రజనీ కబాలికి భారీ ఊరట
చెన్నై: భారీ అంచనాలతో తెరకెక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీకు మద్రాస్ హైకోర్టు బాసటగా నిలిచింది. కబాలి చిత్రాన్ని ఇంటర్నెట్లో విడుదల కాకుండా నిషేధించాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను చెన్నై హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు కబాలి సినిమాను వెబ్ సైట్లలో విడుదల చేయరాదంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వెబ్ సైట్లలో మూవీ రిలీజ్ కాకుండా 169 సర్వీస్ ప్రొవైడర్లతో పాటు 225 వెబ్ సైట్లపై కోర్టు నిషేధం విధించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిత్రం విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఇంటర్నెట్లలో అనధికారంగా ప్రసారం అవుతున్నాయన్నాయని, ఆ తరువాత కొన్ని గంటల్లోనే పైరసీ సీడీలు మార్కెట్ లో వెలువడుతున్నాయని నిర్మాత తన పిటిషిన్ లో పేర్కొన్నారు. అందువల్ల భారీ వ్యయంతో చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని కోర్టుకు విన్నమించారు. రజనీకాంత్ కథానాయకుడిగా యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ చిత్రం కబాలి ఈ నెల 22న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ, కన్నడ, తెలుగుతో పాటు పలు చిత్ర పరిశ్రమలు పైరసీపై పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. కబాలి మూవీ పైరసీ కొరల్లో చిక్కకుండా ఎంత వరకు ఉంటుందో చూడాలి.