
మొండి బకాయిలకు కళ్లెం!
ముంబై: మొండి బకాయిల ఇబ్బందుల పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రణాళికలు రూపొందిస్తోంది. కంపెనీలకు రుణ పరిమితిని తగ్గించాలని తాజాగా ప్రతిపాదించింది. బ్యాంకు ఏ సమయంలోనైనా తన వద్ద అందుబాటులో ఉండే మూలధనంలో 25 శాతాన్ని మాత్రమే ఒక కంపెనీ లేదా కార్పొరేట్ గ్రూపునకు రుణంగా మంజూరు చేయాలన్నది ఈ ప్రతిపాదనల్లో ప్రధానమైనది. ప్రస్తుతం ఈ రేటు 55 శాతం వరకూ ఉంది. వీలైతే ఈ విధానాన్ని 2019 జనవరి 1 నుంచీ అమల్లోకి తేవాలని భావిస్తోంది.
ఈ ప్రతిపాదనలతో కూడిన ఒక పత్రాన్ని ‘లార్జ్ ఎక్స్‌పోజర్ ఫ్రేమ్‌వర్క్’ పేరుతో విడుదల చేసింది. ఆయా ప్రతిపాదనలపై ఏప్రిల్ 30వ తేదీలోపు సంబంధిత పక్షాలన్నీ తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు 2011లో రూ.71,080 కోట్లయితే, 2014 డిసెంబర్ నాటికి ఈ పరిమాణం రూ.2,60,531 కోట్లకు చేరుకుంది.
విదేశీ మారక నిల్వలు ః 340 బిలియన్ డాలర్లు
కాగా భారత్ విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు మార్చి 20తో ముగిసిన వారాంతానికి 339.99 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే ఇవి 4.26 బిలియన్ డాలర్లు పెరిగాయి.