ముల్లైపెరియార్ డ్యాం వ్యవహారాల్లో తమరు జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జయలలిత విజ్ఞప్తి చేశారు. కొత్త డ్యాం నిర్మాణానికి కేరళ వేస్తున్న ఎత్తుల్ని చిత్తు చేయడం లక్ష్యంగా ముందుకు సాగేందుకు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రులతో జరిపిన సమీక్షలో తీర్మానించారు.
సాక్షి, చెన్నై : కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాలోని ముల్లై పెరియార్ డ్యాం నీటిపై తమిళనాడులోని తేని, దిండుగల్, శివగంగై, రామనాథపురం, మదురై జిల్లాలు ఆధార పడి ఉన్న విషయం తెలిసిందే. ఆ డ్యాంపై సర్వ హక్కులు తమిళనాడుకే ఉన్నాయి. అయితే, సమయం దొరికినప్పుడల్లా ఆ హక్కుల్ని తుంగలో తొక్కడం లక్ష్యంగా కేరళ పాలకులు ఏళ్ల తరబడి ఎత్తులు వేస్తూ వస్తున్నారు. వీరి ఎత్తులను చిత్తు చేసే రీతిలో రాష్ర్టంలోని పాలకులు పదే పదే అడ్డుకుంటూ వస్తున్నారు. కోర్టులు అక్షింతలు వేసినా, తమిళులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినా వాటిని మాత్రం కేరళ పాలకులు ఖాతరు చేయడం లేదు. గత కొంత కాలం వరకు ఆ డ్యాంతో పెను ముప్పు ఉందని, ఏ సమయంలోనైనా కూలి పోవచ్చన్నట్టుగా కేరళ పాలకులు ఆరోపణలు గుప్పించారు.
చివరకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగిన పరిశీలనలో ఆ డ్యాం పటిష్టంగా ఉందని తేలింది. అలాగే, ఆ డ్యాం నీటి మట్టం 142 అడుగులకు సైతం పెంచారు. ఈ నీటి మట్టం పెంపును అడ్డుకునేందుకు సైతం కేరళ పలు కుట్రలు చేసినా, చివరకు తమిళనాడు ప్రజల మనో భావాలు, హక్కులకే విజయం దక్కిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో మళ్లీ కొత్త ఎత్తులు వేసే పనిలో కేరళ పడింది. ఆ డ్యాంకు ప్రత్యామ్నాయంగా మరో డ్యాం నిర్మించి తీరాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. మళ్లీ సర్వే : ముల్లై పెరియార్‌డ్యాం బలహీనంగా ఉందని, ఆ డ్యాంకు ప్రత్యామ్నాయంగా మరో డ్యాం నిర్మించనున్నామని 2007లో కేరళ పాలకులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందుకు తగ్గ సర్వేలు సాగినా, తమిళనాడులో బయలు దేరిన నిరసనలతో, కొర్టు అక్షింతలతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో గత నెల చాప కింద నీరులా డ్యాం నిర్మాణాలకు సంబంధించి సర్వేను కేరళ చేపట్టి ఉండటం వెలుగులోకి వచ్చింది. ముల్లై పెరియార్ డ్యాంకు ఐదు వందల అడుగుల కింది భాగంలో ఉన్న వల్లక్కడవు వద్ద పదిహేను చోట్ల ఈ సర్వేలు సాగినట్టు తేలింది. దీంతో కేరళ చర్యల్ని అడ్డుకోవడం లక్ష్యంగా మళ్లీ సుప్రీంకోర్టును తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అధికారుల బృందం ఆశ్రయించింది. దీన్ని ఆసరగా తీసుకున్న కేరళ పాలకులు చాప కింద నీరులా కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ శాఖ అనుమతి దక్కించుకునేందుకు పావులు కదిపే పనిలో పడింది.
జోక్యం చేసుకోరూ : కేంద్రంలో అనుమతి కోసం కేరళ కదుపుతున్న పావులను అడ్డుకునేందుకు సీఎం జయలలిత సిద్ధం అయ్యారు. గురువారం ఉదయం సచివాలయంలో మంత్రులతో సమావేశం అయ్యారు. మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, పళనియప్పన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్ సమావేశానికి హాజరు అయ్యారు. కేరళ ఆగడాలకు కల్లెం వేయడం లక్ష్యంగా ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించే పనిలో పడ్డారు. ఆ మేరకు ప్రధానికి సీఎం జయలలిత లేఖ రాశారు. అందులో ముల్లైపెరియార్ డ్యాం వ్యవహారం గురించి వివరించారు. కేరళ వేస్తున్న ఎత్తులు , చేస్తున్న కుట్రలను విశదీకరించారు. ప్రస్తుతం కొత్త డ్యాం నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతి కోరేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు.
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఇందుకు సంబంధించిన ఫైల్స్ చేరినట్టు, అనుమతి వ్యవహారం పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారాలు వచ్చి ఉన్నాయన్నారు. ముల్లై పెరియార్ డ్యాం వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నదని, ఇప్పటికే పలు తీర్పులు తమిళనాడుకు అనుకూలంగా వచ్చాయని గుర్తు చేశారు. కొత్త డ్యాం నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఇచ్చిన పక్షంలో కోర్టు ధిక్కారం కిందకు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు. ఈ వ్యవహారంలో తమరు జోక్యం చేసుకోవాలని కోరారు. ఎలాంటి అనుమతులను కేరళ సర్కారుకు ఇవ్వ కూడదని, అందుకు తగ్గ ఆదేశాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమిళుల మనో భావాలకు అనుగుణంగా వ్యవహరించాలని వేడుకున్నారు.
జోక్యం చేసుకోండి
Published Fri, Jun 12 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement