నిందితుల వివరాలు వెల్లడిస్తోన్న డీఎస్పీ దిలీప్‌కిరణ్
సాక్షి, ఏలూరు: అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ రోజున అన్నకు రాఖీ కట్టింది... అంతలోనే మానవ సంబంధాల్ని మంటగలుపుతూ సొంత అన్నని హత్యచేసింది. ఆస్తికోసం తన భర్త, స్నేహితుడితో కలిసి పక్కా ప్రణాళికతో అన్నను రోకలిబండతో కొట్టించి హత్య చేయించిది. ఈ కేసులో చెల్లి హేమలత, ఆమె భర్త వీరకుమార్, స్నేహితుడు మల్లికార్జునరావును పోలీసులు అరెస్టు చేశారు.
ఏలూరు డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్ కేసు వివరాలు వెల్లడించారు. ఏలూరు టూటౌన్ పరిధిలో ఆగస్టు 5న బీడీ కాలనీ సమీపంలోని పుష్పలీలానగర్ తుప్పల్లో ఖండవల్లి శేఖర్‌బాబు మృతదేహం పడి ఉంది. మృతుడు ఏలూరు ఆర్‌ఎంఎస్ కాలనీకి చెందిన పెయింటర్‌గా గుర్తించారు. మృతుడి భార్య కృష్ణవేణి చెప్పిన వివరాల మేరకు మృతుడు శేఖర్‌బాబు ఒంటిపై ఉండాల్సిన బంగారు చైన్, పల్సర్ బైక్, సెల్‌ఫోన్ మాయం కావటంపై పోలీసులు దృష్టి పెట్టారు. (కన్నకొడుకే లైంగికంగా.. హత్యకు తల్లి సుపారీ)
రోకలిబండతో మోది హత్య
వివాహమై కొంతకాలమైనా శేఖర్‌బాబుకు ఇంకా పిల్లలు లేరు. శేఖర్‌ను అడ్డుతొలగించుకుంటే ఆస్తి, డబ్బు తన సొంతం అవుతుందని చెల్లి హేమలత కుట్రపూరిత ఆలోచన చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తల్లి పదవీవిరమణ చేస్తే వచ్చే డబ్బు మొత్తానికి తానే హక్కుదారు అవుతాననే దురాశతో అన్న హత్యకు భర్తతో కలిసి పథకం రచించింది. హేమలత, ఆమె భర్త వీరకుమార్, స్నేహితుడు పాతూరి మల్లికార్జునరావు ముగ్గురు కలిసి ఇంటికి వచ్చిన శేఖర్‌బాబును రోకలిబండతో తలపై మోది హత్య చేశారు.
అనంతరం మృతుడి శరీరంపై ఉన్న బంగారు గొలుసు, మోటారు సైకిల్, సెల్‌ఫోన్ కాజేశారు. ఎవరికీ అనుమానం రాకుండా పుష్పలీలానగర్‌లోని తుప్పల్లో మృతదేహాన్ని పడేశారు. కేసును ఛేదించిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితుల నుంచి శేఖర్‌బాబుకు చెందిన బంగారు గొలుసు, హత్యకు వాడిన రోకలిబండ, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment