goa beaches
-
గోవాలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఫీజు భారీగా చెల్లించాల్సిందే
గోవా తీరంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి ఇది చేదువార్త. గోవా కోస్టల్ జోన్ మేనేజిమెంట్(జీసీజెడ్ఎంఏ) ఇక్కడ నిర్వహించుకునే పెళ్లిళ్లకు సంబంధించిన దరఖాస్తు రుసుమును రెండింతలు చేసింది. దీంతో ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకునేవారు దరఖాస్తుతోపాటు లక్ష రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే వారికి అనుమతి లభిస్తుంది. గతంలో అంటే 2020 ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించిన ఫీజును పెంచారు. అప్పటి వరకూ రూ.10 వేలు ఉన్న రుసుమును రూ. 50 వేలకు పెంచారు. కాగా నూతన నిబంధనల ప్రకారం పెళ్లి వేడుకలను గరిష్టంగా ఐదు రోజులు నిర్వహించుకునేందుకు అనుమతి కోసం లక్ష రూపాయలు చెల్లించాల్సివుంటుంది. అలాగే ప్రతీరోజూ పార్టీల నిర్వహణకు రూ. 10 వేలు చెల్లించాల్సివుంటుంది. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా ఇతర కార్యక్రమాల నిర్వహణకు కూడా నదీ తీరాన్ని అద్దెకు తీసుకోవచ్చు. జీసీజెడ్ఎంఏ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రతీ ఏడాదీ తమకు వేసవి, చలికాలాల్లో పెళ్లిళ్ల నిర్వహణకు సంబంధించిన దరఖాస్తులు వస్తాయన్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించడం తమకు భారంగా మారిందన్నారు. దరఖాస్తులలో చాలామంది వెయ్యిమంది అతిథులకు 800 చదరపు మీటర్ల తీరం కావాలని కోరుతుంటారని, ఇందుకోసం అనుమతివ్వాలని అడుగుతుంటారని తెలిపారు. ఇదేవిధంగా డిసెంబరు, జనవరి నెలల్లో పార్టీలు, వివాహాలు చేసుకునేందుకు దరఖాస్తులు వస్తాయన్నారు. ఈ సమయంలోనే చాలామంది ఇక్కడ వేడుకలు చేసుకునేందుకు మొగ్గు చూపుతుంటారన్నారు. ఈ పార్టీలు ముఖ్యంగా సముద్రతీరంలోని హోటళ్ల సమీపంలో జరుగుతుంటాయన్నారు. ఈ నేపధ్యంలోనే తీరంలోని హోటళ్లు అత్యధికంగా బుక్ అవుతుంటాయని తెలిపారు. -
New Rules In Goa: గోవాలో ఈ పనులు చేస్తే భారీగా జరిమానా
పనాజీ: గోవా వెళ్లి స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. గోవాలో పర్యటకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, టూరిస్టు ప్రాంతాలు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఓ వ్యక్తి, కంపెనీ, సంఘం, సంస్థ ఏదైనా నిబంధనలు ఉల్లఘిస్తే రూ.5000 జరిమానా విధిస్తాం. ఆ ఫైన్ రూ.50,000 వరకు సైతం ఉండవచ్చు. ఐపీసీలోని సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి.’ అని గవర్నమెంట్ ఆర్డర్లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బీచ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో వంట చేయటం, డ్రైవింగ్ వంటివి నిషేదం. బీచ్‌లో చెత్త పారవేయటం, మద్యం బాటిళ్లను పగలగొడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కొద్ద నిబంధనలు ఇలా.. ► ఇకపై బీచ్‌లో డ్రైవింగ్ చేయకూడదు. బహిరంగ ప్రదేశంలో వంట వండటం నిషేదం. ► బీచ్‌లో చెత్త వేయటం, తాగి పడేసే బాటిళ్లను పగలగొట్టటం నేరం. ► టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపారస్తులకు సైతం కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ► వాటర్ స్పోర్ట్స్ కేవలం గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే నిర్వహించాలి. ► టికెట్ల జారీ గుర్తింపు పొందిన కౌంటర్ల వద్దే నిర్వహించాలి. బహిరంగంగా టికెట్లు జారీ చేయకూడదు. ► తోపుడి బండిపై వ్యాపారం చేసే వారు పర్యటకులకు అడ్డుపడితే జరిమానా పడుతుంది. ► ఎవరైనా టూరిస్టులను డబ్బులు అడగడం, అల్లర్లు సృష్టించటం చేస్తే చర్యలు తప్పవు. ► నిబంధనలను అతిక్రమించిన వారికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు. ఇదీ చదవండి: పీఎంగా రిషి సునాక్ తొలిసారి బిగ్ యూ-టర్న్.. ఆ నిర్ణయంలో మార్పు -
లైఫ్ గార్డ్స్..: ఫియర్లెస్ ఫైవ్...
