిడి, గుంతకల్లు-టమాట, రాయలసీమ నుంచి వేరుశనగ సేకరిస్తాం. పెద్ద కంపెనీలేవైనా ఇక్కడకు వచ్చి తుది ఉత్పత్తులను తమకు కావాల్సిన బ్రాండ్లలో ప్యాక్ చేసుకునేలా సౌకర్యాలు ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచే మార్కెట్ చేసే వీలుండడం పార్కు ప్రత్యేకత’ అని వివరించారు. ఎలక్ట్రానిక్స్ పార్క్ సైతం.. కేజేఆర్ గ్రూప్ అనంతపురం జిల్లా కొడికొండ వద్ద 50 ఎకరాల్లో, రూ.50 కోట్ల వ్యయంతో ఎల్సినా రాగమయూరి ఎలక్ట్రానిక్స్ పార్క్ నెలకొల్పుతోంది. భారత్‌లో ప్రైవేటు రంగంలో అనుమతి పొందిన తొలి ఎలక్ట్రానిక్ పార్క్ ఇదే. కేంద్ర గ్రాంటు రూ.19 కోట్లు. ప్రస్తుతం 5 కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసి అడ్వాన్సులు చెల్లించాయని కేజేఆర్ గ్రూప్ సీఈవో కె.భాస్కర్ రెడ్డి తెలిపారు. ‘60 కంపెనీలు వస్తాయని అంచనా. ఆర్అండ్డీ, ల్యాబ్, శిక్షణ కేంద్రం వంటివి ఏర్పాటు చేస్తున్నాం. రూ.1,000 కోట్ల పెట్టుబడి వస్తుందని ఆశిస్తున్నాం. 10,000 మందికిపైగా ఉపాధి లభిస్తుంది’ అని చెప్పారు. ఎల్ఈడీ లైట్లు, సెట్ టాప్ బాక్స్‌ల తయారీ, మెడికల్, ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. -
మరో 2 మెగా ఫుడ్ పార్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, సీమాంధ్ర రైతులకు శుభవార్త. చిత్తూరులో శ్రీని ఫుడ్ పార్కు విజయవంతం కావడంతో మరో రెండు మెగా ఫుడ్ పార్కులకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్కులు వచ్చే ఏడాది కార్యరూపం దాల్చనున్నాయని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. అసోచాం ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ నిజామాబాద్‌కు సమీపంలో, గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వద్ద మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. వీటి ద్వారా తెలంగాణలో వరి, మొక్కజొన్న, పసుపు, సోయా రైతులకు, ఆంధ్ర ప్రాంతంలోని చేపలు, రొయ్యల పెంపకందారులకు మేలు జరుగుతుందని అన్నారు. ఉపాధి అవకాశాలు: మొక్కజొన్నతో అటుకులు, ఇథనాల్, దాణా, పిండి వంటి 14 రకాల ఉప ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ రూ.60 కోట్లతో నిజామాబాద్ పార్కులో రానుంది. డెయిరీ యూనిట్‌కు రూ.30 కోట్లు, పసుపు ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.15 కోట్లు వ్యయం చేస్తున్నారు. అయిదేళ్లలో 15 పరిశ్రమలు, రూ.500 కోట్ల పెట్టుబడులు రావొచ్చని స్మార్ట్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ డెరైక్టర్ పటలోల్ల మోహన్ తెలిపారు. పార్కు పూర్తయితే 3,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.370 ఎకరాలకుగాను 120 ఎకరాల్లో పార్కు రానుందని, మిగిలిన స్థలంలో వ్యవసాయోత్పత్తుల యూనిట్లు వస్తాయన్నారు. తెలంగాణకు చెందిన ఎన్నారైలు పైల మల్లారెడ్డి, రమేశ్ కంభం, పటలోల్ల మోహన్ ప్రధాన ప్రమోటర్లు. మౌలిక వసతులకయ్యే రూ.120 కోట్ల వ్యయంలో ప్రమోటర్లు రూ.70 కోట్లు, కేంద్రం రూ.50 కోట్లు సమకూరుస్తోంది. 2015 చివరకు నిర్మాణం పూర్తవుతుంది. రెడీ టు ఈట్: భీమవరం సమీపంలో ఏర్పాటవుతున్న మెగా ఫుడ్ పార్కులో రొయ్యలు, చేపల ప్రాసెంగ్ చేపడతారు. రెడీ టు ఈట్ ఉత్పత్తులు కూడా తయారు చేస్తారు. అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు వీటిని ఎగుమతి చేస్తారు. ఆనంద గ్రూపు నేతృత్వంలో మొత్తం అయిదు కంపెనీలు పార్కును ప్రమోట్ చేస్తున్నాయి. 55 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ పార్కుకు మౌలిక వసతులకు రూ.125 కోట్లు వ్యయం చేస్తున్నారు. కేంద్రం రూ.50 కోట్లు సమకూర్చింది. 30 కంపెనీలు ఇక్కడ యూనిట్లు పెట్టే అవకాశం ఉంది. రూ.800 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్టు ఆనంద గ్రూపు వైస్ ప్రెసిడెంట్ యు.జోగి ఆనంద్ వర్మ తెలిపారు. పార్కు ద్వారా 2,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. సింగిల్ విండో మేలు: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు 15-20 అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. 150 మందికిపైగా అధికారులు ప్రతిపాదన పత్రాలను పరిశీలిస్తున్నారు. ఇదంతా సమయం వృథా. సింగిల్ విండో క్లియరెన్సుల విధానమే పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ స్పష్టం చేశారు. ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తోంది. అయితే చాలా యూనిట్లు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాయని, తెలంగాణలో మరింత కృషి జరగాలన్నారు. అనుమతుల ప్రక్రియే పెద్ద అడ్డంకి అని హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీ రవీంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత రంగంగా గుర్తించినప్పుడే ఫుడ్ ప్రాసెసింగ్ కొత్త పుంతలు తొక్కుతుందని అసోచాం దక్షిణ ప్రాంత చైర్మన్ సన్నారెడ్డి తెలిపారు.