‘ఎర్ర’ కూలీల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు!
చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అటవీ ప్రాంతంలో గత ఏప్రిల్‌లో పోలీసు కాల్పుల్లో మరణించిన తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీల కుటుంబసభ్యులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. కాల్పుల్లో మరణించిన ఎర్రచందనం కూలీల కుటుంబాలకు చెందిన ఐదుగురిని వివిధ ఉద్యోగాల్లో నియమిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సింహాచలం అటవీ ప్రాంతంలో ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్ బలగాలు కాల్పులు జరపడంతో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందడం, దీనిపై తమిళనాడుతో సహా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే.
కూలీలను కాల్చివేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జయలలిత తీవ్ర నిరసన కూడా తెలిపారు. అలాగే, మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేదరికంలో మగ్గుతున్న తమకు ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పించాలంటూ మరణించిన ఎర్రచందనం కూలీల కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా తాజాగా జయలలిత ఈ మేరకు వారికి ఉద్యోగాలు కల్పించారు.