![విమానాన్ని ఆపి ఎలుకను పట్టారు](/styles/webp/s3/article_images/2017/09/17/71503933015_625x300.jpg.webp?itok=vGDABvQB)
విమానాన్ని ఆపి ఎలుకను పట్టారు
న్యూఢిల్లీ: అది.. ప్రపంచంలోనే అత్యధిక దూరం ప్రయాణించే ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్ ఇండియా-173 విమానం. ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు నుంచి దాదాపు 200 మంది ప్రయాణికులతో టేకాఫ్‌కు సిద్ధమైంది. అంతలోనే విమానం లోపల ఒక ఎలుక కనిపించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని ఆపేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించేసి, సిబ్బందితో ఎలుక వేట మొదలుపెట్టారు.
ఒకటీ, రెండు కాదు.. ఎలుకను పట్టడానికి సిబ్బందికి ఏకంగా ఆరు గంటల సమయం పట్టింది. అంతా ఊపిరి పీల్చుకుని ఇక బయలుదేరొచ్చనుకునేలోపే మరో అవాంతరం ఎదురైంది..
అంతసేపు డ్యూటీలోనే ఉన్న ఆ విమానం పైలట్, ఇతర సిబ్బందిని తర్వాత డ్యూటీకి కొనసాగించటానికి నిబంధనలు ఒప్పుకోవు. దీంతో అధికారులు కొత్త జట్టును పిలిపించారు. వారు రావడానికి మరో మూడు గంటల సమయం పట్టింది. ఈ పరిణామాలతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం తర్వాత విమానం గమ్యస్థానానికి బయలుదేరింది.