సహారాకు కాస్త ఊరట.. | relief to sahara | Sakshi
Sakshi News home page

సహారాకు కాస్త ఊరట..

Published Tue, Mar 24 2015 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

సహారాకు కాస్త ఊరట..

సహారాకు కాస్త ఊరట..

బెయిల్ నిధుల సమీకరణకు మరో 3 నెలల గడువు
న్యూఢిల్లీ: డిపాజిటర్లకు నిధుల చెల్లింపు కేసులో సహారా గ్రూప్‌నకు కాస్త ఊరట లభించింది. గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ బెయిల్ కోసం అవసరమైన రూ. 10,000 కోట్ల సమీకరణకు సుప్రీం కోర్టు మరో 3 నెలల గడువునిచ్చింది. ఈలోగా విదేశాల్లో ఉన్న ప్రాపర్టీల విక్రయానికి సంబంధించిన చర్చలు పూర్తి చేసుకోవాలని సోమవారం సూచించింది. లేని పక్షంలో కోర్టు రిసీవరును నియమించి వీటిని వేలం వేయాల్సి వస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది.

కొనుగోలుదారులతో చర్చల కోసం తీహార్ జైలు కాంప్లెక్స్‌లోని కాన్ఫరెన్స్ రూమ్‌ను సుబ్రతా రాయ్ ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తూ గతేడాది ఆగస్టు 1న ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. బెయిల్ నిధుల సమీకరణ కోసం సహారా గ్రూప్ ప్రతిపాదించిన ప్రణాళికపై ఒకింత సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. అవసరమైతే దేశీయంగా 10 ప్రాపర్టీలను కూడా విక్రయించుకునేందుకు అనుమతినిచ్చింది. అప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు సమకూరకపోతే యాంబీ వ్యాలీ ప్రాపర్టీలో కొంత భాగం అమ్మకానికి అనుమతి ఇచ్చింది.
 
డిపాజిటర్లకు నిధులు వాపసు చేయాల్సిన కేసులో సుబ్రతా రాయ్ ఏడాది కాలంగా తీహార్ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ కోసం రూ. 10,000 కోట్లు (రూ. 5,000 కోట్లు నగదు రూపంలో, మిగతాది బ్యాంక్ గ్యారంటీ రూపంలో) కట్టాల్సి ఉంది. ఈ నిధుల కోసమే లండన్‌లోని గ్రాస్‌వీనర్ హౌస్, న్యూయార్క్‌లోని డ్రీమ్ డౌన్‌టౌన్, ది ప్లాజా హోటల్స్‌ను సహారా గ్రూప్ విక్రయించే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా హాంకాంగ్‌కు చెందిన నువామ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ ఈ నిధుల సమీకరణ యత్నాల్లో తోడ్పడుతున్నట్లు సహారా గ్రూప్ అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది.
 
30 వేల కోట్లు ఎలా తెస్తారో చెప్పండి..
బెయిల్‌కి అవసరమైన రూ. 10,000 కోట్లను సమకూర్చుకునేందుకే సతమతమవుతున్న సుబ్రతా రాయ్.. విడుదలైన తర్వాత డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ. 30,000 కోట్లను ఏ విధంగా తేగలరంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి కూడా నిధుల సమీకరణ ప్రణాళిక ఇవ్వాలంటూ సహారా గ్రూప్ తరఫు నాయవాది కపిల్ సిబల్‌కు సూచించింది. అయితే, ముందుగా బెయిల్ అడ్డంకిని అధిగమించిన తర్వాత దాని గురించీ తెలియజేయగలమని సిబల్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement