ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఏలూరు: గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌సీసీ రోడ్డు ప్రాంతానికి చెందిన నరేంద్ర (22) అనే చోరీ కేసు నిందితుడు గురువారం ఏలూరులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నరేంద్ర ఇటీవల మంగళగిరి షరాఫ్ బజార్‌లో గల తన బంగారు దుకాణానికి వచ్చి రూ.19 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించాడని షాపు యజమాని కొల్లి గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వైజాగ్‌లో పట్టుబడ్డ నిందితుడు!
నిందితుడు నరేంద్ర విశాఖపట్నంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు బాధితుడు, అతనికి సన్నిహితంగా ఉండే రాజకీయ నేతలతో కలసి అక్కడికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ నరేంద్రను అదుపులోకి తీసుకుని తిరిగి తీసుకువస్తుండగా, ఏలూరు వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. దీంతో వారు వెంటనే అతన్ని ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని ధృవీకరించారు. ఆస్పత్రి వైద్యులు ఏలూరు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మృతదేహం హాస్పిటల్ మార్చురీలో ఉంది. ఏలూరు ఆర్‌డీవో ఆదేశాల మేరకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిట్సా.. గుండె నొప్పా?
గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో నిందితుడు నరేంద్రకు ఫిట్స్ వచ్చాయని, అనంతరం గుండెనొప్పితో మృతిచెందాడని నరేంద్ర తల్లిదండ్రులు వి.కూర్మయ్య, లక్ష్మీనారాయణలకు పోలీసులు సమాచారమిచ్చారు. వెంటనే ఏలూరుకు చేరుకున్న మృతుని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తమ కుమారుడి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. తమ కుమారుడికి ఫిట్స్ కానీ, ఎలాంటి అనారోగ్యం గానీ లేవని ఈ సందర్భంగా వారు చెబుతున్నారు. తమ కుమారుడి వద్ద విశాఖపట్నంలోనే బంగారం స్వాధీనం చేసుకున్నారని, ఏలూరు వచ్చేసరికి తమ కుమారుడికి ఏమి జరిగిందో చెప్పాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని రాజీ చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment