మూడేళ్లలో రిలయన్స్ లాభం 50% అప్!
న్యూఢిల్లీ: రిఫైనరీ, పెట్రోకెమికల్స్ వ్యాపార కార్యకలాపాల విస్తరణపై ప్రతిపాదిత 15.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో రాబోయే మూడేళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలు (పన్నులకు ముందు) 50 శాతం మేర పెరగగలవని రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక అధ్యయన పత్రంలో అంచనా వేసింది. చమురు..గ్యాస్ ఉత్పత్తి తగ్గడం, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో తీవ్ర హెచ్చుతగ్గుల కారణంగా రిలయన్స్ (ఆర్‌ఐఎల్) లాభాలు గ త అయిదేళ్లుగా స్తబ్దుగా ఉండిపోయాయని పేర్కొంది. అయితే, 2013-18 మధ్య కాలంలో ఆర్‌ఐఎల్ 40 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండటం, ఇందులో 15.5 బిలియన్ డాలర్లు రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ రంగాల్లో నాలుగు కీలకమైన విభాగాలపై పెట్టుబడులు పెట్టనుండటం కంపెనీ లాభాలకు దోహదపడగలవని పేర్కొంది. టెలికం ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తి కావడం, కొత్తగా పెట్రోల్ బంకులను పునఃప్రారంభిస్తుండటం, రిటైల్ వ్యాపారం లాభాల్లోకి మళ్లుతుండటం వంటివి ఆర్‌ఐఎల్‌కు సానుకూల అంశాలని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.