
మంత్రి పదవికి, పార్టీకి పురందేశ్వరి రాజీనామా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు సీమాంధ్ర నేతలు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఈ కోవలో కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా చేరారు. తన మంత్రి పదవితో పాటు, పార్టీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. సీమాంధ్రల అభిప్రాయాలను గౌరవించకుండా లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన తీరు సరిగా లేనందునే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి ఫ్యాక్స్ లో తన రాజీనామా లేఖను పంపారు.
సీమాంధ్ర సభ్యుల గందరగోళం మధ్య మూజువాణి ఓటు ద్వారా విభజన బిల్లు తంతును ముగించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ బిల్లుపై సభలో 23 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. బిజెపి మద్దతుతో సభలో బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లుపై కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైపాల్ రెడ్డి, ప్రతిపక్ష బిజెపి నేత సుష్మాస్వరాజ్ మాట్లాడారు. సుష్మాస్వరాజ్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. బిల్లు ఆమోదించే సమయంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్పర్స్ సోనియా గాంధీ సభలోనే ఉన్నారు.