Legislative floor leader
-
పన్నీర్‌కే పట్టం..
నమ్మినబంటుకే సీఎంగా ఓటేసిన జయ పన్నీర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నేడు ప్రవూణస్వీకారం చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి, అమ్మకు అత్యంత నమ్మకస్తుడైన ఒ.పన్నీర్ సెల్వం(63) ఆమె వారసునిగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై పన్నీర్‌సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం లెజిస్లేచర్ పార్టీ నిర్ణయుం గురించి పన్నీర్ గవర్నర్ కె.రోశయ్యను కలసి వివరించారు. దీంతో గవర్నర్ ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆయన సోమవారం ఉదయం తమిళనాడు తదుపరి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని అమ్మ కోల్పోయారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. బెంగళూరు కోర్టులో 27న జయ కేసు విచారణ సమయంలోనే.. మధ్యలో వెలుపలకు వచ్చిన జయ, పన్నీర్‌ను పిలిపించుకుని కొద్దిసేపు మాట్లాడారు. అప్పుడే అమ్మ వారసుడు పన్నీర్ అనే ప్రచారం మొదలైంది. చివరికి అదే నిజమైంది. 2001లో జయ జైలుకు వెళ్లిన ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈసారి పన్నీర్ సెల్వం పేరుతోపాటూ రవాణా మంత్రి బాలాజీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ పేర్లు వినిపించాయి. అయితే పిన్న వయసు, అనుభవ లోపం బాలాజీని వెనక్కునెట్టగా.. పార్టీవారిని కాదని మాజీ ఐఏఎస్‌ను సీఎంను చేస్తే క్యాడర్లో అసంతృప్తి బయలుదేరే అవకాశం ఉందనే అనుమానంతో షీలాను పక్కనపెట్టారు. జయ జైలుకెళ్లడంతో తమిళనాట వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు ఆదివారానికి చల్లబడ్డాయి. చెన్నై: ఓ పక్క పొలం పనులు చూసుకుంటూనే రాజకీయ నేతగా రాణించిన ఓ.పన్నీర్‌సెల్వం(63) రెండోసారి తమిళనాడు సీఎం కాబోతున్నారు. పన్నీర్ 1951లో తేనీ జిల్లా పెరియకుళంలో జన్మించారు. ఆయన గతంలో టీ కొట్టు కూడా నడిపారు. ప్రస్తుతం దాన్ని ఆయన కుటుంబసభ్యులు నడుపుతున్నారు. పన్నీర్ 1990లో పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యూరు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పెరియకుళం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది జయ కేబినెట్లో మంత్రిగా చేరారు. టాన్సీ భూముల కేసులో జయ అదే ఏడాది జైలుకెళ్లడంతో ఆయన సీఎం అయ్యారు. 2001 సెప్టెంబరు నుంచి 2002 మార్చి దాకా ఆ పదవిలో ఉన్నారు. జయ జైలు నుంచి రాగానే రాజీనామా చేసి ఆమె కేబినెట్లో మంత్రిగా చేరారు. 2011లో తేనీ జిల్లా బోడీ స్థానం ఎమ్మెల్యేగా ఎన్నికై జయ కేబినెట్లో ఆర్థిక శాఖ చేపట్టారు. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా పన్నీర్ రికార్డు సృష్టించారు. -
ఢిల్లీలో డీఎస్ లాబీయింగ్!
- శాసనమండలి ఫ్లోర్‌లీడర్ కోసం యత్నం - దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి మంతనాలు - సీనియర్ నేతగా ఆయనకే దక్కే అవకాశం? సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అయిన ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీలో మకాం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్‌కు చేరిన ఆయన రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణకు చెందిన పలువురు టీ-కాంగ్రె స్ నాయకులు సైతం ఢిల్లీలోనే ఉన్నారు. డీఎస్ రెండు రోజుల నుంచి కీలక పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయమై తెలంగాణ ప్రజల మనోభావాలను అధినేత్రి సోనియాకు తెలిపేందుకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేశారు. అయితే ఈసారి మాత్రం శాసనమండలి ఫ్లోర్‌లీడర్ పదవి కోసం దేశ రాజధానికి చేరిన ఆయన బుధవారం ఢిల్లీ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో డీఎస్ భేటీ అయినట్లు సమాచారం. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం.. ఆ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనమండలి పక్షనేతగా అవకాశం కల్పించాలని కోరినట్లు పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. 1983లో రాజకీయ ఆరంగేట్రం చేసిన డీఎస్ అనతికాలంలోనే దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే నేతగా ఎదిగారు. 1989లో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణపై విజయం సాధించిన ఆయన 1999, 2004లలో వరుసగా గెలుపొందారు. 2004, 2009లలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ సీఎం కాగా.. ఆ రెండు ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షునిగా వ్యవహరించిన డీఎస్ అధిష్టానానికి మరింత దగ్గరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో అర్బన్‌గా మారిన నిజామాబాద్ నుంచి 2009, 2010 ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చెందిన ఆయనకు ఈసారి నిజామాబాద్ రూరల్‌ను ఎంచుకున్నప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలోనూ ఓటమి తప్పలేదు. అయితే 2010 ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన డీఎస్‌కు 2011 అక్టోబర్‌లో కాంగ్రెస్ అధిష్టానం శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో శాసనమండలి సభ్యునిగా ఉన్న తనకు తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలికి తొలి ఫ్లోర్‌లీడర్‌గా అవకాశం కల్పించాలని దిగ్విజయ్ సింగ్‌ను కోరినట్లు సమాచారం. ఇదిలా వుండగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ కూడ ఇదే పదవి కోసం ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. ఆయన కూడా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసింది. అయితే డీఎస్కే ఈ విషయంలో అధిష్టానం అనుకూలంగా ఉన్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.