ఆ ప్రశ్న అడిగినందుకు హీరోయిన్ ఆగ్రహం!
తన అభినయంతో బాలీవుడ్‌లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ రాధికా ఆప్తే. 'కబాలి' సినిమాతో ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు తాజాగా 'పర్చెడ్' సినిమాలో బోల్డ్ నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ సినిమాలో రాధికా ఆప్తే నటించిన నగ్న శృంగార దృశ్యాలు ఆన్‌లైన్‌లో లీకై దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నగ్న దృశ్యాల లీక్ గురించి ప్రశ్నించిన ఓ విలేకరిపై రాధికా ఆప్తే ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సారీ, మీ ప్రశ్న చాలా మూర్ఖంగా ఉంది. మీలాంటి వ్యక్తుల వల్లే వివాదాలు పుడుతాయి. మీరు ఆ దృశ్యాన్ని చూశారు. దానిని ఇతరులతో పంచుకున్నారు. కాబట్టి మీరే ఆ వివాదాన్ని సృష్టించారు' అంటూ ఆ విలేకరికి ఆమె షాకిచ్చారు.
'పర్చెడ్' సినిమాలో రాధికా ఆప్తే, అదిల్ హుస్సేన్ మధ్య ఉన్న రొమాంటిక్ దృశ్యాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఆ ఒక్క దృశ్యం కన్నా ఎంతో కీలకమైన కథాంశం ఉందని, స్త్రీల దృక్కోణంలో సినిమా తెరకెక్కిందని చిత్ర రూపకర్తలు తెలిపారు. ఏమాత్రం బెదరకుండా మనస్సులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే రాధికా ఆప్తే ఈ వివాదంపై గతంలో స్పందించారు. ఆ ఒక్క దృశ్యం గురించి వివాదం చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. తానొక నటిని అని, తాను ఎలాంటి పాత్ర వచ్చినా దానిని చేయాల్సి ఉంటుందని, అంతర్జాతీయ సినిమాలను గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుందని ఆమె పేర్కొంది.