ఒక్క రూపాయి పల్స్..300 కోట్లను కొల్లగొట్టింది!
న్యూఢిల్లీ : బహుళ జాతీయ కంపెనీలకు ధీటుగా ఒక్క రూపాయి క్యాండీ పల్స్ మార్కెట్లో దూసుకెళ్తోంది. లాంచ్ చేసిన రెండేళ్లలోనే రూ.300 కోట్ల విక్రయాలను తాకింది. పచ్చి మామిడి రుచితో ట్యాంగీ క్యాండీ విభాగంలో డీఎస్ గ్రూప్ 2015 మధ్యలో దీన్ని లాంచ్ చేసింది. గత నెలలో ఈ ఒక్క రూపాయి క్యాండీ రూ.300 కోట్ల అమ్మకాలను నమోదుచేసిందని కంపెనీ పేర్కొంది. ఎంఎన్సీ బ్లూ చిప్ కంపెనీలు కూడా చేరుకోలేని స్థాయికి ఇది అధిగమించినట్టు తెలిపింది. 2011లో లాంచ్ చేసిన ఓరియో అమ్మకాలు రూ.283 కోట్లు కాగ, మార్స్ బార్స్ రూ.270 కోట్లు. వీటన్నింటిన్నీ మించి పల్స్ కు మార్కెట్లో విశేషాధరణ లభిస్తోందని కంపెనీ తెలిపింది.
పానీయాల్లో ఫేమస్ అయిన కోకా-కోలా అడ్వర్ టైజ్ చేసే కోక్ జీరో అమ్మకాలు కూడా రూ.120 కోట్లు మాత్రమే. భారత్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ తాము విక్రయాల్లో దూసుకుపోతున్నామని పల్స్ క్యాండీ తయారీ కంపెనీ చెబుతోంది. సింగపూర్, యూకే, అమెరికా స్టోర్లలో కూడా వీటిని విక్రయించడం ప్రారంభించామని డీఎస్ గ్రూప్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ శశాంక్ సురాన చెప్పారు. స్వీట్ క్యాండీ విభాగం రూ.6600 కోట్ల మార్కెట్ ను కలిగి ఉంది. ప్రతేడాది ఇది 12-14 శాతం వృద్ధి సాధిస్తోంది.