‘80:20’ పసిడి దిగుమతులు కఠినం
న్యూఢిల్లీ: దేశంలోకి 80:20 పథకం కింద బంగారం దిగుమతుల నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ మరింత కఠినతరం చేసింది. వివరాల్లోకి వెళితే... కరెంట్ అకౌంట్ కట్టడిలో భాగంగా బంగారం దిగుమతులపై ఆంక్షల దిశలో ప్రభుత్వం 2013 ఆగస్టులో ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం నామినేటెడ్ సంస్థలు అంతకుముందు దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని ఎగుమతి చేసే వరకూ కొత్త దిగుమతులను అనుమతించరు.
80:20 స్కీమ్‌గా ఇది బులియన్ వర్గాల్లో ప్రసిద్ధమైంది. తాజా నిబంధనల ప్రకారం ఈ స్కీమ్ కింద తొలి రెండు విడతల్లో దిగుమతి చేసుకున్న పరిమాణం కన్నా మూడవ విడత నుంచీ తక్కువ దిగుమతులు చేసుకోవాలి. కంపెనీ తాను ఎగుమతి చేసిన పరిమాణం క న్నా అయిదు రెట్లు అధికంగా దిగుమతి చేసుకోవచ్చు. అదీ తగిన ఆధారాలన్నీ చూపిన తర్వాత మాత్రమే. అయితే, ఇది సంబంధిత సంస్థలకు అనుమతించిన మొత్తం దిగుమతుల పరిమితిని మించకూడదు. ప్రత్యేక ఆర్థిక జోన్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, ప్రీమియర్, స్టార్ ట్రేడింగ్ హౌస్‌లకు 80:20 నిబంధన వర్తించదు.
టారిఫ్ పెంపు..
కాగా, బంగారం వెండిపై ప్రభుత్వం శుక్రవారం దిగుమతి టారిఫ్ విలువను పెంచింది. బంగారం విషయంలో 10 గ్రాములకు విలువను 404 డాలర్ల నుంచి 421 డాలర్లకు పెంచింది. వెండి విషయంలో ఈ రేటు కేజీకి 635 డాలర్ల నుంచి 663 డాలర్లకు పెరిగింది. దేశంలో పారదర్శక రీతిలో విలువైన మెటల్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని విధించడానికి ఈ టారిఫ్ విలువలు ప్రాతిపదికగా ఉంటాయి. సహజంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఈ విలువలు మారుతుంటాయి.