సీఎం ఏరియల్ సర్వే
తిరువళ్లూరు: రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి జయలలిత అధికారులతో కలిసి హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత అక్టోబర్ 28 నుంచి భారీ వర్షాలు మెదలైన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు, చెన్నై తదితర జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్‌లు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై నగరాన్ని వ రదలు నిలువునా ముంచెత్తడంతో భారీగా ఏర్పడిన నష్టం ఏర్పడింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది. వాస్తవానికి బుధవారమే ఏరియల్ సర్వే చేయాలని నిర్ణయించినా, వాతావరణం అనుకూలించకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి జయలలిత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. చెన్నై నుంచి ఉదయం 9.30 గంటలకు కొరట్టూరు పురం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి ఈకాడుతాంగెల్, కొలత్తూరు, అడయార్, వేళచ్చేరీ, తిరువొత్తియూర్, ఊరపాక్కం, తాంబరం, ముడిచ్చూర్, మడిపాక్కం, పాపాన్‌సత్రం, సోలింగనల్లూరు, వ్యాసార్‌పాడి తదితర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లాలోనీ సడయన్‌పాక్కం, మడత్తుకుప్పం, రేట్టేరీ, పుళల్, పూండీ, చెమరంబాక్కం, మనలిపుదునగర్ తదితర ప్రాంతాల్లోనూ దాదాపు మూడు గంటల పాటు పర్యటించి సర్వే నిర్వహించారు.
అధికారులతో అత్యవసర సమావేశం : చెన్నై , కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న అధికారులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. వరద భాదితులకు అందుతున్న సహయక చర్యలను అధికారుల నుండి అడి గి తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు, నష్టనివారణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను అదేశించారు. సహయక చర్యల్లో విమర్శలు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారినీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అదేశించారు.
ఇప్పటి వరకు ఏర్పాటు ఏర్పాటు చేసిన శిబిరాల్లో వుంటున్న నిరాశ్రయులకు చాప, బెడ్‌షీట్లను అంద జేయాలని ఆదేశాలు జారీ చేసారు. సహయక చర్యల్లో పాల్గొనండి : వరద బాధితులకు అండగా పార్టీ నేతలు ముందుండాలని ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న వారినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన ఆహారపదార్థాలను అందజేయాలని సూచించారు. చెరువులు, వాగులు వంకలు కొట్టుకు పోతే వాటిని సరిచేయడానికి పార్టీ నేతలు తమ వంతు సహకారాన్ని అందజేయాలని ఆయన సూచించారు.