గోవా తీరంలో పెళ్లి చేసుకోవాలనుకునేవారికి ఇది చేదువార్త. గోవా కోస్టల్ జోన్ మేనేజిమెంట్(జీసీజెడ్‌ఎంఏ) ఇక్కడ నిర్వహించుకునే పెళ్లిళ్లకు సంబంధించిన దరఖాస్తు రుసుమును రెండింతలు చేసింది. దీంతో ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకునేవారు దరఖాస్తుతోపాటు లక్ష రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే వారికి అనుమతి లభిస్తుంది. గతంలో అంటే 2020 ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించిన ఫీజును పెంచారు. అప్పటి వరకూ రూ.10 వేలు ఉన్న రుసుమును రూ. 50 వేలకు పెంచారు.
కాగా నూతన నిబంధనల ప్రకారం పెళ్లి వేడుకలను గరిష్టంగా ఐదు రోజులు నిర్వహించుకునేందుకు అనుమతి కోసం లక్ష రూపాయలు చెల్లించాల్సివుంటుంది. అలాగే ప్రతీరోజూ పార్టీల నిర్వహణకు రూ. 10 వేలు చెల్లించాల్సివుంటుంది. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా ఇతర కార్యక్రమాల నిర్వహణకు కూడా నదీ తీరాన్ని అద్దెకు తీసుకోవచ్చు. జీసీజెడ్‌ఎంఏ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రతీ ఏడాదీ తమకు వేసవి, చలికాలాల్లో పెళ్లిళ్ల నిర్వహణకు సంబంధించిన దరఖాస్తులు వస్తాయన్నారు.
ఈ దరఖాస్తులను పరిశీలించడం తమకు భారంగా మారిందన్నారు. దరఖాస్తులలో చాలామంది వెయ్యిమంది అతిథులకు 800 చదరపు మీటర్ల తీరం కావాలని కోరుతుంటారని, ఇందుకోసం అనుమతివ్వాలని అడుగుతుంటారని తెలిపారు. ఇదేవిధంగా డిసెంబరు, జనవరి నెలల్లో పార్టీలు, వివాహాలు చేసుకునేందుకు దరఖాస్తులు వస్తాయన్నారు.
ఈ సమయంలోనే చాలామంది ఇక్కడ వేడుకలు చేసుకునేందుకు మొగ్గు చూపుతుంటారన్నారు. ఈ పార్టీలు ముఖ్యంగా సముద్రతీరంలోని హోటళ్ల సమీపంలో జరుగుతుంటాయన్నారు. ఈ నేపధ్యంలోనే తీరంలోని హోటళ్లు అత్యధికంగా బుక్ అవుతుంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment