అధికారులూ.. కార్లు దిగి బస్సెక్కండి! | rtc rules follow of Circular -33 | Sakshi
Sakshi News home page

అధికారులూ.. కార్లు దిగి బస్సెక్కండి!

Published Thu, Aug 27 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

అధికారులూ.. కార్లు దిగి బస్సెక్కండి!

అధికారులూ.. కార్లు దిగి బస్సెక్కండి!

ఆర్టీసీ పొదుపు మంత్రం
ఇక తెల్లకాగితం ముక్కకూ లెక్కే
మార్చి వరకు ఒక్క కుర్చీ ఖర్చు కూడా కనిపించొద్దు
ఆర్టీసీలో హడలెత్తిస్తున్న సర్క్యులర్-33
•  కొసరు చర్యలు భేష్... మరి అసలు వృథా సంగతేంటి?

సాక్షి, హైదరాబాద్: డిపో మేనేజర్లు ఆర్టీసీ బస్సుల్లోనే ఆఫీసులకెళ్లాలి. వచ్చే మార్చి చివరి వరకు కొత్తగా ఒక్క కుర్చీ, బల్ల కూడా కొనొద్దు.. లైట్ వేసే ముందు కరెంటు బిల్లును గుర్తుచేసుకోవాలి. ఒక్క తెల్లకాగితాన్ని కూడా అనవసరంగా వాడొద్దు..

ఈ నిబంధనలతో కూడిన సర్క్యులర్-33 ఇప్పుడు ఆర్టీసీలో హడలెత్తిస్తోంది. ఇటీవల జరిగిన సుదీర్ఘ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ సర్క్యులర్‌ను జారీచేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటనతో పెరిగిన జీతాలు సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే వరస నష్టాలతో దివాళా దిశగా సాగుతున్న ఆర్టీసీని ఈ జీతాల భారం చావుదెబ్బతీసింది. మీ తిప్పలేదో మీరే పడండంటూ ప్రభుత్వం చేతులెత్తేయటంతో ఈడీలు, ఆర్‌ఎంలతో మేధోమథన సమావేశం నిర్వహించిన జేఎండీ పొదుపు సూత్రాలతో తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.
 
సర్క్యులర్ 33లోని ముఖ్యాంశాలు
డిపో అధికారులు ఆఫీసులకు, సమావేశాలకు, ఫీల్డ్ విజిట్‌కు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాలి. కార్లు, జీపుల ఖర్చును ఆదా చేయాలి.
వచ్చే మార్చి 31 వరకు డిపోలు, ఆర్‌ఎం కార్యాలయాల్లో ఎలాంటి ఫర్నిచర్ కొనొద్దు. టీఏ, డీఏలను నియంత్రించాలి.
సెల్‌ఫోన్, కార్యాలయ ఫోన్ బిల్లులను నియంత్రించాలి. ఏసీలు, లైట్లు, ఫ్యాన్లు జాగ్రత్తగా వాడి కరెంటు బిల్లులు తగ్గించాలి.
బస్‌స్టేషన్, బస్టాపులు, కొత్త బస్సుల ప్రారంభోత్సవ ఖర్చులు తగ్గించాలి.
ఒక్క తెల్లకాగితాన్ని కూడా వృథా చేయకుండా స్టేషనరీ బిల్లులకు అడ్డుకట్ట వేయాలి.
అనసవర సమావేశాల పేర చేసే ఖర్చులు పూర్తిగా అదుపు చేయాలి.
 
మరి వీటి సంగతేంటి..?
♦  బెంగళూరులో 6,300 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. సంవత్సరం క్రితం వరకు అక్కడ లాభాలే లాభాలు. వేతన సవరణ తో ఈ సంవత్సరమే స్వల్ప నష్టం వ చ్చింది. అంతే జనాభా ఉన్న హైదరాబాద్‌లో కేవలం 3,500 బస్సులే తిరుగుతున్నాయి. అంటే ఆక్యుపెన్సీ అక్కడికంటే ఎ క్కువ ఉండటం సహజం. అంటే లా భాలు ఎక్కువగా ఉండాలి. కానీ గడచిన 12 నెలల్లో సిటీ నష్టాలు రూ.165 కోట్లు.
♦  రాష్ట్రప్రభుత్వంలోని ఏ కార్పొరేషన్‌లో లేనట్టు ఆర్టీసీలో అధికారుల స్థాయిని బట్టి జీతానికి అదనంగా ‘గ్రేడ్ పే’ చెల్లిస్తున్నారు. తాజా వేతన సవరణతో ఇది సూపర్ స్కేల్ అధికారులకు నెలకు రూ.35 వేలు, స్పెషల్ కేడర్ అధికారులకు రూ.12 వేలు, సీనియర్ స్కేల్ అధికారులకు రూ.8 వేలు, జూనియర్ స్కేల్ అధికారులకు రూ.5 వేలు చెల్లిస్తున్నారు. ఈ రూపంలో వార్షిక భారం రూ.కోట్లలోనే ఉంది.
♦  ప్రివిలేజి పాస్ రూపంలో రీయింబర్స్‌మెంట్లు కూడా తడిసి మోపెడవుతున్నాయి. ఆర్టీసీ అధికారుల భార్య/భర్తలు ప్రభుత్వ ఉద్యోగులైతే దీన్ని వాడొద్దు. ఆ రూపంలో లక్షల్లో దుర్వినియోగమవుతోంది.
♦  కొందరు అధికారులకు ఇద్దరు ముగ్గురేసి డ్రైవర్లు ఉన్నారు. వీరంతా బస్సు డ్రైవర్లే. వీరి జీతాలే నెలకు లక్ష దాటుతున్నాయి. ఆ కార్ల మరమ్మతుల పేర భారీ ఖర్చు చూపుతున్నారు. అద్దె కార్లు వినియోగిస్తే ఇందులో మూడొంతులు ఆదా అవుతుంది.
 
ఆర్టీసీలో ప్రమాద ఘంటికలు
ఈ ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల నష్టం రూ.97.18 కోట్లు.
కొత్త వేతన సవరణతో నెలవారీ జీతాల భారం రూ.75.25 కోట్లు.
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌తో ఏడాదికి పెరిగిన జీతాల భారం4.2 కోట్లు     కొత్త వేతన సవరణ 2013 నుంచి అమలులోకి రావటంతో ఏర్పడ్డ బకాయిలు రూ.1,518 కోట్లు.
అప్పులకు నెలసరి వడ్డీ రూ.11 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement