పన్నీర్‌కే పట్టం..
నమ్మినబంటుకే సీఎంగా ఓటేసిన జయ
పన్నీర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
నేడు ప్రవూణస్వీకారం
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి, అమ్మకు అత్యంత నమ్మకస్తుడైన ఒ.పన్నీర్ సెల్వం(63) ఆమె వారసునిగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై పన్నీర్‌సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం లెజిస్లేచర్ పార్టీ నిర్ణయుం గురించి పన్నీర్ గవర్నర్ కె.రోశయ్యను కలసి వివరించారు. దీంతో గవర్నర్ ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆయన సోమవారం ఉదయం తమిళనాడు తదుపరి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని అమ్మ కోల్పోయారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. బెంగళూరు కోర్టులో 27న జయ కేసు విచారణ సమయంలోనే.. మధ్యలో వెలుపలకు వచ్చిన జయ, పన్నీర్‌ను పిలిపించుకుని కొద్దిసేపు మాట్లాడారు. అప్పుడే అమ్మ వారసుడు పన్నీర్ అనే ప్రచారం మొదలైంది. చివరికి అదే నిజమైంది. 2001లో జయ జైలుకు వెళ్లిన ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈసారి పన్నీర్ సెల్వం పేరుతోపాటూ రవాణా మంత్రి బాలాజీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ పేర్లు వినిపించాయి. అయితే పిన్న వయసు, అనుభవ లోపం బాలాజీని వెనక్కునెట్టగా.. పార్టీవారిని కాదని మాజీ ఐఏఎస్‌ను సీఎంను చేస్తే క్యాడర్‌లో అసంతృప్తి బయలుదేరే అవకాశం ఉందనే అనుమానంతో షీలాను పక్కనపెట్టారు. జయ జైలుకెళ్లడంతో తమిళనాట వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు ఆదివారానికి చల్లబడ్డాయి.
చెన్నై: ఓ పక్క పొలం పనులు చూసుకుంటూనే రాజకీయ నేతగా రాణించిన ఓ.పన్నీర్‌సెల్వం(63) రెండోసారి తమిళనాడు సీఎం కాబోతున్నారు. పన్నీర్ 1951లో తేనీ జిల్లా పెరియకుళంలో జన్మించారు. ఆయన గతంలో టీ కొట్టు కూడా నడిపారు. ప్రస్తుతం దాన్ని ఆయన కుటుంబసభ్యులు నడుపుతున్నారు. పన్నీర్ 1990లో పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యూరు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పెరియకుళం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది జయ కేబినెట్‌లో మంత్రిగా చేరారు. టాన్సీ భూముల కేసులో జయ అదే ఏడాది జైలుకెళ్లడంతో ఆయన సీఎం అయ్యారు. 2001 సెప్టెంబరు నుంచి 2002 మార్చి దాకా ఆ పదవిలో ఉన్నారు. జయ జైలు నుంచి రాగానే రాజీనామా చేసి ఆమె కేబినెట్‌లో మంత్రిగా చేరారు. 2011లో తేనీ జిల్లా బోడీ స్థానం ఎమ్మెల్యేగా ఎన్నికై జయ కేబినెట్‌లో ఆర్థిక శాఖ చేపట్టారు. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా పన్నీర్ రికార్డు సృష్టించారు.