అందరికీ ‘బేవాచ్’ టి.వి. సిరీస్ తెలుసు. కాలిఫోర్నియా బీచ్‌లలో ప్రమాదంలో పడే పర్యాటకులను కాపాడే లైఫ్‌గార్డ్స్ కథలు అవి. మన దగ్గర కూడా తీర ప్రాంతాల్లో లైఫ్‌గార్డ్స్ ఉన్నారు. కాని వారంతా మగవారు. మొదటిసారి గోవాలో ఐదుగురు మహిళా లైఫ్‌గార్డ్స్ చార్జ్ తీసుకున్నారు. టెన్ టు ఫైవ్ ఉద్యోగాలు బోర్ అని పర్యాటకులను కాపాడటంలో మజా ఉంటుందని వారు అంటారు. తీరంలో చిరుతల్లా తిరుగుతూ నీళ్లల్లో చేపల్లా దుమికే వీరిని చూసి తీరాలు చప్పట్లు కొడుతున్నాయి. కొత్త రక్షకులు వచ్చారన్న ధైర్యంతో కెరటాలతో ఆటలాడుతున్నాయి. ఎగిసిపడే కెరటాలతో ఆకర్షించడం సముద్రం వంతు. కొత్త ప్రాంతానికి వచ్చామన్న ఉత్సాహంతో ఉరికురికి దూకడం పర్యాటకుల వంతు. సముద్రం మనకు ముద్దొచ్చినా సముద్రానికి మనం ముద్దొచ్చినా మనకే ప్రమాదం. పైకి కనిపించే కెరటాలు వేరు. లోపల లాగే కరెంట్స్ వేరు. నీళ్లు కప్పిన నేల కింద గుంతలు ఉండొచ్చు. లోతులు ఉండొచ్చు. ఊహించని ప్రమాదం జరిగి మునిగిపోతుంటే కాపాడేదెవరు? ఇదిగో ఈ లైఫ్గార్డ్సే సముద్రానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించేవారి వార్తలు మన తీర ప్రాంతాల నుంచి కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే కేవలం పర్యాటకమే ఆధారంగా ఉండే గోవా వంటి చోట అలాంటి వార్తలు తరచూ వస్తే పర్యాటక రంగమే కుంటు పడుతుంది. జనం భయపడి రారు. అందుకే తీరం వెంట లైఫ్‌గార్డ్స్ ఏర్పాటు చేసింది గోవా టూరిజం శాఖ ‘దృష్టి మెరైన్’ అనే విభాగం ద్వారా. ఈ విభాగం మెరికల్లాంటి ఈతగాళ్లను ఉద్యోగంలో తీసుకుని తీరం వెంట వారిని గస్తీ తిప్పుతూ ఉంటుంది. అయితే ఇదే విభాగం గత కొన్నాళ్లు స్త్రీలను ఈ రంగంలో ప్రోత్సహించేందుకు ప్రకటనలు ఇస్తోంది. మగవారు పాల్గొనే ఈ రిస్కీ జాబ్‌లో స్త్రీలు ఇన్నాళ్లకు ముందుకు వచ్చారు. వారిలో ఐదుగురితో ‘మహిళా లైఫ్‌గార్డ్స్’ దళం ఏర్పాటయ్యింది. ఇంతకూ వారెవరు? సాహసమే జీవితం ఈ ఐదు మందిలో శ్రియ కరేకర్ చిన్నది. వయసు 21. ‘నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు సముద్రంలో ఆటలాడుతూ మునిగిపోబోయాను. దెబ్బకు భయపడి మా అమ్మ నన్ను ఈతలో పడేసింది. చిన్న వయసులోనే బాగా నేర్చుకున్నాను. మా అన్న పర్యాటకులను కాపాడే లైఫ్‌గార్డ్‌గా మారాక నాకూ ఈ రంగంలోకి రావాలనిపించింది. దానికి కారణం వాడిలా నాకూ జెట్ స్కీ(వాటర్ బైక్) నడపాలని ఉండటమే. ఇన్నాళ్లకు నా కల నెర వేరింది’ అంటుంది శ్రియ. ఇంతకు ముందు ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేసేది. అలాగే స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా. ఇప్పుడు ఆమెకు నిజమైన సంతోషం ఇస్తున్నది ఈ లైఫ్‌గార్డ్ పనే. ఇదే టీమ్‌లో ఉన్న 26 ఏళ్ల అనన్య బాత్ ఇలాంటి ఉద్యోగం ఉందని తెలిసి హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది. ‘అక్కడ నేను రెస్టరెంట్ మేనేజర్‌గా పని చేసేదాన్ని. బోర్ కొట్టింది’ అంటుందామె. లైఫ్‌గార్డ్ కావాలంటే కఠినమైన శిక్షణ ఉంటుంది. మునిగిపోతున్నవారిని రక్షించడమే కాదు, బీచ్‌లో జనాన్ని అదుపు చేయడం కూడా వీరి పనే. ఇక ఈ ఐదుగురి టీమ్‌లో అందరికంటే ఎక్కువ వయసు ఉన్న మహిళ చార్మిన్ డిసూజా. ఆమె వయసు 45. ‘నేను పుట్టిన ఆరునెలలకే కాళ్లు సరిగా ఎదగలేదని మా తల్లిదండ్రులు నీటితొట్టెలో ఈత మొదలు పెట్టించారు. ఈత మంచినీళ్ల ప్రాయం నాకు. బేవాచ్ చూస్తూ పెరిగినదాన్ని. కాలిఫోర్నియా వెళ్లి అక్కడి బీచ్‌లలో పని చేయాలని కూడా అనుకున్నాను. కుదర్లేదు’ అంటుంది చార్మిన్. గోవా లైఫ్‌గార్డ్స్‌గా పని చేసేవారి వయసు స్త్రీలైనా పురుషులైనా 30. కాని చార్మిన్ ఈత లాఘవం చూసి ఈ నియమంలో వెసులుబాటు ఇచ్చారు. 27 ఏళ్ల హర్హా నాయక్ కూడా జీవితంలో ఏదైనా థ్రిల్ ఉండాలని ఈ ఉద్యోగాన్ని ఎంచుకుంది. 24 ఏళ్ల పూజా బుడే మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ ఉద్యోగంలో చేరింది. ఇలా భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఐదుగురు ఇప్పుడు ఒక టీమ్‌గా గోవా బీచ్‌లలో గస్తీ తిరుగుతున్నారు. పెళ్లి కాదని... వద్దన్నారు అయితే వీరు ఈ పని ఎంచుకోవడంలో వ్యతిరేకత లేదని కాదు. బంధువులు అభ్యంతరం చెప్పారు. ‘ఈ ఉద్యోగంలో సముద్రం దగ్గర ఎండలో తిరగాలి. చర్మం నల్లబడుతుంది. ఎవరు చేసుకుంటారు పెళ్లి’ అని ఈ వీరిలోని ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు బంధువులు హితవు చెప్పారు. ఒక కుటుంబంలో అన్న ఈ పని వద్దంటే మరో కుటుంబంలో తండ్రి వద్దన్నాడు. అయినా వీరు ‘మా ఇష్టం. మాకు ఈ పనే ఇష్టం’ అని లైఫ్‌గార్డ్స్‌గా మారారు. పిక్నిక్లకు వెళ్లినప్పుడు మగవాళ్ల బట్టలు, చెప్పులు కాపలా కాస్తూ ఒడ్డున కూచునే గృహిణులనే చూసిన ఈ సమాజం ధైర్యంగా సముద్రం మీదకు లంఘించే ఈ అపర జలవనితలను చూసి సంతోషించక తప్పదు. శహబాష్ అనకా తప్పదు. -
గోవా బీచ్‌లో మందేస్తే అంతే!
