’సిక్కు సోల్జర్’ రెడీ.. ఫస్ట్‌లుక్ చూశారా!
మరోసారి తన అభిమానుల్ని మెస్మెరైజ్ చేసేందుకు బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ’సరబ్‌జిత్’ సినిమా లుక్‌తో అభిమానులను విస్మయపరిచిన రణ్‌దీప్ తాజాగా మరో చారిత్రక పాత్రలో ఒదిగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు.
రాజ్‌కుమార్ సంతోషి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న పిరియాడిక్ డ్రామా ’సారాగర్హి’ సినిమాలో సిక్కు సోల్జర్, హవాల్దార్ ఇషార్ సింగ్ పాత్రను రణ్‌దీప్ పోషించబోతున్నారు. ఈ పాత్ర ఫస్ట్‌లుక్‌ను తాజాగా ట్విట్టర్‌లో విడుదల చేశారు.
చరిత్రలో గొప్ప ఆర్మీ పోరాటంగా ఘనత వహించిన సారాగర్హి యుద్ధం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నది. 36 సిక్కు బెటాలియన్ కమాండర్ ఇషార్ సింగ్ అఫ్ఘన్ గిరిజన తెగలతో వీరోచితంగా జరిపిన పోరాటమే ఈ సినిమా. 1897లో 21మంది సిక్కు సైనికులతో కూడిన 36 బెటాలియన్.. పదివేలమంది ఆఫ్ఘన్లు యుద్ధానికి సిద్ధపడినా.. వెన్నుచూపకుండా తుదివరకు పోరాడింది. చివరివరకు యుద్ధం క్షేత్రంలో నిలిచి పోరాడిన వీరుడైన ఇషార్ సింగ్ పాత్రను రణ్‌దీప్ పోషించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.