ఆ మహిళకు హైకోర్టు క్షమాపణ
చెన్నై: న్యాయం కోసం 24 ఏళ్లు వేచిచూసిన మహిళను మద్రాస్ హైకోర్ట్ ఎలాంటి బేషజాలకు పోకుండా క్షమాపణలు వేడుకుంది. 1993లో మరణించిన తన కుమారుడి పరిహారం కోసం అప్పటినుంచి ఆమె అలుపెరుగని న్యాయపోరాటం సాగిస్తున్నది. 1993 మేలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆమె కుమారుడు లోకేశ్వరం లారీ నడుపుతుండగా ఎదురుగా వస్తున్నరాష్ర్ట రవాణా సంస్థ బస్ను ఢీ కొనడంతో మరణించాడు. దీనిపై ఆమె మోటార్ వాహన చట్టం కింద పరిహారం కోరకుండా వర్క్మెన్స్ పరిహార చట్టం కింద క్లెయిమ్ చేయడంతో సదరు క్లెయిమ్ను అధికారులు నిరాకరించారు. ఈ చట్టం కేవలం పారిశ్రామిక ప్రమాదాలకే వర్తిస్తుంది.
దీంతో బాధితురాలు మోటార్ యాక్సిటెండ్స్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ను రూ 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆశ్రయించారు. అయితే ఆమె తొలుత వర్క్మెన్స్ పరిహార చట్టం కింద దరఖాస్తు చేసినందున, తిరిగి మోటార్ యాక్ట్ కింద పరిహారం చెల్లించలేమని లారీకి బీమా వర్తింపచేసిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ చేతులెత్తేసింది. కంపెనీ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్ రూ 3.47 లక్షల పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అప్పీల్ను తోసిపుచ్చిన కోర్టు బాధిత మహిళకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది.