దుండగుల కాల్పుల్లో ధ్వంసమైన జర్నలిస్టుల బస్సు అద్దాలు
రియో: విశ్వక్రీడాపోటీల వేదిక.. ఒలింపిక్ విలేజ్ లో కాల్పులు చోటుచేసుకున్నాయి. క్రీడా ప్రాంగణంలో జర్నలిస్టులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. బ్రెజిల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.
వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు బాస్కెట్ బాల్ వేదిక నుంచి ప్రధాన వేదికకు బస్సులో వెళుతుండగా, మార్గం మధ్యలో కాల్పులు జరిగాయని, బస్సు కిటీకి అద్దాలను ధ్వసం చేసుకుంటూ దూసుకొచ్చిన బుల్లెట్ దెబ్బకు ఒకరు స్వల్పంగా గాయపడ్డారని ప్రత్యక్షసాక్షలులు వెల్లడించారు. అయితే అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. రియోలో కాల్పులకు అవకాశమేలేదని, ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించామని, అద్దాలను ధ్వసం చేసింది బుల్లెట్లా లేక రాళ్లా అనే విషయం తెలియాల్సిఉందని రియో క్రీడల నిర్వాహక కమిటీ అధికార ప్రతినిధి మారియో అండ్రాడ తెలిపారు. (తప్పక చదవండి: రియో.. వెలుగుల్లో చీకట్లు)
అసలే దోపిడీలు, హత్యలు విరివిగా చోటుచేసుకునే బ్రెజిల్ లో.. విశ్వక్రీడల ప్రారంభానికి ముందే భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం.. ఒలింపిక్ గ్రామంలో(స్పోర్ట్స్ విలేజ్) సహా రియో నగరమంతా భారీ భద్రతా ఏర్పాటుచేసింది. అయినాసరే, గత శనివారం క్రీడాప్రాంగణానికి సమీపంలో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం. చిన్నా చితకా అల్లర్లు కూడా జరిగాయి.