
మూడోరోజూ పుంజుకున్న రూపాయి
ముంబై: రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రకటించిన చర్యలు.. దేశీ కరెన్సీకి వరుసగా మూడోరోజూ బూస్ట్ ఇచ్చాయి. శుక్రవారం డాలరుతో రూపాయి మారకం విలువ మరో 77 పైసలు ఎగబాకి 65.24 వద్ద స్థిరపడింది. గడచిన రెండు వారాల్లో ఇదే అత్యధిక స్థాయి కావడం(గత నెల 26న 64.30తో పోలిస్తే) గమనార్హం. ఎగుమతిదారులు డాలర్లను విక్రయిస్తుండటం, విదేశీ కరెన్సీలతో డాలరు విలువ అంతర్జాతీయంగా బలహీనపడటం వంటివి రూపాయి పుంజుకోవడానికి చేదోడుగా నిలిచాయి. అదేవిధంగా దేశీయంగా స్టాక్ మార్కెట్లు మూడోరోజూ లాభాల జోష్‌ను కొనసాగించడం, విదేశీ నిధుల ప్రవాహం కూడా దేశీ కరెన్సీకి బలాన్ని అందించాయి. గత మూడు రోజుల్లో 239 పైసలు(3.53 శాతం) బలపడింది.
జీ-20 పరిణామాల ఎఫెక్ట్...
అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీల ఉపసంహరణ ప్రభావాన్ని ఎదుర్కోవడం కోసం 100 బిలియన్ డాలర్ల కరెన్సీ రిజర్వ్ ఫండ్‌ను ఏర్పాటు చేసేందుకు జీ-20 సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాల కూటమి నిర్ణయించడం తెలిసిందే. భారత్, జపాన్‌లు కరెన్సీ మార్పిడి(స్వాప్) ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. ప్రస్తుతం 15 బిలియన్ డాలర్ల స్వాప్ ఒప్పందాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకోవడం కూడా రూపాయికి చేయూతనిచ్చింది.