Websites Ban
-
పార్ట్ టైమ్ జాబ్ మోసాలు.. 100 వెబ్సైట్లపై కేంద్రం నిషేధం
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. అక్రమాలకు పాల్పడుతున్న వెబ్సైట్లపై కేంద్ర హోం శాఖ నిషేధం విధించింది. సర్వీస్ పేరుతో వెబ్సైట్లు అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంది. ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న వెబ్సైట్లను కేంద్ర హోం శాఖ గుర్తించింది. ఈ వెబ్సైట్లు మోసపూరిత పెట్టుబడి పథకాలు, పార్ట్ టైమ్ జాబ్ మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్.. 100 వెబ్సైట్లను బ్లాక్ చేయాలని సిఫార్సు చేసింది. దీంతో ఆర్ధిక నేరాలకు పాల్పడిన ఈ వెబ్సైట్లపై కేంద్రం చర్యలు తీసుకుంది. విదేశీ వ్యక్తులచే నిర్వహించబడుతున్న ఈ ప్లాట్‌ఫాంలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, అద్దె ఖాతాలను ఉపయోగించాయి. కార్డ్ నెట్‌వర్క్‌లు, క్రిప్టోకరెన్సీలు, అంతర్జాతీయ ఫిన్‌టెక్ కంపెనీల వంటి వివిధ మార్గాల ద్వారా ఈ ఆర్థిక నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశం నుండి తరలిస్తున్నారని కనుగొన్నారు. నవంబర్ 5న 22 చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్‌కాన్ -
ఇంటర్నెట్ సమాచారాన్ని బ్లాక్ చేస్తున్న చైనా
బీజింగ్ : చైనాలో ఇకపై యూజర్లు ఎంతమేర సెర్చ్ చేయాలో ప్రభుత్వమే నిర్ణయించనుంది. చైనా వెలుపలు ఏం జరుగుతుందన్న సమాచారాన్ని సేకరించేందుకు వీలు లేకుంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంటర్నెట్ వినియోగంపై కొన్ని ఆంక్షలు విధించడానికి పావులు కదుపుతోంది. తమకు నచ్చని వెబ్సైట్లని బ్లాక్‌చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమయ్యింది. ఈ మేరకు ఇంటర్నెట్పై సెన్సార్‌పై మరింత పకడ్బందీ చర్యలు కొనసాగుతున్నాయని ఓ నివేదికలో వెల్లడైంది. దీనికి అనుగుణంగా గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా అని పిలుచుకునే సెన్సార్ టూల్స్‌కి ప్రభుత్వం కొత్త సాంకేతిక హంగులు అద్దుతోంది. దీంతో చైనాలో ఇంటర్నెట్ వినియోగదారులు వాడే వెబ్సైట్లు, యాప్స్‌ని మరింతగా నియంత్రిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ మ్యారీల్యాండ్, ఐయూపోర్ట్ సంయుక్త నివేదికలో వెల్లడైంది. చైనాలో ఇంటర్నెట్ సెన్సార్‌షిప్‌ని సమగ్రంగా అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. (ట్రంప్ కోసం రష్యా ప్రయత్నాలు) దీని ప్రకారం..‘గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా హెచ్‌టీటీపీ ట్రాఫిక్‌ను నియంత్రించి ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ( టీఎల్ఎస్) 1.3, ఈఎస్‌ఎన్‌ఐ (ఎన్క్రిప్టెడ్ సర్వర్ నేమ్ ఇండికేషన్) వంటి కొత్త తరహా టెక్నాలజీని వినియోగిస్తోంది . అంతేకాకుండా చైనా వెలుపల నుంచి వచ్చే ఇంటర్నెట్ సమాచారాన్నంతటినీ చైనా బ్లాక్ చేస్తోంది. దీంతో ఆ దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులకు వారికి కావల్సిన సమాచారాన్ని స్వేచ్ఛ లేదని ఆ నివేదిక పేర్కొంది. టీఎల్ఎస్ 1.3 ఎన్‌క్రిప్ట్ చేయడం ద్వారా తాము అనుకున్న వెబ్సైట్లను చైనా ప్రభుత్వం బ్లాక్ చేసే పనిలో ఉంది. టీఎల్ఎస్ టెక్నాలజీని వినియోగించి నిర్ధారిత సర్వర్లను పనిచేయకుండా నిరోధిస్తోంది' అని నివేదికలో వెల్లడించింది. (ఈ మాస్క్ ధర, యజమాని గురించి తెలిస్తే...) -
జియో బ్యాన్ చేసిందా? యూజర్లకు షాకేనా?
