ఫ్యాషన్ పోర్టల్ ‘కార్య’లో రతన్ టాటాకు వాటాలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా ఫ్యాషన్ పోర్టల్ ‘కార్య’లో వాటాలు కొనుగోలు చేశారు. అయితే, ఎంత వాటా తీసుకున్నది, ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు. ‘కార్య’ సంస్థ ఆన్‌లైన్లో మహిళల దుస్తులు విక్రయిస్తోంది. ప్రతి నెలా 150 డిజైన్లను ప్రవేశపెడుతున్నట్లు కార్య వ్యవస్థాపకురాలు నిధి అగర్వాల్ తెలిపారు. భారత్‌లో వెస్టర్న్ నాన్-క్యాజువల్ వేర్ (మహిళలకు) మార్కెట్ వాటా ప్రస్తుతం రూ.10,000-15,000 కోట్లుగా ఉందని, ఇది వచ్చే 3-4 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని ఆమె తెలియజేశారు. ఇటీవలి కాలంలో పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతున్న రతన్ టాటా... కార్యలో కూడా వ్యక్తిగత హోదాలోనే ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఇప్పటికే స్నాప్‌డీల్, అర్బన్ ల్యాడర్, బ్లూస్టోన్, కార్‌దేఖో డాట్‌కామ్ మొదలైన ఈ-కామర్స్ సైట్లలో పెట్టుబడులు పెట్టారు.