సంపన్నులకు ప్రత్యేకం..!
శ్రీమంతుల కోసం ప్రత్యేక పాలసీలు రూపొందిస్తున్న బీమా కంపెనీలు..
దేశీయంగా సంపన్నుల (హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య పెరుగుతుండటంతో వారి బీమా అవసరాలపై ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. వారి అవసరాలకు తగ్గ బీమా పాలసీల్ని తయారు చేసి అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం బీమా కంపెనీల మొత్తం పాలసీదారుల్లో సంపన్నుల వాటా ఆరు నుంచి పది శాతం దాకా ఉంటుందని అంచనా. అయితేనేం.. సాధారణ పాలసీదారుతో పోలిస్తే సంపన్న పాలసీదారు నుంచి వచ్చే ప్రీమియం 20-30 శాతం అధికంగా ఉంటోంది. అందుకే హెచ్‌ఎన్‌ఐలకు ప్రాధాన్యమిస్తూ బ్యాంకులు ప్రత్యేక బ్యాంకింగ్ సర్వీసులు అందిస్తున్నట్లే బీమా కంపెనీలు కూడా గోల్డ్, ప్లాటినం వంటి పేర్లతో ప్రత్యేక పాలసీలు అందిస్తున్నాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. హెచ్‌ఎన్‌ఐల కోసమే ప్రత్యేకంగా హెల్త్ సురక్ష గోల్డ్, ప్లాటినం పాలసీలను అందిస్తోంది. వీటిలో మెటర్నిటీ, డెంటల్, కళ్లద్దాలు, హియరింగ్ ఎయిడ్స్, కాంటాక్ట్ లెన్సులు మొదలైన వాటికి కూడా అదనపు కవరేజీ ఉంటుంది. అలాగే, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే.. రూ. 1,00,000 పైచిలుకు వార్షిక ప్రీమియం కట్టే వారిని ఈ సంస్థ గోల్డ్ సర్కిల్ కేటగిరీ కింద చేరుస్తుంది. వీరికి ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఎస్‌ఎంఎస్ చేసిన రెండు గంటల్లోనే సదరు పాలసీదారును కంపెనీ ప్రతినిధి సంప్రదిస్తారు. సాధారణ హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి నిమిషాల కొద్దీ వేచి చూడాల్సిన పని లేకుండా 20 సెకన్ల లోపే స్పందించే రిలేషన్‌షిప్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంటాయి. వీరికి కంపెనీ ఈ-మ్యాగజైన్‌తో పాటు ఇంటి దగ్గరే చెక్ పికప్ సదుపాయమూ ఉంటుంది. మ్యాక్స్ లైఫ్ మొత్తం పాలసీదారులలో ఇలాంటి సంపన్నుల సంఖ్య దాదాపు 24 శాతం ఉంది.
ప్లాటినం కవరేజీ..: మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ సిల్వర్, గోల్డ్, ప్లాటినం పేరుతో మూడు రకాల పాలసీలు అందిస్తోంది. అత్యంత సంపన్నుల కోసం రూపొందించిన ప్లాటినం కవరేజీ పాలసీలో గరిష్టంగా రూ. 50 లక్షల దాకా కవరేజీ మొత్తం ఉంటుంది. ఆస్పత్రిలో చేరితే ప్రైవేట్ రూమ్ ఖర్చులు మొదలుకుని పిల్లలకు పన్నెండేళ్లు వచ్చేదాకా వేయాల్సిన వివిధ టీకాలకయ్యే వ్యయాల దాకా ఇందులో అన్నింటికీ కవరేజీ ఉంటుంది. మరీ అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే కంపెనీ ప్రత్యేకంగా రిలేషన్‌షిప్ డాక్టర్‌ను కూడా పంపిస్తుంది. ఈ పాలసీని మధ్యలో ఆపకుండా కొనసాగిస్తూ ఉన్న పక్షంలో హెల్త్ రిలేషన్‌షిప్ ప్రోగ్రాం సర్వీసులు కూడా పొందవచ్చు. ఈ ప్రోగ్రాం కింద చివరిగా కట్టిన ప్రీమియంలో దాదాపు 10 శాతం దాకా విలువ చేసే వైద్య సేవలు పొందవచ్చు.
ఏజెంట్లకూ ప్రయోజనాలు..
బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో సంపన్న పాలసీదారులకే కాకుండా వారి పాలసీలను తెచ్చిపెట్టే టాప్ పర్ఫార్మెన్స్ ఏజెంట్లకు కూడా కంపెనీపరమైన ప్రయోజనాలు ఉంటాయి. పాలసీల వివరాల వెల్లడి, పత్రాల జారీ మొదలైనవి వేగవంతంగా జరిగేలా తోడ్పడేందుకు ప్రత్యేకంగా రిలేషన్‌షిప్ మేనేజర్లను కంపెనీ అందిస్తోంది. ప్రాధాన్యం గల ఏజెంట్ల నుంచి వచ్చే మెయిల్స్‌ను వెంటనే గుర్తించేలా వారికి స్పెషల్ ఈ మెయిల్ ఐడీలు ఇస్తుంది. సంస్థ ఖాతాలో ప్రస్తుతం 4,00,000 పైచిలుకు హెచ్‌ఎన్‌ఐ కస్టమర్లు ఉన్నారు. సంస్థ మొత్తం పాలసీదారుల్లో ఇది ఆరు శాతం.
అందుబాటులోకి ఐటీ కొత్త వెబ్‌సైట్
ఆదాయ పన్ను విభాగం తాజాగా మరింత మెరుగుపర్చిన వెబ్‌సైట్‌ను పన్ను చెల్లింపుదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదుల పరిష్కారానికి, సత్వరం ఇతరత్రా సర్వీసులు సులువుగా పొందేందుకు అవసరమైన లింక్‌లను ఇందులో పొందుపర్చింది.
www.incometaxindia.gov.in పేరిట అందుబాటులోకి వచ్చిన కొత్త వెబ్‌సైట్ మొదటి పేజీలో ‘ట్యాక్స్‌పేయర్ సర్వీసెస్’ అనే కొత్త లింకు ఉంటుంది. పాన్ కార్డు పొందడం దగ్గర్నుంచి ఈ-రిటర్నుల దాఖలు, రీఫండ్‌ల గురించి తెలుసుకోవడం, ఫిర్యాదులు నమోదు చేయడం దాకా వివిధ సర్వీసుల పేజీని ఈ లింకుతో అనుసంధానం చేశారు.