
ఇక రంగంలోకి రిలయన్స్ హోం ఫైనాన్స్
రిలయన్స్ క్యాపిటల్ అధినేత అనిల్ అంబానీ వ్యాపార విస్తరణలో జోరు పెంచినట్టు కనిపిస్తోంది. ఒకవైపు కీలకమైన ఎయిర్ సెల్ తో ఒప్పందాన్ని ఖాయం చేసుకుంటూనే మరోవైపు మరో సరికొత్త కంపెనీతో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
49 శాతం ఈక్విటీ తో 'రిలయన్స్ హోం ఫైనాన్స్' అనే సంస్థను మార్కెట్ లో లిస్ట్ చేయనున్నారు. రిలయన్స్ కేపిటల్ కి సంబంధించిన హౌసింగ్ ఫైనాన్స్ ను విడిగా స్టాక్ ఎక్స్ఛేంజ్ లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు రిలయన్స్ ప్రకటించింది. ఇందులో 49శాతం షేర్లు హోమ్ లోన్ కంపెనీకి చెందిన సుమారు పదిలక్షల షేర్ హోల్డర్లకే ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. అంటే రిలయన్స్ క్యాపిటల్ షేరున్న ప్రతీ ఖాతాదారుడికి ఒక హౌసింగ్ ఫైనాన్స్ షేరును ఎలాట్ చేయనుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపినట్లు కంపెనీ తెలిపింది.
రిలయన్స్ క్యాపిటల్ లో 100 శాతం అనుబంధ సంస్థగా రిలయన్స్ హోం ఫైనాన్స్ హోం లోన్, ప్రాపర్టీలోన్, కనస్ట్రక్షన్ ఫైనాన్స్ , చవకైన గృహ రుణాలు లాంటిరుణ సేవల్లో విస్తృత పరిధిలో తన సేవలను అందించనుంది. 2016 జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ.8,259 కోట్ల ఎస్సెట్ మ్యానేజ్ మెంట్, రూ. 7,750 కోట్ల అవుట్ స్టాండింగ్ లోన్ బుక్, ఒక శాతం ఎన్పీఏ రేషియోను రిపోర్ట్ చేసింది
కాగా మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ జీవిత, సాధారణ బీమా, ఆస్తుల నిర్వహణ, మ్యూచువల్ ఫండ్, కన్స్యూమర్ ఫైనాన్స్ తదితర వివిధ ఆర్థిక సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలతో . రిలయన్స్ క్యాపిటల్ షేర్లు పదిశాతానికిపై ఎగిసి 52 వారాల కనిష్టాన్ని తాకింది. చివరికి రూ 8.68 శాతం లాభపడి 580 దగ్గర ముగిసింది.