
వాళ్ల ఫ్యామిలీ మొత్తం సూటుబూట్ల ఫ్యామిలీయే!
న్యూఢిల్లీ: 'సూట్ బూట్ కీ సర్కార్'... కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు రెండు నెలల పాటు కనిపించకుండా పోయి తిరిగొచ్చిన తర్వాత తొలి రోజు పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్న మాటలివి. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా రాహుల్ ఈ విమర్శ చేస్తూనే ఉన్నారు. ఈ మాటలపై బీజేపీ నేత రామ్ మాధవ్ స్పందించారు. రాహుల్ గాంధీ తమ ప్రభుత్వాన్ని సూట్ బూట్ కీ సర్కార్ అన్నారని అయితే రాహుల్ కుటుంబమంతా కూడా సూట్ బూట్లు వేసుకొనే ఉంటారుగా అని ఆయన అన్నారు. రాహుల్ అలా అనడం ద్వారా ప్రజలకు తమ గురించి ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదని చెప్పారు. రాహుల్ బావ రాబర్ట్ వాద్రాను కూడా రామ్ మాధవ్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సూట్ బూట్ వేసుకొని హర్యానాలో రాబర్ట్ వాద్రా అక్రమంగా భూలావాదేవీలకు పాల్పడలేదా అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ పెద్దతప్పులు చేసే నాయకుడని, ఆయన మాటలు అనుభవలేమితో వచ్చినవని విమర్శించారు. 'చాలాకాలం పాటు ఏం మాట్లాడలేని ఓ పిల్లాడు.. ఆ తర్వాత మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోతారు. పైగా ఇంకా మాట్లాడాలని ప్రోత్సహిస్తారు' అని రాహుల్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ పాలనకు ఏడాది గడుస్తున్న నేపధ్యంలో ఆయన రాహుల్పై విమర్శలు సంధించారు.