సచివాలయం, అసెంబ్లీ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికే కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సచివాలయం, అసెంబ్లీ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రానికే కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రభుత్వ పాలనా నిర్వహణకు అవసరమైతే మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీ)ను తాత్కాలికంగా కేటాయించాలని సూచించారు. పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ నివాసంలో శుక్రవారం ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, అంజన్‌కుమార్ యాదవ్ సమావేశమై ఈ మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు లేఖ రాశారు.
స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలే తప్ప ఆప్షన్లు ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడి ఉన్నందున విద్యుత్ కేటాయింపుల్లో ఈ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అంతకుముందు ఆయా నేతలంతా ఎన్నికల పోలింగ్ సరళి, కాంగ్రెస్ గెలుపు అవకాశాలను సమీక్షించారు.