భారం మోడీపైనే...
రాజస్థాన్ నుంచి పోలంపెల్లి ఆంజనేయులు (‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి)
సునాయాసంగా గెలుపు దక్కించుకోగలమనుకున్న బీజేపీకి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారాయి. కాషాయ దళంలో ఒకవైపు రెబెల్స్ గుబులు పుట్టిస్తుండగా, మరోవైపు సీఎం గెహ్లాట్ ‘సంక్షేమ’ మంత్రంతో ఓటర్లను ఆకట్టుకుంటుండటం అలజడి రేకెత్తిస్తోంది. నేషనల్ పీపుల్స్ పార్టీ, బీఎస్పీలు రాష్ట్రంలో సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి.
ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి స్వల్ప మెజారిటీ దక్కే సూచనలు కనిపించగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పరిస్థితులు కొంతవరకు తారుమారయ్యాయి. ఈ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలిస్తాయేమోనని ఆందోళన చెందుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ ఎన్నికల్లో పూర్తిగా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపైనే ఆధారపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహా పార్టీ రాష్ట్ర నేతలు తెరవెనక్కు వెళ్లి, మోడీని రంగంలోకి దించుతున్నారు. రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో మంగళవారం మోడీ సుడిగాలి పర్యటన చేశారు. ఆయన ప్రసంగించిన పలు బహిరంగ సభల్లో పార్టీ రాష్ట్ర నేతల్లో ముఖ్యులెవరూ కనిపించకపోగా, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సైతం మాట్లాడే అవకాశం లభించకపోవడం గమనార్హం.
ఈ సభలన్నీ సర్వం మోడీమయంగా సాగాయి. ఈ నెలాఖరులో మరో మూడురోజులు మోడీ ద్వారా ప్రచారం చేయిం చేందుకు బీజేపీ నేతలు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయి. రెండు రోజు ల కిందట విడుదల చేసిన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆయన సంక్షేమానికే పెద్దపీట వేశారు. ఒకవైపు గెహ్లాట్ మేనిఫెస్టో ఆకర్షణీయంగానే ఉన్నా, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలు తమకు అనుకూలించగలవని బీజేపీ ఆశలు పెట్టుకుంటోంది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ, అందుకోసం అన్ని అవకాశాలనూ వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది.