అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధం ఎందుకు?
ముంబై: అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధాన్ని సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గట్టిగా వ్యతిరేకించారు. నిషేధం తిరోగమన నిర్ణయమని ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘లైంగిక నేరాల నిరోధానికి ఈ వెబ్‌సైట్ల నిషేధం పరిష్కారం కాదు. దేన్నయినా సరే నిషేధిస్తే అది మరింత బలోపేతం అవుతుందని చరిత్రలో పలుసార్లు రుజువైంది’ అని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం లాక్కునే ఏ చర్య అయినా దేశంలోని సామాజిక ప్రగతిని వెనక్కి మళ్లించేదేనని అన్నారు.
అశ్లీల సైట్లు లైంగిక నేరాలకు రెచ్చగొట్టడం లేదని, పైగా లైంగిక ఒత్తిళ్లను తగ్గిస్తున్నాయని పలు అంతర్జాతీయ సర్వేల్లో తేలిందన్నారు. ప్రభుత్వం అశ్లీల వెబ్‌సైట్లను నిషేధించే బదులు వాటిలోని సమాచారం తప్పుడు పరిణామాలకు దారితీయకుండా పలుచర్యలు తీసుకోవాలని సూచించారు.