MNCs
-
సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ!
బెంగళూరులో నీటి కొరత.. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ఐటీ కంపెనీలను తమ రాష్ట్రాలకు రప్పించే అవకాశంగా మారింది. ‘ఎకనామిక్ టైమ్స్’ ఒనివేదిక ప్రకారం.. కేరళకు మారాలని బెంగళూరులోని కొన్ని ఎంఎన్సీ కంపెనీలకు తాను లేఖ రాసినట్లు కేరళ పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రి పి.రాజీవీ తెలిపారు. తమ రాష్ట్రంలో కర్ణాటక కంటే మెరుగైన నీటి వనరులు ఉన్నాయని, గణనీయమైన పెట్టుబడులకు కేరళ అనువైన ప్రదేశం అని మంత్రి రాజీవీ పేర్కొన్నారు. ‘బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని తెలుసుకున్నాం. కాబట్టి మేము కొన్ని ఐటీ కంపెనీలను సంప్రదించి కేరళకు తరలించమని కోరాము. మా రాష్ట్రం మంచి ప్రణాళికాబద్ధమైన నీటి సదుపాయాలు కలిగి ఉంది. సహజ వనరులతో నిండి ఉంది. మేము వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తాం’ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్ కేరళను దేశంలోని కొత్త సిలికాన్ వ్యాలీగా మార్చాలనే తన ఆశయాన్ని మంత్రి రాజీవీ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కేరళలో పెట్టుబడులపై కొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. మా రాష్ట్రం కొత్త సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారే అవకాశం ఉంది. ఆ దిశగా కంపెనీలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. బెంగళూరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నందున, కంపెనీలకు తదుపరి అతిపెద్ద ఐటీ గమ్యస్థానంగా కేరళ తనను తాను ప్రదర్శించుకోవాలనుకుంటోంది’ అన్నారు. 66వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి నాలుగు కొత్త ఐటీ కారిడార్లను నిర్మించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే!
ముంబై: భారీ వ్యాపారాల ఆశలతో భారత మార్కెట్లో ప్రవేశించిన పలు బహుళ జాతి దిగ్గజాలు (ఎంఎన్సీ) .. తమ అంచనాలకు తగ్గట్లుగా ఇక్కడ పరిస్థితులు కనిపించక పోతుండటంతో ఆలోచనలో పడుతున్నాయి. నిష్క్రమించడమో లేక వ్యాపారాల పరిమాణాన్ని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నిష్క్రమించిన హోల్సిమ్, ఫోర్డ్, కెయిర్న్, దైచీ శాంక్యో వంటి సంస్థల బాటలోనే తాజాగా జర్మనీ హోల్‌సేల్ దిగ్గజం మెట్రో కూడా చేరింది. స్థానికంగా తీవ్ర పోటీ నెలకొనడం, అంతర్జాతీయంగా మార్కెట్ ప్రాధాన్యతలు .. వ్యాపార విధానాలు మారిపోతుండటం, పన్నులపరమైన వివాదాల్లో ఏకపక్ష నిర్ణయాలు, పెరిగిపోతున్న నష్టాలు మొదలైనవి ఎంఎన్సీల నిష్క్రమణకు కారణాలుగా ఉంటున్నాయని పరి శ్రమ వర్గాలు తెలిపాయి. ఎనిమిదేళ్ల క్రితం ఫ్రాన్స్‌కి చెందిన క్యారీఫోర్ .. భారత్‌లో తమ హోల్‌సేల్ వ్యాపారాన్ని మూసేసింది. 19 ఏళ్ల కింద భారీ అంచనాలతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన మెట్రో ప్రస్తుతం తమ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాపారంలో మార్జిన్లు అత్యంత తక్కువగా ఉండటమే క్యారీఫోర్ వంటి ఎంఎన్‌సీలు నిష్క్రమిస్తుండటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా రిటైల్ రంగంలో రిలయన్స్ వంటి బడా కంపెనీలకు అనుకూలంగా కన్సాలిడేషన్ చోటు చేసుకుంటోందని వారు తెలిపారు. కిరాణా దుకాణాలకు కూడా క్విక్ కామర్స్, ఈ–కామర్స్ వంటి విభాగాల నుంచి పోటీ తీవ్రమవుతోందని వివరించారు. దేశీ సంస్థల హవా.. దేశీ సంస్థల హవా పెరుగుతుండటంతో ఎంఎన్సీల వాటా తగ్గుతూ వివిధ రంగాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉదాహరణకు సిమెటు రంగాన్ని తీసుకుంటే స్విస్ దిగ్గజం హోల్సిమ్ తమ భారత సిమెంటు యూనిట్లను అదానీ గ్రూప్‌నకు విక్రయించాక ఈ రంగంలో టాప్ కంపెనీలుగా దేశీ సంస్థలే ఉండటం గమనార్హం. పర్యావరణ అనుకూల వ్యాపారాలపై దృష్టి పెట్టేందుకే భారత్‌లో వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు హోల్సిమ్ పేర్కొంది. ఇలా ఆయా ఎంఎన్సీల వ్యాపార కారణాల వల్లే అవి నిష్క్రమిస్తున్నాయే తప్ప నియంత్రణ సంస్థలు, చట్టాలపరమైన అంశాల వల్ల కాదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అలాగే అంతర్జాతీయంగా మాతృ సంస్థ పాటించే విధానాలకు అనుగుణంగా ఇక్కడి వ్యాపార నిర్వహణ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఎంఎన్‌సీలు తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. మార్జిన్లు అంతగా లేకపోవడానికి తోడు భౌతిక స్టోర్స్ ద్వారా నిర్వహించే వ్యాపారాలకు ఆన్లైన్ మాధ్యమాల నుంచి పోటీ పెరగడం సైతం ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాయి. దీనికి క్యారీఫోర్ వంటి సంస్థలను ఉదాహరణగా తెలిపాయి. క్యారీఫోర్ ఇక్కడ పూర్తి రిటైలర్‌గా విస్తరించాలనుకున్నా .. హోల్‌సేల్ వ్యాపారం ద్వారానే కార్యకలాపాలు ప్రారంభించాల్సి వచ్చింది. ఇది ఆ సంస్థ అంతర్జాతీయ వ్యాపార విధానాలకు అనుగుణంగా లేకపోవడం .. కంపెనీ కార్యకలాపాలకు ప్రతికూలంగా మారిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి👉 ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
ఇక డేటా పక్కా లోకల్!
సాక్షి, హైదరాబాద్: డేటా లోకలైజేషన్.. వినియోగదారుల సమాచారమంతా దేశీయంగా నిల్వ చేసే ప్రక్రియ.. ఇందుకు పేమెంట్ కంపెనీలకు ఆర్బీఐ విధించిన గడువు సోమవారంతో పూర్తయింది. ఈ గడువును డిసెంబర్ వరకు పొడిగించాలని బహుళ జాతి సంస్థలు కోరినా కేంద్రం మాత్రం తిరస్కరించింది. దీంతో అంతర్జాతీయ కంపెనీల్లో గుబులు పెరిగిపోయింది. ఇక మీదట దేశ పౌరులకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా భారత్ భూభాగంలోని సర్వర్లలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల భారత్‌లోని అమెరికా వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన పెరిగిపోతోంది. గతంలో కొన్ని టెక్ సంస్థలు డేటా లోకలైజేషన్ నిబంధనలు సరికావని, వాటిని సడలించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు అమెరికా సెనేటర్లు జాన్ కార్నిన్, మార్క్ వార్నర్ కూడా దీనికి వ్యతిరేకంగా గళమెత్తారు. ‘డేటాను స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధనల వల్ల భారత్‌లో వ్యాపారాలు చేయడం కష్టమవుతుంది. పౌరుల సమాచారం గోప్యంగా ఉంచేందుకు కంపెనీలన్నీ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నపుడు డేటాను నిల్వచేసే సర్వర్లు ఎక్కడున్నా నష్టమేంటి?’అంటూ ఆ సెనేటర్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తుందని వారు హెచ్చరించారు. డేటా లోకలైజేషన్ అంటే వివిధ రకాలైన ఆర్థిక సంస్థలు, చెల్లింపు సంస్థలు, వినియోగదారులతో వ్యవహారాలు ముడిపడే ఇతర సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వినియోగదారుల సమాచారం వేరే దేశంలోని సర్వర్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. దీంతో వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత గాల్లో దీపంలా మారింది. సమాచార భద్రత ముసాయిదా బిల్లులో భాగంగా డేటాను దేశీయంగా ఉండే సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలన్న సూచనలు ఉన్నాయి. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రూపొందించిన వ్యక్తిగత సమాచార భద్రత బిల్లులో అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించే పనిలో కేంద్రం ఉంది. అది చట్టరూపం దాల్చేలోగానే డేటాను లోకలైజ్ చేయాలన్న ఉద్దేశంతో 6 నెలల కింద ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది. గ్లోబల్ డిజిటల్ పేమెంట్ కంపెనీలన్నీ దేశీయంగా సమాచారాన్ని నిల్వ చేయాలంటూ అక్టోబర్ 15వరకు గడువు విధించింది. కంపెనీల దారెటు ? అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు కంపెనీలైన వీసా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఫేస్బుక్, పేపాల్, మాస్టర్‌కార్డు, గూగుల్ వంటి సంస్థలపై ఈ లోకలైజేషన్ ప్రభావం పడుతుంది. అయితే ఆర్బీఐ నిబంధనల్ని పాటిస్తూ స్థానికంగా వినియోగదారుల సమాచారాన్ని నిల్వ చేసే ప్రక్రియ వాట్సాప్ పూర్తి చేయగా, గూగుల్ అంగీకరించింది. దేశంలోని మొత్తం 80 పేమెంట్స్ సర్వీసుల్లో 64 కంపెనీలు డేటా లోకల్‌గా నిల్వ చేయడానికి సిద్ధమని ప్రకటించాయి. మరో 16 సంస్థలు గడువు కోరాయి. అమెజాన్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు మాత్రం డేటా లోకలైజేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అంతర్జాతీయ కంపెనీలపై భారం ఎలా? డేటా నిల్వ చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలన్నీ భారత్‌లో కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మౌలిక సదుపాయాల కల్పనకే భారీగా ఖర్చు అవుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రాలు ఉండటం వల్ల అదే పని తిరిగి చేయాల్సి వస్తుంది. మానవ వనరుల్ని భారత్‌లో వినియోగించాల్సి రావడం కూడా ఆ కంపెనీలకు అదనపు భారమే. చెల్లింపు సంస్థలు మాత్రమే కాకుండా, అన్ని రకాల కంపెనీలు వినియోగదారుల సమాచారాన్ని స్థానికంగా నిల్వ చేయడం వల్ల మార్కెటింగ్ వ్యూహాలను రచించేందుకు వినియోగదారుల సమాచార సేకరణ సంక్లిష్టంగా మారుతుంది. దేశీయంగా వరం ఎలా? అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్థిక మోసాలు, అక్రమాలు జరిగినప్పుడు భద్రతా సంస్థలకి సమాచార సేకరణ సులభమవుతుంది. డేటా అనలిస్టులు,సైంటిస్టుల వంటి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. భారత్‌లో పేమెంట్ స్టార్టప్ కంపెనీలకు ఇదో పెద్ద వరం. వ్యాపారాల నిర్వహణలో ఇతర అంతర్జాతీయ సంస్థలతో సమాన అవకాశాలు లభిస్తాయి. ఆర్బీఐ వేచి చూసే ధోరణి డేటా లోకలైజేషన్ అంశంలో పలు గ్లోబల్ పేమెంట్ కంపెనీలు గడువు పెంచాలని కోరినా ఆర్బీఐ నిరాకరించింది. 6 నెలల సమయం ఇచ్చామని, ఇక ఇచ్చే పని లేదని తేల్చి చెప్పింది. భారత్‌లో ఇప్పటికీ సెంటర్లు ఏర్పాటు చేయని కంపెనీలు క్లౌడ్ విధానం ద్వారా సమాచారాన్ని నిల్వ చేసి, అతి త్వరలోనే భారత్ సెంటర్లకి మార్చాలని సూచించింది. అంతవరకు కంపెనీలపై వేచి చూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించింది. -
మరోసారి వార్తల్లో రాందేవ్ బాబా
లక్నో: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరోసారి విదేశీ బహుళజాతి సంస్థలపై తన దాడిని ఎక్కు పెట్టారు. రాబోయే అయిదేళ్లలో దేశంనుంచి వీటిని తరిమి కొడతామంటూ ఆయన నిలిచారు. తమ కన్జ్యూమర్ ఉత్పత్తుల ద్వారా ఎంఎన్‌సీలను దేశంనుంచి తరిమివేస్తామని రాందేవ్ హెచ్చరించారు. ఆ వైపుగా తమ పతంజలి ఉత్పత్తులు పయనిస్తున్నాయని బహుళజాతి సంస్థ దోపిడీనుంచి త్వరలో దేశానికి విముక్తి కల్పిస్తామని రాందేవ్ ప్రకటించారు. యోగి భరత్ భూషణ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ బహుళజాతి సంస్థలు దేశం అభివృద్ధి కోసం పనిచేయడంలేదని, వారి ఏకైక లక్ష్యమే భారత్‌ను దోచుకోవడమేనని బాబా మండిపడ్డారు. దోపిడియే ప్రధాన ఉద్దేశ్యంతో దేశంలోకి ప్రవేశించిన ఈస్ట్ ఇండియా కంపెనీతో ఎంఎన్‌సీలను ఆయన పోల్చారు. తాము తదుపరి ఐదేళ్ళలో భారతీయ మార్కెట్ నుంచి తరిమివేస్తామన్నారు. ఎంఎన్సీల నుంచి భారతదేశాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే దేశంలోని రైతులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుందని చెప్పారు. పతంజలి ఆధ్వర్యంలో రైతులకు తాజా ఉత్పాదకాలపైనా, వివిధ నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా ఉత్పత్తిని పెంచుకోవడంపై అవగాహన కల్పిస్తామన్నారు. దీంతోపాటుగా రైతులకు గిట్టుబాటు ధరలను అందిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై రాందేవ్ ప్రశంసలు కురిపించారు. ప్రజలకు సత్సంబంధాలను ఏర్పరచుకుంటోందన్నారు. -
ఒక్క రూపాయి పల్స్..300 కోట్లను కొల్లగొట్టింది!
న్యూఢిల్లీ : బహుళ జాతీయ కంపెనీలకు ధీటుగా ఒక్క రూపాయి క్యాండీ పల్స్ మార్కెట్లో దూసుకెళ్తోంది. లాంచ్ చేసిన రెండేళ్లలోనే రూ.300 కోట్ల విక్రయాలను తాకింది. పచ్చి మామిడి రుచితో ట్యాంగీ క్యాండీ విభాగంలో డీఎస్ గ్రూప్ 2015 మధ్యలో దీన్ని లాంచ్ చేసింది. గత నెలలో ఈ ఒక్క రూపాయి క్యాండీ రూ.300 కోట్ల అమ్మకాలను నమోదుచేసిందని కంపెనీ పేర్కొంది. ఎంఎన్సీ బ్లూ చిప్ కంపెనీలు కూడా చేరుకోలేని స్థాయికి ఇది అధిగమించినట్టు తెలిపింది. 2011లో లాంచ్ చేసిన ఓరియో అమ్మకాలు రూ.283 కోట్లు కాగ, మార్స్ బార్స్ రూ.270 కోట్లు. వీటన్నింటిన్నీ మించి పల్స్ కు మార్కెట్లో విశేషాధరణ లభిస్తోందని కంపెనీ తెలిపింది. పానీయాల్లో ఫేమస్ అయిన కోకా-కోలా అడ్వర్ టైజ్ చేసే కోక్ జీరో అమ్మకాలు కూడా రూ.120 కోట్లు మాత్రమే. భారత్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ తాము విక్రయాల్లో దూసుకుపోతున్నామని పల్స్ క్యాండీ తయారీ కంపెనీ చెబుతోంది. సింగపూర్, యూకే, అమెరికా స్టోర్లలో కూడా వీటిని విక్రయించడం ప్రారంభించామని డీఎస్ గ్రూప్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ శశాంక్ సురాన చెప్పారు. స్వీట్ క్యాండీ విభాగం రూ.6600 కోట్ల మార్కెట్ ను కలిగి ఉంది. ప్రతేడాది ఇది 12-14 శాతం వృద్ధి సాధిస్తోంది. -
తమిళ యూత్ తర్వాతి టార్గెట్ ఫిక్స్!
చెన్నై: జల్లికట్టును కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్న తమిళ యువత తర్వాత అన్నదాతల కోసం పోరాడనుంది. కర్షకులను కష్టల్లోకి నెడుతున్న బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టాలని యువకులు భావిస్తున్నారు. శీతల పానీయాలు తయారు చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల సంక్షేమం తమ తర్వాతి ఎజెండా అని జల్లికట్టు ఆందోళనలో పాల్గొన్న ఉద్యమకారులు వెల్లడించారు. అన్నదాతలకు నీళ్లు దక్కకుండా దోచుకుంటున్న కోకాకోల, పెప్సీలను నిషేధించాలన్న డిమాండ్ తో ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. బహుళజాతి కంపెనీలు తమ వ్యాపార అవకాశాల కోసం నీటిని వాడుకుంటూ పంటలకు అందకుండా చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఎంఎన్సీలకు వ్యతిరేకంగా కోయంబత్తూరులో యువత కూల్ డ్రింక్స్ బ్యాటిల్ ను విసిరేసి నిరసన తెలిపింది. వీరికి పలు హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలు మద్దతు ప్రకటించాయి. కోక్, పెప్సి సర్వ్ చేయబోమని పలు హోటళ్లు బోర్డులు పెట్టాయి. ‘మా సంస్థకు అన్ని బ్రాంచుల్లో పెప్సి, కోక్ ఉత్పత్తులు సర్వ్ చేయడం నిలిపివేశామ’ని ఆర్ హెచ్ ఆర్ హోటల్ మెయిన్ కౌంటర్ వద్ద బోర్డు పెట్టింది. బహుళజాతి సంస్థలు తయారు చేస్తున్న శీతలపానీయాలు ఆరోగ్యానికి హానికరమని కొంతమంది ఆందోళనకారులు పేర్కొంటున్నారు. వీటిపై నిషేధం విధించలేకపోయినా కనీసం అమ్మకాలను నియత్రించాలని వారు కోరుతున్నారు. -
ఎంఎన్సీ ఆర్అండ్డీ కేంద్రాల్లో వేతనాల పెంపు!
న్యూఢిల్లీ: భారత్‌లోని ఎంఎన్సీల ఆర్ అండ్ డీ సెంటర్లకు సంబంధించి కొత్త ఉద్యోగాలు, ఆట్రీషన్, వేతనాల పెంపు వంటి అంశాలు ఆశావహంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ ఈ విషయాల్లో సానుకూల ధోరణే ఉందని ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ పేర్కొంది. భారత్‌లో ఎంఎన్సీల ఆర్ అండ్ డీ సెంటర్లు 1,031 ఉన్నాయని, వీటి వృద్ధి ఏటా 4 శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని, అలాగే 2,44,000 మంది ఉద్యోగులున్నారని, ఈ ఉద్యోగాలు ఏటా 11 శాతం పెరుగుతున్నాయని తెలిపింది. ఈ ఆర్ అండ్ డీ సెంటర్లలో ఈ ఏడాది ఆట్రీషన్ 9 శాతం, హైరింగ్ 20 శాతం, వేతనాల పెంపు 12 శాతం చొప్పున ఉంటుందని అంచనా. -
చిన్న రైతుల పేరు.. పెద్ద కంపెనీల జోరు
-
చిన్న రైతుల పేరు.. పెద్ద కంపెనీల జోరు
చిన్న, సన్నకారు రైతులకుఉపయోగపడే చర్చలు శూన్యం బహుళజాతి కంపెనీల వ్యాపార అభివృద్ధికే చర్చల్లో ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల పేరిట జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సులో చర్చలు మాత్రం బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నెరవేర్చుకునే దిశగా కొనసాగుతున్నాయి. రైతులకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చకు ఇస్తున్న ప్రాధాన్యం నామమాత్రమే. వ్యవసాయ రంగంలో గణనీయంగా మార్పులు రావాలని కోరుతున్న కంపెనీలు.. ఆ మార్పులు కూడా తమ వ్యాపారాభివృద్ధికి అనుగుణంగా ఉండే వాదనలను సదస్సు ద్వారా ప్రచారంలోకి తెస్తున్నాయి. ఈ ప్రచారంలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ వర్సిటీల శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకుంటున్నారు. నగరంలోని హైటెక్స్‌లో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు తీరును పరిశీలిస్తే.. ఇది రైతుల కంటే బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలకే పరిమితం అయిన విషయం ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా దేశంలో, మన రాష్ట్రంలోని చిన్న, సన్న కారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం దిశగా చర్చలు జరగడం లేదు. పెపైచ్చు ఈ బడుగు రైతుల ద్వారా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంపొందించుకునే మార్గాన్వేషణ దిశగా చర్చలు సాగుతున్నాయి. బుధవారం ఉదయం డిఎస్ఎం ఇన్నొవేషన్ డెరైక్టర్ మురళి శాస్త్రి ‘జీవ ఆధారిత ఆర్థికవ్యవస్థ అభివద్ధిలో వ్యవసాయరంగం పాత్ర’ అనే అంశంపై చేసిన ప్రసంగమే ఇందుకు ఉదాహరణ. మొక్కజొన్న, జొన్న, వరి వంటి పంటల నూర్పిళ్లు జరిగినప్పుడు వ్యవసాయోత్పత్తులతో పాటు గడ్డి, పొట్టు వంటి ఉప ఉత్పత్తులు కూడా లభిస్తాయి. వీటితో ‘బయో బేస్డ్’ ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమయ్యే యంత్రాలను ప్రభుత్వం ప్రొత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఉపన్యాసంలో ఆసాంతమూ ఆయన తమ జీవ ఇంధన కంపెనీ తరఫున ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చారు. జీవ ఇంధన రంగానికి ప్రభుత్వం పోత్సాహకాలిస్తే తాము పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అన్న ధోరణిలో ఆయన ప్రసంగించారు. చర్చలో పాల్గొన్న మిగతా వారు కూడా అదే విషయాన్ని ‘ఆవు కథ’ మాదిరిగా కొనసాగించారు. తమ కంపెనీల గురించి చెప్పుకోవడం, ఈ రంగంలో కషి చేయడం ద్వారా చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చివరలో ఓ మాట అనడం మినహా.. క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అర్థవంతమైన సూచనలు చేసే దిశగా చర్చలు జరగలేదు. అలాగే మంగళవారం జరిగిన చర్చల్లో బేయర్ కంపెనీ సీఈవో లియాం కండోన్, జై న్ ఇరిగేషన్ సీఈవో అనిల్‌జైన్ వంటి వారు కూడా తమ కంపెనీ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెంచుకునేందుకు అవసరమైన చర్యలనే ప్రతిపాదించారు. మన దేశంలో ముఖ్యంగా సన్న, చిన్న కారు రైతులు పలు పంటలకు సొంత విత్తనాలనే వాడుకుంటారు లేదా తోటి రైతుల నుంచి దేశవాళీ విత్తనాలు కొంటారు. వీటి ఖర్చు తక్కువగా ఉంటుంది. అయితే, బేయర్ వంటి కంపెనీల ప్రతినిధులు మాత్రం బీటీ (జన్యుమార్పిడి) విత్తనాలను ప్రొత్సహించేలా విధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చల్లో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటున్న ప్రతినిధులు సైతం ఇలాంటి ప్రతిపాదనలే చేస్తున్నారు. అంటే.. చర్చల్లో ఎవరు పాల్గొనాలో కూడా బడా కంపెనీలే ముందే ఎంపిక చేశాయన్నమాట. సదస్సుకు హాజరయిన ప్రతినిధుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పోగా.. మిగిలిన వారిలో ఎక్కువ మంది బడా కంపెనీల ప్రతినిధులే. 25 మంది రైతు సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపినా దాదాపుగా వారందరూ సదస్సును బహిష్కరించారు. పేలవంగా రెండోరోజు.. ప్రపంచ వ్యవసాయ సదస్సు రెండోరోజు పేలవంగా సాగింది. తొలి రోజు ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల హాజరుతో కాస్త హడావుడి కనిపించింది. వివిధ రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు పాల్గొనడంతో చర్చా గోష్టులు కాస్త అర్థవంతంగా సాగాయి. వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వివిధ వ్యవసాయ అనుబంధ శాఖల ఉద్యోగుల్లో చాలా మంది రెండో రోజు హాజరు కాలేదు. కర్నాటక వ్యవసాయ శాఖ మంత్రి క్రిష్ణ బైరె గౌడ కీలకోపన్యాసం అనంతరం సభ్యులు మరింత పలుచబడ్డారు. పాడి అభివద్ధిపై చర్చఓ మోస్తరుగా సాగింది. ఒకటి, రెండు చర్చాగోష్టులు రద్దయ్యాయి. సదస్సు గురువారంతో ముగుస్తుంది. ‘రైతులకు ఆదాయ భద్రత ద్వారానే ఆహార భద్రత’ రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చే పరిస్థితులు కల్పించినప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుందని బెరైగౌడ అభిప్రాయపడ్డారు. సదస్సులో రెండో రోజు ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డి. వెంకటేశ్వర్లు, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా కేంద్రం డెరైక్టర్ బి. వెంకటేశ్వర్లు కూడా ప్రసంగించారు.