వాట్ యాన్ ఐడియా....
న్యూఢిల్లీ: ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఓ ఐడియా కొంత మంది జీవితాల్లో వెలుగులను ప్రసరిస్తుంది. బీచ్ ఒడ్డున నీటి అలల వంపు తుంపరలు ముఖాన పడుతుంటే కలిగే అనుభూతి, ఆ ఆనందమే వేరు. అలాంటి అనుభూతి రసానుభూతి గల వారంతా అనుభవించగలుగుతున్నారా? వీల్‌చైర్లకే అంకితమైన వికలాంగులకు అలాంటి అవకాశం లేదే! మరి వారెలా ఈ అనుభూతిని ఆస్వాదించాలనే ఆలోచనలో నుంచి ఓ ఐడియా పుట్టుకొచ్చిందీ హెచ్‌ఆర్ కంపెనీకి. సెరామిక్, వెర్టిఫైడ్ టైల్స్ ఉత్పత్తిలో భారత్‌లో ప్రఖ్యాతిగాంచిన ఈ కంపెనీ తన ఐడియాను అమల్లో పెట్టింది. ప్రయోగాత్మకంగా గోవాలోని కిరీ బీచ్‌లో రోడ్డు మీది నుంచి నీటి అలలు తాకే వరకు నాణ్యమైన టైల్స్‌తో ఓ ర్యాంపును నిర్మించింది. వీల్‌చైర్లకు అంకితమైన వారిని వాటిపైనే బీచ్‌లోని అలల వరకు తీసుకెళ్లి వారి అనుభూతులను రికార్డు చేసింది. అంగవికలురు తాము జీవితంలో ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదని చెప్పారు. బుద్ధిమాంద్యులు కూడా ఎంతో థ్రిల్ ఫీలయ్యారు.
తాము కంపెనీ సామాజిక కార్యక్రమంలో భాగంగా ‘రెడ్ ర్యాంప్ ప్రాజెక్ట్’ కింద ఈ ర్యాంపును నిర్మించామని ప్రాజెక్టు ఆపరేటింగ్ చీఫ్ సుశీల్ మాతే తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది అంగవికలురు ఉన్నారని, పర్యాటక స్థలాల్లో వారు విహరించేందుకు దాదాపు ఎలాంటి సౌకర్యాలు లేవని ఆయన తెలిపారు. బీచ్‌ల్లోనే కాకుండా పర్యాటకపరంగా ప్రసిద్ధి చెందిన కొండలు, లోయల ప్రాంతాల్లో ప్రకృతిని ఆస్వాదించేందుకు దారులు లేవన్నారు. అలాంటి చోట్ల, అంగవికలురుకు అనువైన సౌకర్యాలు కల్పించేందుకు తాము కంపెనీ తరఫున సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఎక్కడ, ఎలాంటి సౌకర్యం కావాలన్నా తాము ఏర్పాటు చేస్తామని, అయితే అందుకు అవసరమైన స్థానిక అనుమతులు స్థానికులే తీసుకోవాలని అన్నారు. భారత్‌లో నేడు పర్యాటకరంగం ఎంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అన్ని రకాల వికాలాంగులకు అన్ని పర్యాటక స్థలాల్లో అనువైన సదుపాయాలు కల్పించేందుకు దేశ పర్యాటక రంగం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.