పనాజీ : గోవా బీచ్‌లో బీరు తాగుతూ ఎంజాయ్ చేయలనుకుంటున్నారా? అయితే మీరు రూ. 2 వేల రూపాయల జరిమానా లేక మూడు నెలలు జైలు శిక్ష అనుభవించడానికి సిద్దంగా ఉండాలి. అదేంటి బీచ్‌లో బీరు తాగితే ఇంత శిక్షా? అని అంటారా? అవును గోవా ప్రభుత్వం పర్యాటక చట్టంలో మార్పులు తీసుకురాబోతుంది. బీచ్‌లో మద్యం తాగినా, బహిరంగంగా వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోవాలో కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా బీచ్ లో మద్యం తాగినా, వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా మంత్రివర్గ సమావేశం తీర్మానించిందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్ గోంకర్ వెల్లడించారు. జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని మంత్రి పేర్కొన్నారు. ‘ పర్యాటక చట్టంలో మేం రెండు మార్పులు తీసుకొచ్చాం. పర్యాటకశాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే హోటల్ బుకింగ్ చేసుకునేలా నిబంధనను తీసుకొచ్చాం. ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయి. చాలా ట్రావెల్స్ కంపెనీలు పర్యాటకశాఖతో సంబంధం లేకుండా హోటల్స్‌ను బుక్ చేస్తున్నాయి. ఈ తరహా చట్ట వ్యతిరేక పనులను మేం సహించం. ఇక రెండోది.. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్‌లో మద్యం సేవించినా, వంట చేసినా రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందే. లేకుంటే మూడు నెలలు జైలు శిక్షఅనుభవించాలి.’ అని పర్యాటక మంత్రి తెలిపారు. బీచ్‌ల్లో బహిరంగంగా మద్యనిషేధం విధిస్తామని ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. -
వాట్ యాన్ ఐడియా....
న్యూఢిల్లీ: ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఓ ఐడియా కొంత మంది జీవితాల్లో వెలుగులను ప్రసరిస్తుంది. బీచ్ ఒడ్డున నీటి అలల వంపు తుంపరలు ముఖాన పడుతుంటే కలిగే అనుభూతి, ఆ ఆనందమే వేరు. అలాంటి అనుభూతి రసానుభూతి గల వారంతా అనుభవించగలుగుతున్నారా? వీల్చైర్లకే అంకితమైన వికలాంగులకు అలాంటి అవకాశం లేదే! మరి వారెలా ఈ అనుభూతిని ఆస్వాదించాలనే ఆలోచనలో నుంచి ఓ ఐడియా పుట్టుకొచ్చిందీ హెచ్ఆర్ కంపెనీకి. సెరామిక్, వెర్టిఫైడ్ టైల్స్ ఉత్పత్తిలో భారత్‌లో ప్రఖ్యాతిగాంచిన ఈ కంపెనీ తన ఐడియాను అమల్లో పెట్టింది. ప్రయోగాత్మకంగా గోవాలోని కిరీ బీచ్‌లో రోడ్డు మీది నుంచి నీటి అలలు తాకే వరకు నాణ్యమైన టైల్స్‌తో ఓ ర్యాంపును నిర్మించింది. వీల్చైర్లకు అంకితమైన వారిని వాటిపైనే బీచ్‌లోని అలల వరకు తీసుకెళ్లి వారి అనుభూతులను రికార్డు చేసింది. అంగవికలురు తాము జీవితంలో ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదని చెప్పారు. బుద్ధిమాంద్యులు కూడా ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. తాము కంపెనీ సామాజిక కార్యక్రమంలో భాగంగా ‘రెడ్ ర్యాంప్ ప్రాజెక్ట్’ కింద ఈ ర్యాంపును నిర్మించామని ప్రాజెక్టు ఆపరేటింగ్ చీఫ్ సుశీల్ మాతే తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది అంగవికలురు ఉన్నారని, పర్యాటక స్థలాల్లో వారు విహరించేందుకు దాదాపు ఎలాంటి సౌకర్యాలు లేవని ఆయన తెలిపారు. బీచ్‌ల్లోనే కాకుండా పర్యాటకపరంగా ప్రసిద్ధి చెందిన కొండలు, లోయల ప్రాంతాల్లో ప్రకృతిని ఆస్వాదించేందుకు దారులు లేవన్నారు. అలాంటి చోట్ల, అంగవికలురుకు అనువైన సౌకర్యాలు కల్పించేందుకు తాము కంపెనీ తరఫున సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఎక్కడ, ఎలాంటి సౌకర్యం కావాలన్నా తాము ఏర్పాటు చేస్తామని, అయితే అందుకు అవసరమైన స్థానిక అనుమతులు స్థానికులే తీసుకోవాలని అన్నారు. భారత్‌లో నేడు పర్యాటకరంగం ఎంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అన్ని రకాల వికాలాంగులకు అన్ని పర్యాటక స్థలాల్లో అనువైన సదుపాయాలు కల్పించేందుకు దేశ పర్యాటక రంగం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. -
గోవా ఘువుఘువులు
గోవా బీచ్‌లు ఎంత ప్రత్యేకమో... అక్కడి ఆహారానికీ అంతే ప్రత్యేకత. నగరవాసులకు ఆ రుచులను అందించేందుకు బంజారాహిల్స్ హోటల్ తాజ్ బంజారాలోని వెస్ట్‌సైడ్ కెఫేలో గురువారం గోవా ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ‘హైదరాబాదీలకు బిర్యానీ రుచి తెలుసు. ఇప్పుడు విభిన్నమైన గోవా వంటకాలను వడ్డిస్తున్నాం. ఇవి నోరూరించక తప్పవు. రోస్ట్ చేసిన తాజా కొబ్బరి, స్పైసెస్, దినుసులతో పాటు రెడ్ కాశ్మీరీ చిల్లీస్ వాడటం వల్ల కాస్త ఘాటు ఎక్కువగా ఉంటుంది. గోవా ఫిష్ కర్రీ స్పెషల్. ఇంకా వుటన్ వుసాలా, గలిన్హా కఫ్రెల్, గోవా దాల్ వుసాలా విత్ స్పినాచ్, ప్రాన్స్ బల్చావో, చికెన్, డోడల్ వంటివెన్నో ఐటమ్స్ ఇక్కడ వేడివేడిగా వడ్డిస్తున్నాం’ అని చెప్పారు గోవా చెఫ్‌లు డొమింగ్స్ బోర్జెస్, మిక్కీకువూర్. ఈ నెల 25 వరకు మీరూ ఈ రుచులు ఆస్వాదించవచ్చు. - ఆడెపు శ్రీనాథ్ -
గోవాలో బీచ్ పార్టీల జోష్
మామూలుగానే గోవా అంటే పట్టుకోలేం. అలాంటిది న్యూ ఇయర్ అంటే ఇంక అసలు ఊరుకుంటారా? కొత్త సంవత్సరం సంబరాలతో గోవాలోని బీచ్‌లన్నీ దద్దరిల్లాయి. సముద్ర తీరాల్లో ఇసుక ఇంతెత్తున లేచింది. లక్షలాది మంది జనం అక్కడకు చేరుకుని బీచ్ పార్టీలతో రాత్రంతా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశారు. చర్చిల్లో కూడా అర్ధరాత్రి ప్రార్థనలు జరిగాయి. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని బీచ్‌లలోనూ ఎక్కడ చూసినా కింద ఇసుక కనిపించనంతగా జనం చేరారు. బుధవారం తెల్లవారుజాము వరకు కూడా ఈ సందడి కనిపించింది. బాణాసంచా కాల్పులతో తీరప్రాంతాలు జిగేల్ జిగేల్మన్నాయి. కొత్త సంవత్సరం వేడుకల కోసమే దాదాపు మూడు లక్షల మందికి పైగా పర్యాటకులు రాష్ట్రానికి వచ్చారని పర్యాటక శాఖ చెబుతోంది. శతాబ్దాల నాటి నాకియోనల్ క్లబ్బులాంటి చోట్ల డాన్స్ పార్టీలు నిర్వహించారు. ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కూడా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.