పాకిస్థాన్‌కు వెంకయ్య ఘాటు వార్నింగ్!
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పొరుగుదేశం పాకిస్థాన్ 1971 యుద్ధంలో ఏం జరిగిందో ఓ సారి గుర్తుకుతెచ్చుకోవాలని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి.. దానికి సాయం చేసినంతమాత్రాన పాక్‌కు ఒనగూరేది ఏమీ ఉండదని అన్నారు. దేశ రాజధానిలో ఆదివారం నిర్వహించిన 'కార్గిల్ పరాక్రమ పరేడ్'లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఉగ్రవాదం మానవత్వానికి శత్రువు. దానికి ఏ మతం లేదు. కానీ పాకిస్థాన్ తన ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని మార్చుకుంది' అని ఆయన మండిపడ్డారు. 1971 యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోరంగా చిత్తయిన విషయాన్ని మరిచిపోవద్దని ఆయన సూచించారు. కశ్మీర్ భారత్‌లో సమగ్ర భాగమని, అందులోని ఒక ఇంచు భూభాగాన్ని కూడా వదలుకునే ప్రసక్తి లేదని వెంకయ్య స్పష్టం చేశారు.