తుందుర్రులో మళ్లీ పోలీసు రాజ్యం | Again Police Kingdom in Thundurru | Sakshi
Sakshi News home page

తుందుర్రులో మళ్లీ పోలీసు రాజ్యం

Published Tue, Mar 6 2018 10:53 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

Again Police Kingdom in Thundurru - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి మెగా ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాటంపై పోలీసులు మళ్లీ ఉక్కుపాదం మోపుతున్నారు. అర్ధరాత్రి ఇళ్లలో తనిఖీల పేరుతో ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణం నెలకొల్పుతున్నారు. గత నాలుగేళ్లుగా కాలుష్యాన్ని పెంచే ఈ ఫుడ్‌పార్కు వద్దని పరిసర గ్రామ ప్రజలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పంచాయతీ అనుమతులు లేకుండా బలవంతంగా పైపులైన్, 33 కేవీ విద్యుత్‌లైన్‌ను పొలాల మధ్యగా వేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు.

దీంతో ఒక విద్యుత్‌ స్తంభాన్ని ధ్వంసం చేశారంటూ పోరాట కమిటీ నేతలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి వారి కోసం గాలిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యమే విద్యుత్‌ స్తంభాన్ని ధ్వంసం చేసి తమపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా పనులు వేగం చేసేందుకు కుట్ర పన్నిందని పోరాట కమిటీ నేతలు ఆరోపిస్తున్నారు. కాలుష్యం కారణంగా తమ జీవితాలు రోడ్డున పడతాయని ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామస్తులు గత నాలుగేళ్లుగా అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారు.

వీరిలో పలువురిపై కేసులు పెట్టి జైలుకు పంపినా వెనుకడుగు వేయకుండా ఉద్యమం కొనసాగిస్తున్నారు. మొదట్లో అసలు కాలుష్యమే లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మురుగునీరు పోయేం దుకు అంటూ రూ.11 కోట్లతో పైపులైన్‌ వేయాలని నిర్ణయించారు. అది కూడా కేవలం ఎనిమిది అంగుళాల పైపులైన్‌ వేయడం, దాన్ని కూడా పంచాయతీ అనుమతి లేకుండా తుందుర్రు గ్రామం మధ్య నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పైపులైన్‌ను పెదగరువు మీదుగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.

ఇదే సమయంలో రైతుల పొలాల్లో నుంచి 33 కేవీ విద్యుత్‌లైన్‌ వేసే ప్రయత్నం చేశారు. దీన్ని కూడా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. తమ పొలాల్లో నుంచి అనుమతి లేకుండా 33 కేవీ లైన్‌ ఎలా వేస్తారని నిలదీశారు. విద్యుత్‌ అధికారులను కూడా నిలదీయడంతో వారు పనులు నిలిపివేశారు. మూడు రోజుల క్రితం 33 కేవీ లైన్‌ కోసం వేసిన విద్యుత్‌ స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. దీనిపై విద్యుత్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నర్సాపురం పోలీసులు పోరాట కమిటీ నాయకుల కోసం గత మూడు రోజులుగా గాలిస్తున్నారు. అర్ధరాత్రి సమయాల్లో వాళ్ల ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు.

ఇంట్లో మహిళలు మాత్రమే ఒంటరిగా ఉన్న సమయంలో పోలీసులు ఇళ్లంతా తని ఖీలు చేయడంతో పాటు అసభ్యంగా మాట్లాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌ఐ ప్రవర్తిస్తున్న తీరును వారు తప్పు పడుతున్నారు. దీంతో సదరు ఎస్‌ఐపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు పోరాటకమిటీ నేతలు సన్నద్ధం అవుతున్నారు. పోలీసుల గాలింపుతో పోరాట కమిటీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే తుందుర్రుకు చెందిన శేషగిరిరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెండు రోజులుగా నర్సాపురం పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు.

మిగిలిన వారు కూడా దొరికిన తర్వాత వీరిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలన్నది పోలీసు వ్యూహంగా కనపడుతోంది. ముఖ్యమైన నాయకులను జైలుకు పంపిన తర్వాత ఫ్యాక్టరీకి సంబంధించిన పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయడంలో భాగంగానే విద్యుత్‌ స్తంభాలను ఫ్యాక్టరీ యాజమాన్యమే పగులగొట్టించి తమపై కేసులు పెట్టిందని పోరాట కమిటీ నేతలు విమర్శిస్తున్నారు. 

ఉద్యమకారుడి అరెస్టు
తుందుర్రు ఆక్వామెగా ఫుడ్‌ ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో నమోదు చేసిన కేసులో సోమవారం ఒక వ్యక్తిని అరెస్టు చేనట్లు నరసాపురం రూరల్‌ ఎస్సై సీహెచ్‌ ఆంజనేయులు తెలిపారు. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి శేషగిరిరావు అనే వ్యక్తిపై గతంలో పోలీసులు, ఉద్యోగులపై దౌర్జన్యం, ఘర్షణలకు పాల్పడటం వంటి కేసులకు సంబంధించి కేసు నమోదు చేశామన్నారు. సోమవారం రాత్రి అతనిని అరెస్టు చేసి సెక్షన్‌ 341, 353, రెడ్‌విత్‌ 34 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.  

అర్ధరాత్రులు సోదాలా
కరెంట్‌ స్తంభాలు ఎవరో పగలగొట్టారంట. దీంతో రాత్రులు 20 మందికి పైగా పోలీసులు ఇళ్లలోకి వచ్చి మహిళలు అన్న గౌరవం లేకుండా ఇష్టాను సారంగా వ్యవహరించారు. మాకు భయమేసింది. మాకు అండగా ఉండాల్సిన పోలీసులు ఫ్యాక్టరీ వాళ్లకు అండగా నిలబడుతున్నారు. 
– జవ్వాది వెంకటరమణ, ఎంపీటీసీ, తుందుర్రు


బెంబేలెత్తిపోయాం
మహిళా పోలీసులు లేకుండా కేవలం మగ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి 20కి మందికిపైగా వచ్చి సోదాలు చేశారు. మాకు భయమేసింది. గతంలో లాగానే మావోళ్లను కొట్టుతున్నారేమోనని అనుకున్నాం. కరెంట్‌ స్తంభాలు ఎవరో పగలగొడితే మాపై కేసులు పెడుతున్నారు. మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు.
– ఆరేటి సత్యవతి, మహిళా పోరాటకమిటీ నాయకురాలు, తుందుర్రు


పోలీసుల హైరానాతో ఇబ్బందులు 
పోలీసోళ్ళే దగ్గరుండి ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్టున్నారు. మాపై వీడియోలు తీసి ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే ఉక్కుపాదం మోపుతున్నారు.  ఫ్యాక్టరీవోళ్లు స్పందించడం లేదు. మా ఊళ్లో ఎప్పడూ పోలీసోళ్లను చూసిండం. గత నాలుగు సంవత్సరాలుగా ఖాకీలతో, సైరన్‌ హారన్లతో కంటిమీద కునుకుపట్టడం లేదు.
– సముద్రాల సత్యవాణి, గృహిణి, కంసాలి బేతపూడి


ప్రజలకు వ్యతిరేకంగా నిర్మించడం దారుణం
గత నాలుగు సంవత్సరాలుగా ఫ్యాక్టరీ వద్దని ప్రజలు పోరాడుతున్నా బలవంతంగా నిర్మిస్తున్నారు. 15 కిలోమీటర్ల  పైపులైన్‌ను రూ.11 కోట్లా. అది 8 అంగుళాల పైపా. మళ్లీ రోజుకు ఆ పంపు ద్వారా లక్షా 50 వేల లీటర్ల వ్యర్థ నీరు వెళ్లాలా ఇది దారుణం. దీనిపై కేంద్ర బృందం విచారణ చేపట్టాలి.
– డి. కళ్యాణి, ఐద్వా జిల్లా కార్యదర్శి, భీమవరం 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement