తేడా వస్తే యుద్ధమే.. కొత్త సమస్య సృష్టించొద్దు : కేసీఆర్
తెలంగాణకు శాంతిభద్రతలు లేకుండా చేస్తే అవమానించినట్లే
చంద్రబాబు లతుకోరే.. ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ లేదు
సీఎం, సీమాంధ్ర నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది
అక్కడి ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే వారి ప్రయత్నం
తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత పార్టీపై నిర్ణయం తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటులో తేడా వస్తే యుద్ధమే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే అది తెలంగాణ జాతికి అవమానమని.. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు కూడా దెబ్బతింటాయని హెచ్చరించారు. శాంతిభద్రతలు తెలంగాణకు లేకుండా చేస్తే అది అవమానించినట్టేనన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో అసెంబ్లీలో తీర్మానం, బిల్లు అవసరమే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. కేవలం సమాచారం మాత్రమే అసెంబ్లీకి ఇస్తారన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా సీమాంధ్ర నేతలు చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు.
తెలంగాణ ఆగదని తెలిసినా వారు సీమాంధ్ర ప్రజల్లో భ్రమలు, అయోమయం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాను తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కగానే ఉంటానని.. ముఖ్యమంత్రిని కానని ఆయన స్పష్టంచేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని కాపాడుకునే సమర్థత తెలంగాణ రాజ్యానికి ఉందన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత తమ పార్టీని ఏమైనా చేయాల్సి వస్తే అప్పుడు సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. సమావేశం వివరాలను వెల్లడించారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
కొత్త సమస్యను సృష్టించొద్దు...
హైదరాబాద్‌పై ఏవో కిరికిరిలు పెట్టాలనే యోచన ఉన్నట్టు మీడియాలో వస్తున్నదని.. తెలంగాణ అంశాన్ని పరిష్కరించామంటూ కొత్త సమస్యను సృష్టించొద్దని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలు తెలంగాణకు లేకుండా చేస్తే అది అవమానించినట్టేనన్నారు. దేశంలో ఇప్పటిదాకా ఏర్పాటైన 28 రాష్ట్రాల్లో లేని కొత్త విధానం తెలంగాణకు ఎందుకని ప్రశ్నించారు. ఆ 28 రాష్ట్రాల ఏర్పాటు సమయంలో లేని పరిస్థితులు ఇప్పుడొస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారందరి భద్రతను తెలంగాణ రాజ్యమే బాధ్యతగా తీసుకుంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు ఉండాలని ఎప్పుడూ అనలేదన్నారు. ఉమ్మడి రాజధాని ఎన్నేళ్లు అనేదానిని జీవోఎంకు ఇచ్చే నివేదికలో స్పష్టంగా చెప్తామని.. దానిని బహిరంగం కూడా చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణపై ఆంక్షల్లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఆధ్వర్యంలో నివేదికను జీవోఎంకు అందిస్తామని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవటం తప్పుకాదు..
తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పార్టీగా.. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కావాలని అనుకోవటం తప్పుకాదని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఇచ్చినమా, తెచ్చినమా అనేది చరిత్రలో రికార్డు అయితది. ఈ అంశంలోకి పోను. పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు నెగ్గిన తర్వాత పార్టీని ఏమైనా చేయాల్సి వస్తే.. ఇప్పుడు కూర్చున్నట్టుగానే సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేసి చర్చ చేసి, నిర్ణయించుకుంటం. హైదరాబాద్‌తో సహా తెలంగాణ ఏర్పాటైన తర్వాత తదనంతర పరిస్థితులను బట్టి స్పందిస్తాం. 2001 నుండి ఇప్పటిదాకా అన్నంతినో, అటుకులు బుక్కో కొట్లాడినం. ఒక్కొక్కరి మీద వంద కేసులున్నయి. ఎంపీగానో, ఎమ్మెల్యేగానో కావాలనుకుంటే రాజకీయాల్లో తప్పులేదు. తెలంగాణలో ఏం చేయాలో వందల గంటలు అధ్యయనం చేసి విజన్ డాక్యుమెంటును రూపొందించినం. వాటిని అమలుచేయిస్తం. తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉండాలో సమయం, ప్రజలు నిర్ణయిస్తారు’’ అని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ చెప్పినట్టుగా హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాలతో సంపూర్ణ తెలంగాణ ఏర్పాటైన తర్వాత, తగిన సందర్భంలో విజయోత్సవాలు చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
అయోమయం సృష్టించేందుకే వారి ప్రయత్నం...
తెలంగాణ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా సీమాంధ్ర నేతలు చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోయిందని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత.. అది పార్టీ నిర్ణయమే, ప్రభుత్వం నిర్ణయం కాదన్నారు.. కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత, జీవోఎం ఏర్పాటైన తర్వాత కూడా ఏవో చెబుతున్నారు. కానీ వాస్తవం ఏమిటో అందరికీ అర్థమవుతున్నది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నేతలు ఈ సమయంలోనూ ఇంకా లాగడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణ ఆగదని తెలిసినా సీమాంధ్ర ప్రజల్లో భ్రమలు, అయోమయం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విభజన తేలిపోయిన తర్వాత మంచి ప్యాకేజీ, అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసం అడగకుండా.. ఇలా చేయటం రాజనీతిజ్ఞుల లక్షణం కాదన్నారు. ఇంకా కయ్యం పెట్టుకోకుండా పరిణితితో, రాజనీతిజ్ఞుల్లా వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు.
చంద్రబాబుకు స్క్రూ లూజ్...
‘‘చంద్రబాబుకు మెంటల్ బ్యాలెన్స్ లేదని జాతీయ మీడియా మొన్న ఢిల్లీలోనే తేల్చింది. ఎందుకు దీక్ష చేస్తున్నాడో, డిమాండు ఏమిటో, దీక్షకు కారణం ఏమిటో అడిగితే చెప్పలేదని తేల్చారు. చంద్రబాబుకు స్క్రూ లూజ్ అయినట్టుంది. మెంటల్ బ్యాలెన్స్ పూర్తిగా పోయిందని సోనియాగాంధీపై వ్యాఖ్యలతో మరోసారి తేలింది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పోయినట్లుగానే సోనియాగాంధీ కూడా పోతారంటూ 9 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడు నీచంగా, దారుణంగా మాట్లాడినాడు’’ అని కేసీఆర్ తూర్పారబట్టారు. ‘‘తెలంగాణను ఇన్నిసార్లు అడ్డుకున్న చంద్రబాబు.. తెలంగాణ ప్రజల ఉసురుతాకి పోడా!’’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్ర విభజనపై ఏం చెప్పినా, చెప్పకున్నా తెలంగాణకు వ్యతిరేకిగా, ద్రోహిగానే మాట్లాడుతున్నారని, పెద్ద లతుకోరులాగానే వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆ పార్టీలోని తెలంగాణ నాయకులు ఆత్మవంచన చేసుకుంటూ, ఇంకా తెలంగాణ ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలోకి, ప్రజల్లోకి రావాలని వారికి సూచించారు. ఇంకా అదే లతుకోరు చంద్రబాబుతో ఉంటూ పరువు తీసుకోవద్దన్నారు.