
ఖతార్ సంచలన నిర్ణయం: కఫాలా రద్దు
దోహా: గల్ఫ్ దేశం ఖతార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆధునిక బానిసత్వంగా భావించే ‘కఫాలా’ పని వ్యవస్థను సమూలంగా రద్దు చేసింది. డిసెంబర్ 13(మంగళవారం) నుంచే ఈ నిర్ణయాన్ని అమలులోకి తెస్తామని ఖతార్ కార్మికశాఖ మంత్రి ఇసా బిన్ సాద్ అల్ జఫాలి ప్రకటించారు. కార్మిక చట్టం నంబర్ 21, 2015 ఆధారంగా కఫాలాను రద్దుచేశామని, ఇకపై తమ దేశంలో పనిస్తోన్న, పనిచేయగోరే విదేశీ కార్మికులను ‘కాంట్రాక్టు కార్మికులు’గా గుర్తిస్తామని ఆయన చెప్పారు. ఈ నిర్ణయంతో ఖతార్‌లో పనిచేస్తోన్న భారతీయులు సహా మొత్తం 21 లక్షల మంది విదేశీ కార్మికులకు మేలు జరగనుంది.
ఏమిటీ కఫాలా?: ఖతార్ సహా సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఒమన్, యూఏఈల్లో 'కఫాలా' వ్యవస్థ అమలులో ఉంది. దీని ప్రకారం.. ఉద్యోగార్థులు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అనుమతి పొందాలంటే కఫాలా (స్పాన్సర్‌షిప్ లెటర్) తప్పనిసరి. ఇది ఒక అభ్యర్థిని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం. ఇది ఉంటేనే వీసా చేతికందుతుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ (ఈసీఆర్) జాబితాలో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇది తప్పనిసరి. పనిలో చేరాక కార్మికుల వీసాలు యజమానుల అధీనంలో ఉంటాయి. దీంతో యజమానుల అనుమతి లేకుండా కార్మికులు పని మారేందుకు వీలుండదు. యజమాని ఎంత ఇబ్బంది పెట్టినా అతడి దగ్గరే పడి ఉండాలి. భరించలేక పారిపోతే మాత్రం జైలు, జరిమానా వంటి శిక్షలు తప్పవు. ఇళ్లలో పనిమనుషులు కఫాలా వ్యవస్థ వల్ల దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
ఎందుకీ సంచలన నిర్ణయం?: కార్మికుల విషయంలో, మరీ ముఖ్యంగా విదేశీ కార్మికులపై ఉక్కుపాదంలాంటి చట్టాలకు నెలవైన ఖతార్.. కఫాలా వ్యవస్థను రద్దు చేయడానికి బలమైన కారణం ఫుట్‌బాల్ వరల్డ్‌కప్! అవును. 2022 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీని ఖతార్ నిర్వహించనుంది. ఆ భారీ ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్ల ఖర్చుతో కొత్త స్టేడియాలు, ఇతర నిర్మాణాలను చేపట్టనుంది. ఈ క్రమంలో భారత్ నుంచేకాక పలు దేశాల నుంచి కార్మికులను పనిలో కుదుర్చుకోవాలనుకుంది. అయితే ‘కఫాలా’ విధానానికి భయపడి చాలా మంది స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులు ఖతార్‌లో పనిచేసేందుకు విముఖత ప్రదర్శించారు. అంతర్జాతీయ సమాజం కూడా ఆ(కఫాలా)విధానాన్ని తూర్పారపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఖతార్ తన కార్మిక విధానాలను మార్చుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు గత ఏడాది ప్రకటించారు. ఆ విధాన నిర్ణయాలకు కొనసాగింపుగా సోమవారం ‘కఫాలా’ విధాన్ని రద్దుచేశారు. కొత్త(కాంట్రాక్టు) విధానంలోనూ ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామని, ఈ మేరకు అంతర్జాతీయ సమాజం నుంచి సలహాలు కూడా స్వీకరిస్తామని మంత్రి అల్ జఫాలి చెప్పారు.