మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లోని ఖిర్కియా- హర్దా స్టేషన్ల మధ్య మంగళవారం అర్థరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దుర్మరణం చెదిన ప్రయాణికుల కుటుంబాలు ఒక్కొక్కరికి రైల్వే శాఖ రూ.2 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ. 50 వేలు, స్వస్పంగా గాయపడినవారికి రూ.25 వేలు పరిహారాన్ని అందిస్తామని పేర్కొంది. తక్షణమే పరిహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బుధవారం ఉదయం మీడియాకు చెప్పారు. భారీ వర్షాల కారణంగా వరదలు ఉప్పొంగి రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మంత్రి అన్నారు. ఈ ఘటనపై ఆయన ఈరోజు పార్లమెంట్ లో ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.
ముంబై నుంచి వారణాసి వెళుతోన్న కామయాని ఎక్స్ ప్రెస్ మాచక్ నదిపై ఉన్న వంతెనపైకి చేరుకోగానే ప్రమాదానికి గురై వెనుక భాగంలోని 10 బోగీలు నీటిలో పడిపోయాయి. అదే సమయంలో జబల్ పూర్ నుంచి ముంబై వెళుతోన్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా సమాచార లోపంతో సరిగ్గా అదే ప్రదేశంలో పట్టాలు తప్పింది. మొత్తం 16 బోగీలు నీటిలో పడి మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో 30 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు 300 మంది ప్రయాణికులను కాపాడాయి. ఇంకా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.