సాక్షి, ముంబై: టెలికాం మార్కెట్లోకి సంచలనంలా దూసుకు వచ్చిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో సంచలనం నిర్ణయం తీసుకుందా? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం తాజా ఆదేశాలకనుగుణంగా తన నెట్‌వర్క్‌లో పోర్న్వెబ్సైట్లను బ్లాక్ చేసింది. ఈ సైట్లకు యాక్సెస్ లభించడం లేదంటూ పలువురి జియో యూజర్ల అనుభవాన్ని బట్టిచూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఈ మేరకు ఒక యూజర్లు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతూ పోస్ట్ పెట్టారు. దీంతో మరికొంత మంది యూజర్లు ప్రయత్నించారు. వారికీ ఇదే అనుభవం ఎదురైంది. జియో నెట్‌వర్క్‌లో పోర్న్‌హబ్, ఎక్స్ వీడియోస్ సహా దాదాపు వందలాది వెబ్సైట్లు బ్లాక్ అయ్యాయి. దీంతో ఇటీవల టెలికాం శాఖ ఆదేశాలను జియో పాటిస్తూ పోర్న్ వెబ్సైట్లను నిషేధించినట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాల ప్రకారం జియో వీడియో వినియోగం మందగించినప్పటికీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం. అయితే మిగతా నెట్‌వర్క్‌లో ఇంకా ఈ ఆదేశాలు ఇంకా అమల్లోకి వచ్చినట్టు లేదు. మొత్తం 857 పోర్న్ వెబ్సైట్లను నిషేధించాల్సిందిగా ఉత్తరాఖండ్ హైకోర్టు సెప్టెంబర్ 27, 2018న ఆదేశించింది. జూలై 31,2015లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న ఆదేశాలకు కొనసాగింపుగానే ఈ ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది. అయితే ఐటీ మంత్రిత్వ శాఖ ఇందులో 30 వెబ్సైట్లలో ఎలాంటి పోర్న్ కంటెంట్ లేనందున వాటికి మినహాయింపు ఇచ్చింది. మిగిలిన మొత్తం 827 పోర్న్ వెబ్సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా టెలికాంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లేదంటే సర్వీస్ ప్రొవైడర్ల లైసెన్సులను రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. -
4వేల పోర్న్ సైట్లను మూసేసిన చైనా
బీజింగ్: గత 3 నెలలుగా ప్రత్యేక చర్యలు ప్రారంభించిన చైనా ప్రభుత్వం దాదాపు 4,000 పోర్న్ వెబ్సైట్లను, ఖాతాలను మూసివేసింది. మేలో ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఆగస్టుచివరినాటికి 120 ఉల్లంఘనలను గుర్తించింది. తప్పు సరిదిద్దుకోవాలంటూ 230 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. హానికరంగా ఉన్నట్లు భావించిన 1.47 లక్షల అంశాలను తొలగించినట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. కాపీరైట్ ఉల్లంఘనలు, విలువలను దిగజార్చే, అశ్లీలం, అసభ్యత ఉన్న ఆన్లైన్ నవలలపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో 22వేల పోర్న్ సైట్ల మూసివేతతోపాటు దాదాపు 11 లక్షల హానికర అంశాలను నెట్ నుంచి తొలగించామని ప్రభుత్వం పేర్కొంది. -
రజనీ కబాలికి భారీ ఊరట
చెన్నై: భారీ అంచనాలతో తెరకెక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీకు మద్రాస్ హైకోర్టు బాసటగా నిలిచింది. కబాలి చిత్రాన్ని ఇంటర్నెట్లో విడుదల కాకుండా నిషేధించాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను చెన్నై హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు కబాలి సినిమాను వెబ్ సైట్లలో విడుదల చేయరాదంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వెబ్ సైట్లలో మూవీ రిలీజ్ కాకుండా 169 సర్వీస్ ప్రొవైడర్లతో పాటు 225 వెబ్ సైట్లపై కోర్టు నిషేధం విధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిత్రం విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఇంటర్నెట్లలో అనధికారంగా ప్రసారం అవుతున్నాయన్నాయని, ఆ తరువాత కొన్ని గంటల్లోనే పైరసీ సీడీలు మార్కెట్ లో వెలువడుతున్నాయని నిర్మాత తన పిటిషిన్ లో పేర్కొన్నారు. అందువల్ల భారీ వ్యయంతో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని కోర్టుకు విన్నమించారు. రజనీకాంత్ కథానాయకుడిగా యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రం కబాలి ఈ నెల 22న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ, కన్నడ, తెలుగుతో పాటు పలు చిత్ర పరిశ్రమలు పైరసీపై పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. కబాలి మూవీ పైరసీ కొరల్లో చిక్కకుండా ఎంత వరకు ఉంటుందో చూడాలి. -
అశ్లీల వెబ్సైట్లపై నిషేధం ఎందుకు?
ముంబై: అశ్లీల వెబ్సైట్లపై నిషేధాన్ని సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గట్టిగా వ్యతిరేకించారు. నిషేధం తిరోగమన నిర్ణయమని ఆదివారం ట్విటర్లో పేర్కొన్నారు. ‘లైంగిక నేరాల నిరోధానికి ఈ వెబ్సైట్ల నిషేధం పరిష్కారం కాదు. దేన్నయినా సరే నిషేధిస్తే అది మరింత బలోపేతం అవుతుందని చరిత్రలో పలుసార్లు రుజువైంది’ అని అన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం లాక్కునే ఏ చర్య అయినా దేశంలోని సామాజిక ప్రగతిని వెనక్కి మళ్లించేదేనని అన్నారు. అశ్లీల సైట్లు లైంగిక నేరాలకు రెచ్చగొట్టడం లేదని, పైగా లైంగిక ఒత్తిళ్లను తగ్గిస్తున్నాయని పలు అంతర్జాతీయ సర్వేల్లో తేలిందన్నారు. ప్రభుత్వం అశ్లీల వెబ్సైట్లను నిషేధించే బదులు వాటిలోని సమాచారం తప్పుడు పరిణామాలకు దారితీయకుండా పలుచర్యలు తీసుకోవాలని సూచించారు.