చిక్కుకుపోయిన చార్ధామ్ యాత్రికులు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మట్టిపెళ్లలు విరిగిపోయి పలు రోడ్లు మూసుకుపోయాయి. దాదాపు మూడేళ్ల క్రితం ఇదే సమయంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పెను విలయం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇంచుమించు అదే పరిస్థితిని మళ్లీ ప్రస్తుత వాతావరణం గుర్తుచేస్తోంది. కేదార్నాథ్, బద్రీనాథ్ హైవేలతో పాటు నందప్రయాగ వెళ్లే రోడ్డు కూడా మూసుకుపోయింది. ఆ రోడ్లను క్లియర్ చేసి, ట్రాఫిక్ను మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చార్ ధామ్ యాత్రకు బయల్దేరిన చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయారని, అందువల్ల రోడ్లను పునరుద్ధరించేందుకు సరిహద్దు రోడ్ల సంస్థ ప్రయత్నిస్తోందని స్థానిక అధికారులు చెప్పారు. అయితే, గురువారం నుంచి మరో 72 గంటల పాటు ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్మోరా, పౌరి, ఉత్తరకాశీ, డెహ్రాడూన్, ఉధమ్సింగ్నగర్, నైనిటాల్ జిల్లాలకు ఈ హెచ్చరికను ప్రకటించారు.