Tamil Nadu Chief Minister Jayalalithaa
-
ఇక ‘అమ్మ’ కల్యాణ మండపాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా మరో పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే అమ్మ బ్రాండ్లతో తరిస్తున్న ఆ రాష్ట్ర ప్రజలకు పురచ్చి తలైవీ శనివారం మరో బంఫర్ ఆఫర్ ఇచ్చారు. తమిళనాడు ప్రజలకు ఇక అమ్మ కల్యాణ మండపాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగానే రూ.83కోట్లు వెచ్చించి రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో ఈ కల్యాణ మండపాలను ప్రభుత్వం నిర్మించనుంది. కల్యాణ మండపాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. పేద, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జయలలిత తెలిపారు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు,సహకార సంఘాలు ఆధ్వర్యంలో మండపాల నిర్మాణం చేపట్టనుంది. వరుడు,వధువులతో పాటు అతిథి గదులు, భోజనశాల, వంటగది ఉండే ఈ కల్యాణ మండపాలలో ఎయిర్ కండిషనర్ సదుపాయం కూడా ఉంటుంది. తోండియార్ పేట, వెలాచెరి, అయపాక్కం, పెరియార్ నగర్, కొరట్టార్ (చెన్నై), అన్నానగర్ (మధురై), అంబ సముద్రం (తిరునల్వేలి), సేలం, కొడున్గైయార్( తిరువళ్లూరు), వడమాలైపేట (తిరుపూర్)లో కల్యాణ మండపాలు నిర్మాణం చేపట్టనుంది. అలాగే మురికివాడల్లో పేదల కోసం రూ.1800 కోట్లతో 50వేల గృహాలు నిర్మించనున్నట్లు జయలలిత ప్రకటన చేశారు. కాగా జయ...ఆ రాష్ట్ర ప్రజలకోసం ‘అమ్మ’ క్యాంటీన్లు, ‘అమ్మ’ వాటర్, ‘అమ్మ’ కూరగాయలు, ‘అమ్మ’ మెడికల్ షాపులు,‘అమ్మ’ సిమెంట్, ‘అమ్మ’ ఉప్పు అమ్మ జిమ్‌లు ... ఇలా పలు పథకాలు ప్రారంభించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. -
సీఎం ఏరియల్ సర్వే
తిరువళ్లూరు: రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి జయలలిత అధికారులతో కలిసి హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత అక్టోబర్ 28 నుంచి భారీ వర్షాలు మెదలైన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు, చెన్నై తదితర జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై నగరాన్ని వ రదలు నిలువునా ముంచెత్తడంతో భారీగా ఏర్పడిన నష్టం ఏర్పడింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది. వాస్తవానికి బుధవారమే ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించినా, వాతావరణం అనుకూలించకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి జయలలిత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. చెన్నై నుంచి ఉదయం 9.30 గంటలకు కొరట్టూరు పురం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి ఈకాడుతాంగెల్, కొలత్తూరు, అడయార్, వేళచ్చేరీ, తిరువొత్తియూర్, ఊరపాక్కం, తాంబరం, ముడిచ్చూర్, మడిపాక్కం, పాపాన్సత్రం, సోలింగనల్లూరు, వ్యాసార్పాడి తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లాలోనీ సడయన్పాక్కం, మడత్తుకుప్పం, రేట్టేరీ, పుళల్, పూండీ, చెమరంబాక్కం, మనలిపుదునగర్ తదితర ప్రాంతాల్లోనూ దాదాపు మూడు గంటల పాటు పర్యటించి సర్వే నిర్వహించారు. అధికారులతో అత్యవసర సమావేశం : చెన్నై , కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న అధికారులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద భాదితులకు అందుతున్న సహయక చర్యలను అధికారుల నుండి అడి గి తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, నష్టనివారణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను అదేశించారు. సహయక చర్యల్లో విమర్శలు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారినీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశించారు. ఇప్పటి వరకు ఏర్పాటు ఏర్పాటు చేసిన శిబిరాల్లో వుంటున్న నిరాశ్రయులకు చాప, బెడ్షీట్లను అంద జేయాలని ఆదేశాలు జారీ చేసారు. సహయక చర్యల్లో పాల్గొనండి : వరద బాధితులకు అండగా పార్టీ నేతలు ముందుండాలని ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న వారినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన ఆహారపదార్థాలను అందజేయాలని సూచించారు. చెరువులు, వాగులు వంకలు కొట్టుకు పోతే వాటిని సరిచేయడానికి పార్టీ నేతలు తమ వంతు సహకారాన్ని అందజేయాలని ఆయన సూచించారు. -
‘ఎర్ర’ కూలీల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు!
చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అటవీ ప్రాంతంలో గత ఏప్రిల్‌లో పోలీసు కాల్పుల్లో మరణించిన తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీల కుటుంబసభ్యులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. కాల్పుల్లో మరణించిన ఎర్రచందనం కూలీల కుటుంబాలకు చెందిన ఐదుగురిని వివిధ ఉద్యోగాల్లో నియమిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సింహాచలం అటవీ ప్రాంతంలో ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్ బలగాలు కాల్పులు జరపడంతో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలు మృతిచెందడం, దీనిపై తమిళనాడుతో సహా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. కూలీలను కాల్చివేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జయలలిత తీవ్ర నిరసన కూడా తెలిపారు. అలాగే, మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేదరికంలో మగ్గుతున్న తమకు ప్రభుత్వ పరంగా ఉపాధి కల్పించాలంటూ మరణించిన ఎర్రచందనం కూలీల కుటుంబసభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా తాజాగా జయలలిత ఈ మేరకు వారికి ఉద్యోగాలు కల్పించారు. -
సచివాలయానికి జయ
చెన్నై: తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు తెరదించుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం సచివాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. గత పదిరోజులుగా జయ బయట కనపడకపోవడం, పలు కార్యక్రమాలను రద్దు చేసుకోవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్‌ను విడుదల చేయాలని డీఎంకే అధినేత కరుణానిధితో సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఆమెకు అమెరికాలో కాలేయమార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారని ఓ వెబ్ పోర్టల్ రాయడం, ఇదే విషయాన్ని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి ట్వీట్ చేయడంతో తమిళనాడు సీఎం ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తిచెందాయి. -
జోక్యం చేసుకోండి
ముల్లైపెరియార్ డ్యాం వ్యవహారాల్లో తమరు జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జయలలిత విజ్ఞప్తి చేశారు. కొత్త డ్యాం నిర్మాణానికి కేరళ వేస్తున్న ఎత్తుల్ని చిత్తు చేయడం లక్ష్యంగా ముందుకు సాగేందుకు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులతో జరిపిన సమీక్షలో తీర్మానించారు. సాక్షి, చెన్నై : కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాలోని ముల్లై పెరియార్ డ్యాం నీటిపై తమిళనాడులోని తేని, దిండుగల్, శివగంగై, రామనాథపురం, మదురై జిల్లాలు ఆధార పడి ఉన్న విషయం తెలిసిందే. ఆ డ్యాంపై సర్వ హక్కులు తమిళనాడుకే ఉన్నాయి. అయితే, సమయం దొరికినప్పుడల్లా ఆ హక్కుల్ని తుంగలో తొక్కడం లక్ష్యంగా కేరళ పాలకులు ఏళ్ల తరబడి ఎత్తులు వేస్తూ వస్తున్నారు. వీరి ఎత్తులను చిత్తు చేసే రీతిలో రాష్ర్టంలోని పాలకులు పదే పదే అడ్డుకుంటూ వస్తున్నారు. కోర్టులు అక్షింతలు వేసినా, తమిళులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినా వాటిని మాత్రం కేరళ పాలకులు ఖాతరు చేయడం లేదు. గత కొంత కాలం వరకు ఆ డ్యాంతో పెను ముప్పు ఉందని, ఏ సమయంలోనైనా కూలి పోవచ్చన్నట్టుగా కేరళ పాలకులు ఆరోపణలు గుప్పించారు. చివరకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగిన పరిశీలనలో ఆ డ్యాం పటిష్టంగా ఉందని తేలింది. అలాగే, ఆ డ్యాం నీటి మట్టం 142 అడుగులకు సైతం పెంచారు. ఈ నీటి మట్టం పెంపును అడ్డుకునేందుకు సైతం కేరళ పలు కుట్రలు చేసినా, చివరకు తమిళనాడు ప్రజల మనో భావాలు, హక్కులకే విజయం దక్కిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో మళ్లీ కొత్త ఎత్తులు వేసే పనిలో కేరళ పడింది. ఆ డ్యాంకు ప్రత్యామ్నాయంగా మరో డ్యాం నిర్మించి తీరాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. మళ్లీ సర్వే : ముల్లై పెరియార్డ్యాం బలహీనంగా ఉందని, ఆ డ్యాంకు ప్రత్యామ్నాయంగా మరో డ్యాం నిర్మించనున్నామని 2007లో కేరళ పాలకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు తగ్గ సర్వేలు సాగినా, తమిళనాడులో బయలు దేరిన నిరసనలతో, కొర్టు అక్షింతలతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో గత నెల చాప కింద నీరులా డ్యాం నిర్మాణాలకు సంబంధించి సర్వేను కేరళ చేపట్టి ఉండటం వెలుగులోకి వచ్చింది. ముల్లై పెరియార్ డ్యాంకు ఐదు వందల అడుగుల కింది భాగంలో ఉన్న వల్లక్కడవు వద్ద పదిహేను చోట్ల ఈ సర్వేలు సాగినట్టు తేలింది. దీంతో కేరళ చర్యల్ని అడ్డుకోవడం లక్ష్యంగా మళ్లీ సుప్రీంకోర్టును తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అధికారుల బృందం ఆశ్రయించింది. దీన్ని ఆసరగా తీసుకున్న కేరళ పాలకులు చాప కింద నీరులా కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ శాఖ అనుమతి దక్కించుకునేందుకు పావులు కదిపే పనిలో పడింది. జోక్యం చేసుకోరూ : కేంద్రంలో అనుమతి కోసం కేరళ కదుపుతున్న పావులను అడ్డుకునేందుకు సీఎం జయలలిత సిద్ధం అయ్యారు. గురువారం ఉదయం సచివాలయంలో మంత్రులతో సమావేశం అయ్యారు. మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, పళనియప్పన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్ సమావేశానికి హాజరు అయ్యారు. కేరళ ఆగడాలకు కల్లెం వేయడం లక్ష్యంగా ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించే పనిలో పడ్డారు. ఆ మేరకు ప్రధానికి సీఎం జయలలిత లేఖ రాశారు. అందులో ముల్లైపెరియార్ డ్యాం వ్యవహారం గురించి వివరించారు. కేరళ వేస్తున్న ఎత్తులు , చేస్తున్న కుట్రలను విశదీకరించారు. ప్రస్తుతం కొత్త డ్యాం నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతి కోరేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఇందుకు సంబంధించిన ఫైల్స్ చేరినట్టు, అనుమతి వ్యవహారం పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారాలు వచ్చి ఉన్నాయన్నారు. ముల్లై పెరియార్ డ్యాం వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నదని, ఇప్పటికే పలు తీర్పులు తమిళనాడుకు అనుకూలంగా వచ్చాయని గుర్తు చేశారు. కొత్త డ్యాం నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఇచ్చిన పక్షంలో కోర్టు ధిక్కారం కిందకు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు. ఈ వ్యవహారంలో తమరు జోక్యం చేసుకోవాలని కోరారు. ఎలాంటి అనుమతులను కేరళ సర్కారుకు ఇవ్వ కూడదని, అందుకు తగ్గ ఆదేశాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమిళుల మనో భావాలకు అనుగుణంగా వ్యవహరించాలని వేడుకున్నారు. -
బాధ్యతలు చేపట్టిన జయ
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 8 నెలల అనంతరం సచివాలయానికి వచ్చిన జయలలితకు అధికార వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. గంటపాటు సెక్రటేరియట్లో ఉన్న జయలలిత ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 201 అమ్మ క్యాంటీన్ల(పేదలకు సబ్సిడీ రేట్లకు ఆహారం అందించే స్టాల్)ను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రూ. 1800 కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నగర, గ్రామీణ రోడ్ల అభివృద్ధి, పేదలకు సౌర విద్యుత్ సదుపాయంతో పక్కా ఇళ్ల నిర్మాణం, తాగునీటి పథకం, మహిళల్ని కుటుంబ పెద్దలుగా తీర్చిదిద్దడం.. మొదలైనవి అందులో ఉన్నాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు జయ రావడంతో ఆదివారమైనా సెక్రటేరియట్లో సందడి నెలకొంది. జయలలితతో పాటు ఆమె మంత్రివర్గ సహచరులు 28 మంది కూడా బాధ్యతలు స్వీకరించారు. -
పన్నీర్‌కే పట్టం..
నమ్మినబంటుకే సీఎంగా ఓటేసిన జయ పన్నీర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నేడు ప్రవూణస్వీకారం చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి, అమ్మకు అత్యంత నమ్మకస్తుడైన ఒ.పన్నీర్ సెల్వం(63) ఆమె వారసునిగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై పన్నీర్‌సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం లెజిస్లేచర్ పార్టీ నిర్ణయుం గురించి పన్నీర్ గవర్నర్ కె.రోశయ్యను కలసి వివరించారు. దీంతో గవర్నర్ ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆయన సోమవారం ఉదయం తమిళనాడు తదుపరి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని అమ్మ కోల్పోయారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. బెంగళూరు కోర్టులో 27న జయ కేసు విచారణ సమయంలోనే.. మధ్యలో వెలుపలకు వచ్చిన జయ, పన్నీర్‌ను పిలిపించుకుని కొద్దిసేపు మాట్లాడారు. అప్పుడే అమ్మ వారసుడు పన్నీర్ అనే ప్రచారం మొదలైంది. చివరికి అదే నిజమైంది. 2001లో జయ జైలుకు వెళ్లిన ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈసారి పన్నీర్ సెల్వం పేరుతోపాటూ రవాణా మంత్రి బాలాజీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ పేర్లు వినిపించాయి. అయితే పిన్న వయసు, అనుభవ లోపం బాలాజీని వెనక్కునెట్టగా.. పార్టీవారిని కాదని మాజీ ఐఏఎస్‌ను సీఎంను చేస్తే క్యాడర్లో అసంతృప్తి బయలుదేరే అవకాశం ఉందనే అనుమానంతో షీలాను పక్కనపెట్టారు. జయ జైలుకెళ్లడంతో తమిళనాట వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు ఆదివారానికి చల్లబడ్డాయి. చెన్నై: ఓ పక్క పొలం పనులు చూసుకుంటూనే రాజకీయ నేతగా రాణించిన ఓ.పన్నీర్‌సెల్వం(63) రెండోసారి తమిళనాడు సీఎం కాబోతున్నారు. పన్నీర్ 1951లో తేనీ జిల్లా పెరియకుళంలో జన్మించారు. ఆయన గతంలో టీ కొట్టు కూడా నడిపారు. ప్రస్తుతం దాన్ని ఆయన కుటుంబసభ్యులు నడుపుతున్నారు. పన్నీర్ 1990లో పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యూరు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పెరియకుళం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది జయ కేబినెట్లో మంత్రిగా చేరారు. టాన్సీ భూముల కేసులో జయ అదే ఏడాది జైలుకెళ్లడంతో ఆయన సీఎం అయ్యారు. 2001 సెప్టెంబరు నుంచి 2002 మార్చి దాకా ఆ పదవిలో ఉన్నారు. జయ జైలు నుంచి రాగానే రాజీనామా చేసి ఆమె కేబినెట్లో మంత్రిగా చేరారు. 2011లో తేనీ జిల్లా బోడీ స్థానం ఎమ్మెల్యేగా ఎన్నికై జయ కేబినెట్లో ఆర్థిక శాఖ చేపట్టారు. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా పన్నీర్ రికార్డు సృష్టించారు.