రజనీకాంత్ దిష్టిబొమ్మ దహనం
బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘లింగ’ సినిమా షూటింగ్‌ను కర్ణాటకలో జరపకుండా నిలిపివేయాలని కర్ణాటక జనపర వేదిక సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రజనీకాంత్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసి ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే... 2008లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నీటి వివాదం నడుస్తున్న సమయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తమిళులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.
అయితే అనంతరం ఈ విషయంపై రజనీకాంత్ కన్నడిగులకు క్షమాపణ కూడా చెప్పారు. జీవితంలో ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయని, ఇలాంటి తప్పు మరోసారి జరగదని కూడా అప్పట్లో రజనీకాంత్ వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘లింగ’ సినిమా శుక్రవారం నుంచి రాష్ట్రంలో షూటింగ్ జరుపుకుంటోంది.
కర్ణాటకలోని మండ్య, మేలుకొటే, కేఆర్‌ఎస్ ప్రాంతాల్లో ‘లింగ’ సినిమా షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి చెందిన కస్తూరి కర్ణాటక జనపర వేదిక సభ్యులు రామనగరలోని ఐజుమూరు సర్కిల్ ప్రాంతంలో ‘లింగ’ సినిమా షూటింగ్‌ను రాష్ట్రంలో జరపరాదంటూ శనివారం ధర్నాకు దిగారు. అంతేకాదు రజనీకాంత్ దిష్టిబొమ్మను దగ్దం చేసి, కావేరి నీటి పంపకం విషయంలో కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీకాంత్ కర్ణాటకలోనే షూటింగ్ జరుపుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.