
కమల దళంలోకి పురందేశ్వరి
బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సమక్షంలో పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి
బేషరతుగా బీజేపీలోకి వచ్చానని స్పష్టీకరణ
విభజన విషయంలో కాంగ్రెస్ తీరు బాధ కలిగించిందని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. గత నెలలో తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రి ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను బేషరతుగా బీజేపీలో చేరానని, పార్టీ దిశానిర్దేశం మేరకు ముందుకెళ్తానని ఆమె తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీరు బాధ కలిగించిందని అన్నారు.
సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి జాతీయ పార్టీ బీజేపీయే సరైనదని భావించినట్టు చెప్పారు. ‘‘రాష్ట్రం సమైక్యంగా ఉండాలని భావించా. కానీ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి, సీమాంధ్ర అభివృద్ధికి కొన్ని షరతులను జీవోఎం, ఆంటోని కమిటీకి చెప్పాం. వాటిని బిల్లులో సరిగా పెట్టలేదు. ఇది బాధ కలిగించింది. బీజేపీ నేత వెంకయ్యనాయుడు రాజ్యసభలో గట్టిగా పట్టుబట్టిన తర్వాత ప్రధాని సీమాంధ్రకు ప్యాకేజీ ప్రకటించారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా. మరికొంతకాలం కొనసాగాలని నా భర్త, కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు ఒత్తిడి తెచ్చారు. దీంతో జాతీయ పార్టీలో చేరితే మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయొచ్చని భావించి బీజేపీలో చేరాను. నా తండ్రితో ఉన్న సంబంధాలు, గత పదేళ్లలో నా పనితీరు నచ్చి బీజేపీ అగ్రనేతలు నన్ను ఆదరించారు’’ అని చెప్పారు. పురందేశ్వరి రామాయపట్నం వద్ద వెయ్యి ఎకరాలు కొన్నారని, అక్కడే పోర్టు పెట్టాలని డిమాండ్ చేశారని, అది రాకపోవడంతో పార్టీని వీడారని కేంద్ర మంత్రి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘అది వారి అవగాహన రాహిత్యం. ఆయన ఏం మాట్లాడారో వినకుండా నేను సమాధానం చెప్పడం సరికాదు. సీమాంధ్రకు ఏదైతే కావాలని చెప్పానో అది రానందుకు బాధకలిగింది’’ అని బదులిచ్చారు.
ప్రజాదరణ ఉన్నవారికి ప్రోత్సాహం: వెంకయ్య
మంచి వ్యక్తిత్వం, ప్రజాదరణ ఉన్నవారిని బీజేపీ ప్రోత్సహిస్తుందని వెంకయ్యనాయుడు చెప్పారు. మోడీ నాయకత్వాన్ని బలపర్చి, బీజేపీని సమర్థించే వారికి స్వాగతం పలుకుతామన్నారు. పురందేశ్వరి చేరికతో పార్టీకి, ప్రజలకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నవారు, ప్రముఖులు మరికొందరు బీజేపీలో చేరడానికి సుముఖత తెలుపుతున్నారని, వారి పేర్లు ఇప్పుడే చెప్పనని అన్నారు. విభజన హామీలను బీజేపీ, మోడీయే అమలు చేస్తారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్యాకేజీ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ముందే ఉంటే రాజ్యసభలో వెంకయ్యనాయుడుకు మాట్లాడే అవకాశం వచ్చేదికాదన్నారు. రాజ్యసభలో ఇచ్చిన హామీలు, బిల్లులో పొందుపర్చిన అంశాలన్నీ తమ ఒత్తిడి వల్లే సాధ్యమయ్యాయని, అవి ఎవరు అమలు చేయగలరో ప్రజలు ఆలోచించాలని అన్నారు.
అగ్రనేతలను కలసిన పురందేశ్వరి
బీజేపీలో చేరక ముందు పురందేశ్వరి ఆ పార్టీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్, సుష్మాలను కలిశారు. తొలుత అద్వానీ నివాసంలో రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. పార్టీలో పురందేశ్వరి చేరిక, లోక్‌సభ స్థానం కేటాయింపుపై చర్చించారు. అనంతరం రాజ్‌నాథ్ వెళ్లిపోయిన కొద్దిసేపటికి అద్వానీ నివాసానికి పురందేశ్వరి వెళ్లారు. అక్కడ వెంకయ్య సమక్షంలో అద్వానీ, సుష్మాల ఆశీర్వాదం తీసుకున్నారు. వారిద్దరూ ఆమెను పార్టీలోకి స్వాగతించారు.
అనంతరం పురందేశ్వరి అశోకా రోడ్‌లోని రాజ్‌నాథ్ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. రాజ్‌నాథ్ సమక్షంలో పార్టీలో చేరారు. హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర పార్టీ నాయకత్వం సమక్షంలో సభ్యత్వం తీసుకోవాలని రాజ్‌నాథ్ సూచించారు. ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖపట్నం నుంచి లేదా విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని పురందేశ్వరి ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది.
‘రాజకీయాలకు గుడ్‌బై’
కారంచేడు, న్యూస్‌లైన్: పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లోనే రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా పురందేశ్వరి నేను లేకపోతే తానూ ఉండనని చెప్పడంతో పోటీ చేశానన్నారు. అందరి సహకారంతో మళ్లీ గెలవగలిగానని, అవకాశం, అదృష్టంతోనే ఇంతవరకు రాజకీయ జీవితం కొనసాగించానని చెప్పారు. తాను తప్పుకుంటే ఇంకొకరికి అవకాశం కల్పించవచ్చనే వైదొలగుతున్నట్లు దగ్గుబాటి పేర్కొన్నారు.