బాధ్యతలు చేపట్టిన జయ
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 8 నెలల అనంతరం సచివాలయానికి వచ్చిన జయలలితకు అధికార వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. గంటపాటు సెక్రటేరియట్‌లో ఉన్న జయలలిత ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 201 అమ్మ క్యాంటీన్ల(పేదలకు సబ్సిడీ రేట్లకు ఆహారం అందించే స్టాల్)ను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రూ. 1800 కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నగర, గ్రామీణ రోడ్ల అభివృద్ధి, పేదలకు సౌర విద్యుత్ సదుపాయంతో పక్కా ఇళ్ల నిర్మాణం, తాగునీటి పథకం, మహిళల్ని కుటుంబ పెద్దలుగా తీర్చిదిద్దడం.. మొదలైనవి అందులో ఉన్నాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు జయ రావడంతో ఆదివారమైనా సెక్రటేరియట్‌లో సందడి నెలకొంది. జయలలితతో పాటు ఆమె మంత్రివర్గ సహచరులు 28 మంది కూడా బాధ్యతలు స్వీకరించారు.