ఆర్‌బీఐ 'మసాలా' నిర్ణయం
ముంబై: ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌బీఎఫ్‌సీ వంటి నాన్ బ్యాంకింగ్ సంస్థలకు మాత్రమే పరిమితమైన మసాలా బాండ్ల జారీకి బ్యాంకులకు అనుమతి లభించింది. మార్కెట్ లిక్విడిటీని మరింత సులభతరం చేసే చర్యల్లో భాగంగా కేంద్ర బ్యాంకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న ద్రవ్య కొరత సమస్యను పరిష్కరించే యోచనలో ఇకపై ద్రవ్య సర్దుబాటు వసతి(ఎల్‌ఏఎఫ్) కింద కార్పొరేట్ బాండ్లను సైతం స్వీకరించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించింది. తద్వారా బాండ్ మార్కెట్ పరిధిని పెంచడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత పెరిగేలా ఈ చర్యలు చేపట్టింది. ఇకపై బ్యాంకులు కూడా విదేశాల్లో రూపాయి డినామినేడెట్ బాండ్లు (మసాలా బాండ్లు) జారీ చేయడం ద్వారా నిధులు సేకరించేందుకు ఆర్‌బీఐ అనుమతిస్తుంది. మార్కెట్లను అభివృద్ధి చేసేందుకు, భాగస్వామ్యాన్ని మెరుగు పర్చడానికి, మార్కెట్ లిక్విడిటీని మరింత సులభతరం చేసేందుకు, కమ్యూనికేషన్‌ను పెంచే ఉద్దేశంతో ఈ ప్రమాణాలను ప్రవేశపెడుతున్నామని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
మసాలా బాండ్లు విదేశీ పెట్టుబడిదారులకు జారీచేసే రూపాయి ఆధారిత బాండ్లు. కానీ సెటిల్ మెంట్ మాత్రం డాలర్ పరంగా జరుగుతుంది. విదేశీ రూపాయి బాండ్ మార్కెట్‌ను ప్రోత్సహించేందుకు, తాత్కాలిక మూలధన అవసరాల కోసం విదేశీ రూపాయి బాండ్లను (మసాలా బాండ్లను) విడుదల చేసేలా అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. దీని ద్వారా బ్యాంకులు మూలధన వనరులను సమకూర్చుకోవడంతోపాటు మౌలిక రంగ, చౌక గృహ ప్రాజెక్టులకు ఫండింగ్ చేసేందుకు అవసరమైన నిధులను సేకరించుకునే అవకాశం కలుగుతుంది. ఇప్పటివరకు కార్పొరేట్ సంస్థలతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు మాత్రమే మసాలా బాండ్లు జారీ చేసేందుకు అనుమతి ఉండేది. తాత్కాలిక నిధుల అవసరాలను తీర్చుకునేందుకు బ్యాంకులు ఎల్‌ఏఎఫ్‌ను ఉపయోగించుకుంటాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయాలను హర్షం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం బాండ్ మార్కెట్ విస్తరణకు ఎంతగానో ఉపయోగపడనుందని విశ్లేషకులు, మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కాగా త్వరలోనే కరెన్సీ మార్కెట్లు, బాండ్ల లక్ష్యంగా పలు ప్రమాణాల పరంపరను ప్రకటించనున్నట్టు ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇంతకు ముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బాండ్లు, కరెన్సీ మార్కెట్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్బీఐ నిబంధనల్లో మార్పులకు యోచిస్తున్నారు. వచ్చేనెల 4 తేదీతో ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పదవీ కాలం ముగియనుంది. సెప్టెంబర్ 6 నుంచి కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ పగ్గాలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.