టెన్త్ క్లాస్ పాసైన టాప్ హీరోయిన్
ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రింకూ రాజ్‌గురూ అలియాస్ ప్రేరణ పదోతరగతి ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణురాలైంది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘సైరత్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రింకూ.. ఆ సినిమా విడుదల అనంతరం ఓవర్‌నైట్ టాప్ స్టార్‌గా ఎదిగింది. సైరత్‌లో నటనకుగానూ రింకూకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.
మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని అక్లుంజ్ అనే చిన్న పట్టణానికి చెందిన 17 ఏళ్ల రింకూ.. మంగళవారం వెల్లడైన పదోతరగతి ఫలితాల్లో 66.40 శాతం మార్కులు సాధించారు. హిందీ సబ్జెక్టులో అత్యధికంగా 87 మార్కులు రాగా, మాతృభాష మరాఠీలో 83 మార్కులు సాధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో 42, మ్యాథ్స్ 48, సోషల్ 50, ఇంగ్లీష్ 59 స్కోరింగ్ చేసింది. జజియామాతా కన్యా ప్రశాల స్కూల్లో చదువుకున్న ఆమె.. స్టార్‌డమ్ కారణంగా పాఠశాలకు వెళ్లలేక ప్రైవేటుగా పరీక్షరాసింది.
త్వరలో తెలుగులోకి..
మరాఠీ సినిమా చరిత్రలో 100కోట్ల వసూళ్లు సాధించిన తొలిసినిమాగా రికార్డులకెక్కిన ‘సైరత్’ ను పలు భారతీయ భాషల్లో రీమేక్ చేసేందుకు నిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హిందీలో సైరత్‌ను రీమేక్ చేయనున్నారు. నటి శ్రీదేవి కూతురు జాన్వీని ఈ సినిమా ద్వారానే వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఇక కన్నడలో ‘మనసు మలిగే’ పేరుతో సైరత్ రీమేక్ అయింది. ఇందులో రింకూనే హీరోయిన్‌గా నటించింది. కన్నడ హక్కులు పొందిన నిర్మాత రాక్‌లైన్ వెంకటేషే.. తెలుగులోనూ సైరత్‌ను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులోనూ రింకూనే హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం.